Byju’s: ఎడ్ టెక్ కంపెనీ బైజూస్ కష్టాలు మరింత తీవ్రతరమవుతున్నాయి. కోవిడ్ టైంలో ప్రారంభమైన ఈ కంపెనీ అనతి కాలంలోనే అందనంత ఎత్తుకు ఎదిగిపోయింది.. ఏకంగా టీమిండియా క్రికెట్ జట్టుకు స్పాన్సర్షిప్ చేసే స్థాయికి విస్తరించింది. పెరుగుట విరుగుట కొరకే అన్నట్టు ఏ స్థాయిలో అయితే పెరిగిందో అదే స్థాయిలో కుప్పకూలడం మొదలుపెట్టింది. పెట్టుబడిదారులు తమ వాటాలను అమ్ముకోవడం.. డబ్బులు ఇచ్చినవారు ఒత్తిడి తేవడంతో బైజూస్ నేల చూపులు చూస్తోంది.. ఇది కాకుండా ఈ సంస్థకు సంబంధించిన ఖాతా పుస్తకాలను క్షుణ్ణంగా పరిశీలించాలని కేంద్ర కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ ఆదేశాలు జారీ చేయడం ప్రస్తుతం ఇండియన్ వ్యాపార వర్గాల్లో కలకలం రేపుతోంది. ఈ తనిఖీ నివేదికను ఆరు వారాల్లో ఇవ్వాలని కేంద్ర మంత్రిత్వ శాఖ కోరడం విశేషం.
ముగ్గురు విడిపోయారు
ఇటీవల ఈ సంస్థకు చెందిన ముగ్గురు బోర్డు సభ్యులు, ఆడిటర్ వీడిపోయారు. ఈ పరిణామం సంస్థలో ఏదో జరుగుతోందన్న సంకేతాలు ఇచ్చింది. మరోవైపు అప్పుల చెల్లింపు ఆలస్యం అవడంతో ఇన్వెస్టర్లు కేంద్రానికి ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ బై జూస్ లో ఏం జరుగుతుందో వివరణ ఇవ్వాలని అధికారులను ఆదేశించింది. దీంతో వారు సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ ప్రారంభించనున్నారు. అయితే ఈ దర్యాప్తుకు సంబంధించి ఎంసీఏ నుంచి కంపెనీకి ఇంకా ఎటువంటి సమాచారం అందలేదని ఆ సంస్థకు సలహాలు ఇస్తున్న ఓ న్యాయ సంస్థ తెలిపింది. ఈ విషయానికి సంబంధించి పూర్తి వివరాలు తెలుసుకునేందుకు ఆ న్యాయ సంస్థ సంప్రదించగా కేంద్ర కార్పొరేట్ వ్యవహారాలు పరిశీలించే మంత్రిత్వ శాఖ స్పందించలేదు. ఇక బైజూస్ 2022 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి తన ఆర్థిక నివేదికలను ఇంతవరకు సమర్పించలేదని తెలుస్తోంది. జాతీయ ఫండ్ కు బకాయిలు చెల్లించలేకపోవడంతో ఈ ఎడ్ టెక్ కంపెనీకి ఇబ్బందులు పెరుగుతున్నాయి. దీనికి తోడు ఈ సంస్థ విదేశీ మారకపు చట్టాలను ఉల్లంఘించిందనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
బ్లూమ్ బర్గ్ ఏం చెబుతోందంటే..
బై జూస్ కంపెనీకి సంబంధించి అంతర్గత ఆడిట్లోని అంశాలు బయటకు వచ్చిన తర్వాత ఆ కంపెనీకి సంబంధించిన ఎకౌంటు బుక్స్ పై ఇన్వెస్టిగేషన్ చేయాలని కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ నిర్ణయించింది. ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్ వచ్చిన తర్వాత దానిలోని వివరాలు మంత్రిత్వ శాఖ పరిశీలిస్తుంది. నివేదిక లోని అంశాలను “ఎస్ఎఫ్ఐఓ”కు బదిలీ చేయాలా? వద్దా? అన్నది నివేదికలోని విషయాల ఆధారంగా నిర్ణయం తీసుకుంటుంది. ఎంసీఏ ఆధ్వర్యంలో సీరియస్ ఫ్రాడ్ ఇన్వెస్టిగేషన్ పనిచేస్తుంది. ఇటీవల నిధుల సేకరణ సమయంలో 22 బిలియన్ డాలర్ల విలువ కలిగిన బైజూస్ కు ఈ పరిణామం కొత్త తలనొప్పి కానుంది. కోవిడ్ సమయంలో ఒక్కసారిగా పుంజుకున్న ఈ కంపెనీ అమెరికాకు చెందిన ఓ సంస్థతో 1.2 బిలియన్ డాలర్ల విలువైన రుణ ఒప్పందానికి సంబంధించి చర్చలు జరుపుతోంది. అప్పులు పెరిగిపోవడంతో ఒకప్పుడు స్టార్టప్ రంగంలో ఇతర కంపెనీలకు ఆదర్శంగా నిలిచిన ఈ సంస్థ ఇప్పుడు వేలాది మంది ఉద్యోగులను అడ్డగోలుగా తొలగించింది. నివేదికలో ఎటువంటి విషయాలు వెలుగు చూస్తాయో తెలియదు కానీ.. ప్రస్తుతానికి అయితే ఒకప్పుడు ఒక వెలుగు వెలిగిన ఈ ఎడ్ టెక్ కంపెనీ మాత్రం ఇప్పుడు నేల చూపులు చూస్తోంది. రేపటి నాడు ఏదైనా జరగొచ్చు అని కార్పొరేట్ వర్గాలు అంచనా వేస్తున్నాయంటే.. పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు.