దేశంలో కొత్త కార్ల కంటే సెకండ్ హ్యాండ్ కార్లకు అంతకంతకూ డిమాండ్ పెరుగుతోంది. ఈ ఏడాది ఇప్పటివరకు 2.6 మిలియన్ల కొత్త కార్లు అమ్ముడవగా 3.8 మిలియన్ల వినియోగించిన కార్లు అమ్ముడయ్యాయి. 2025 సంవత్సరం నాటికి సెకండ్ హ్యాండ్ కార్ల విక్రయాల సంఖ్య 85 లక్షలకు చేరుకునే అవకాశాలు అయితే ఉన్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ కూడా కార్ల డిమాండ్ పెరగడానికి మరో కారణమని చెప్పవచ్చు.
ప్రజలు బస్ లలో, రైళ్లలో ప్రయాణం రిస్క్ అని భావించి కార్లను కొనుగోలు చేయడానికి ఆసక్తి చూపుతున్నారు. అయితే సెకండ్ హ్యాండ్ కారును కొనుగోలు చేసేవాళ్లు ఖచ్చితంగా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. కారును కొనుగోలు చేయాలని అనుకుంటే రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ ను చెక్ చేయడంతో పాటు వాహనం యొక్క బీమా తనిఖీ చేయాలి. రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ లో వాహనం యొక్క చాసిస్ నంబర్, యజమాని పేరు ఆర్టీవోలో వివరాలతో సరిపోలిందో లేదో చెక్ చేసుకోవాల్సి ఉంటుంది.
ఆ తర్వాత వాహనాన్ని అన్ని రకాలుగా తనిఖీ చేయాల్సి ఉంటుంది. కారు నాలుగు తలుపులు, బోనెట్, ట్రంక్, టైర్లు చెక్ చేసుకోవడంతో పాటు వాహనం గీతలు లేదా ఇతర దెబ్బ తిన్న భాగాలను పరిశీలించాలి. కారు రకాన్ని బట్టి ఎలక్ట్రిక్ పరికరాలను చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇంజిన్ సౌండ్ వినడానికి షార్ట్ టెస్ట్ డ్రైవ్ ఉపయోగపడే అవకాశాలు ఉంటాయి. టెస్ట్ డ్రైవ్ సమయంలో స్టీరింగ్, సస్పెన్షన్ చెక్ చేయాలి.
కారు మీద చలానాలు ఉన్నాయా..? లేదా..? అనే వివరాలను కూడా పరిశీలించి తెలుసుకోవాల్సి ఉంటుంది. ఈ జాగ్రత్తలు తీసుకోకుండా కారును కొనుగోలు చేస్తే మాత్రం ఇబ్బందులు పడక తప్పదని చెప్పవచ్చు.