Two Wheeler ABS System: త్వరలో బైక్ లేదా స్కూటర్ కొనాలని ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే మీకో బ్యాడ్ న్యూస్. మరికొద్ది రోజుల్లో టూవీలర్ల ధరలు పెరగొచ్చు అంటున్నారు. ఎందుకంటే, కేంద్ర ప్రభుత్వం ఏబీఎస్ (ABS) సిస్టమ్‌ని అన్ని టూవీలర్లకు తప్పనిసరి చేయబోతుంది. దీనివల్ల బైక్‌ల రేటు రూ.2,000 నుండి రూ.5,000 వరకు పెరగొచ్చని నిపుణులు చెబుతున్నారు. రోడ్డు ప్రమాదాల్లో చనిపోతున్న వారిలో టూవీలర్ నడిపే వాళ్ళే ఎక్కువగా ఉండడంతో, ప్రభుత్వం వాళ్ళ భద్రతపై స్పెషల్ ఫోకస్ పెట్టింది. ఇప్పటివరకు 150 సీసీ కంటే ఎక్కువ ఇంజిన్ కెపాసిటీ ఉన్న బైక్‌లకే ఏబీఎస్ తప్పనిసరిగా ఉండేది.
Also Read: యోగా వల్ల ప్రయోజనాలు ఏంటి? ఎందుకు చేయాలి?
టూవీలర్ నడిపే వాళ్ళ సేఫ్టీని ఇంకా పెంచడానికి కేంద్ర రోడ్డు రవాణా మంత్రిత్వ శాఖ కొన్ని స్టెప్స్ తీసుకుంది. ఇందులో భాగంగా 2026 జనవరి 1వ తేదీ నుంచి అన్ని కొత్త టూవీలర్లకు యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్) కచ్చితంగా ఉండాలని నిర్ణయించింది. ప్రస్తుతం ఈ రూల్ 125 సీసీ ఇంజిన్ కెపాసిటీ దాటిన టూవీలర్లకే ఉంది. కానీ, ఇకపై ఇంజిన్ కెపాసిటీతో సంబంధం లేకుండా, అన్ని స్కూటీలు, బైక్‌లు, మోటార్‌సైకిళ్లకు ఏబీఎస్ తప్పనిసరి కానుంది.
ఇది మాత్రమే కాదు, కొత్త టూవీలర్ కొనేటప్పుడు, డీలర్‌లు వాహనం కొనే వారికి రెండు బీఐఎస్ (BIS) సర్టిఫైడ్ హెల్మెట్‌లను కూడా కచ్చితంగా ఇవ్వాలి. ఇందులో ఒక హెల్మెట్ బండి నడిపే వాళ్ళకి, ఇంకోటి వెనక కూర్చునే వాళ్ళకి. ఈ రెండు రూల్స్‌కి సంబంధించిన నోటిఫికేషన్లు త్వరలోనే రాబోతున్నాయని తెలుస్తోంది.
ఏబీఎస్ వల్ల ధరలు ఎందుకు పెరుగుతాయి?
ఏబీఎస్ సిస్టమ్‌ను అన్ని కొత్త టూవీలర్లకు పెట్టడం వల్ల వాటి ధర పెరుగుతుందని అంటున్నారు. ఏబీఎస్‌ను తప్పనిసరి చేయడం వల్ల ఎంట్రీ లెవెల్ (తక్కువ ధర) టూవీలర్ల ధర కనీసం రూ.2,000 పెరగొచ్చని అంచనా వేస్తున్నారు.
ఏబీఎస్ అంటే ఏంటి? ఎలా పనిచేస్తుంది ?
యాంటీ లాక్ బ్రేకింగ్ సిస్టమ్ (ఏబీఎస్) అంటే, మనం సడన్‌గా బ్రేక్ వేసినప్పుడు, బైక్ లేదా స్కూటర్ చక్రాలు ఒకేసారి లాక్ అవ్వకుండా ఆపుతుంది. దీనివల్ల బ్రేక్ వేసినా బండి అదుపు తప్పకుండా, సురక్షితంగా ఆగుతుంది. సాధారణంగా, మనం బైక్‌లో స్పీడ్‌గా వెళ్తున్నప్పుడు సడన్‌గా బ్రేక్ వేస్తే, చక్రాలు గట్టిగా లాక్ అయిపోయి టైర్ రోడ్డుకి అతుక్కుపోతుంది. దీనివల్ల బండి స్కిడ్ అయ్యి, అదుపుతప్పి పడిపోయే ప్రమాదం ఉంటుంది. ముఖ్యంగా రోడ్డు తడిగా ఉన్నప్పుడు, లేదా ఇసుక, కంకర ఉన్నప్పుడు ఇది ఎక్కువగా జరుగుతుంది. ఏబీఎస్ ఉన్న బైక్‌లలో ప్రతి చక్రానికి ఒక సెన్సార్ ఉంటుంది. మనం బ్రేక్ వేసినప్పుడు, ఈ సెన్సార్ చక్రం తిరుగుతుందా, లేదా లాక్ అయిపోయిందా అని చూస్తుంది. ఒకవేళ చక్రం లాక్ అవ్వడానికి రెడీగా ఉందని సెన్సార్ పసిగడితే, ఏబీఎస్ సిస్టమ్ వెంటనే బ్రేకింగ్ ఫోర్స్‌ను (బ్రేక్ పడే శక్తిని) కొన్ని మిల్లీసెకన్ల పాటు తగ్గిస్తుంది. మళ్ళీ చక్రం కొంచెం తిరగడం మొదలుపెట్టగానే, బ్రేకింగ్ ఫోర్స్‌ను పెంచుతుంది. ఇలా చాలా వేగంగా, సెకన్‌కి పదుల సంఖ్యలో బ్రేక్‌ను పడుతూ, వదులుతూ ఉంటుంది. దీనివల్ల చక్రం లాక్ అవ్వకుండా, బైక్ అదుపుతప్పకుండా, రైడర్ బైక్‌ను కంట్రోల్ చేస్తూనే బ్రేక్ వేయగలుగుతాడు. ప్రమాదం జరిగే అవకాశం చాలా తగ్గుతుంది. ఏబీఎస్ సిస్టమ్‌ను బైక్‌లలో పెట్టడం వల్ల వాటి ధరలు కచ్చితంగా పెరుగుతాయి.
ఏబీఎస్ సిస్టమ్ అంటే ఒక చిన్న చిప్ కాదు. దీనికి స్పెషల్ సెన్సార్లు, కంట్రోల్ యూనిట్ (ECU), బ్రేకింగ్ ఫోర్స్‌ను అడ్జస్ట్ చేసే హైడ్రాలిక్ వాల్వ్‌లు, ఇంకా వాటిని కనెక్ట్ చేసే వైరింగ్ లాంటి చాలా కాంపోనెంట్స్ అవసరం. ఇవన్నీ బైక్‌కు అదనంగా పెట్టాలి, ఈ కాంపోనెంట్స్ తయారు చేయడానికి, వాటిని బైక్‌లో సరిగ్గా అమర్చడానికి చాలా అధునాతన టెక్నాలజీ అవసరం. ఈ టెక్నాలజీ ఖరీదైనది. బైక్‌లకు సరిపోయే ఏబీఎస్ సిస్టమ్‌ను డిజైన్ చేయడానికి, టెస్ట్ చేయడానికి, ఇంకా పర్ఫెక్ట్‌గా పని చేయడానికి ఆటోమొబైల్ కంపెనీలు చాలా డబ్బు ఖర్చు చేస్తాయి. ఈ రీసెర్చ్ అండ్ డెవలప్‌మెంట్ ఖర్చు కూడా బైక్ ధరలో కలుపుతారు.
Also Read: ప్రపంచ యోగా దినోత్సవం: మోడీ, చంద్రబాబు, పవన్ లు ఏమన్నారంటే?