https://oktelugu.com/

Anil Ambani: వ్యాపారంలో నష్టం.. కోర్టు తీర్పులతో కష్టం.. అనిల్ అంబానీ ఇక ఎదగలేడా?

ఇప్పటికే తీవ్ర నష్టాల్లో ఉన్న అనిల్ అంబానికి ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు మరింత ఇబ్బందికి గురి చేసింది. అనిల్ అంబానీ రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీకి చెందిన 1,100 కోట్ల విలువైన ఆస్తులను విక్రయించడం లేదా బదిలీ చేయడం లేదా తాకట్టు పెట్టడంపై ఢిల్లీ హైకోర్టు నిషేధం విధించింది.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : March 10, 2024 / 02:03 PM IST

    Anil Ambani

    Follow us on

    Anil Ambani: ఆ మధ్య ముఖేష్ అంబానీ ఇంట్లో ముందస్తు పెళ్లి వేడుకలు జరిగినప్పుడు అతడి సోదరుడు అనిల్ అంబానీ కూడా వచ్చాడు. తన బ్యాగులు తానే మోసుకుంటూ సాదాసీదా వ్యక్తి లాగా అక్కడ కనిపించాడు. చూసేవాళ్ళకు ఆ దృశ్యం ఇబ్బందిగా అనిపించింది. ఒకప్పుడు మనదేశంలో అతిపెద్ద ధనవంతుల్లో ఒకడిగా ఉన్న ఈ వ్యక్తి ఇలా మారిపోవడం పట్ల చాలామంది బాధపడ్డారు. మీడియా కూడా అదే విషయాన్ని పదే పదే ప్రస్తావించింది. ఆర్థికంగా పతనం తర్వాత అనిల్ అంబానీ బయట కనిపించడం దాదాపు అదే మొదటిసారి. మనిషి మొత్తం కుంగిపోయాడు. సాధారణ దుస్తుల్లో కనిపించాడు. అటువంటి అనిల్ అంబానీ కి ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు మరింత శరాఘాతంగా పరిణమించింది.

    ఇప్పటికే తీవ్ర నష్టాల్లో ఉన్న అనిల్ అంబానికి ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన తీర్పు మరింత ఇబ్బందికి గురి చేసింది. అనిల్ అంబానీ రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీకి చెందిన 1,100 కోట్ల విలువైన ఆస్తులను విక్రయించడం లేదా బదిలీ చేయడం లేదా తాకట్టు పెట్టడంపై ఢిల్లీ హైకోర్టు నిషేధం విధించింది. అనిల్ అంబానికి చెందిన రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీకి చైనాకు చెందిన షాంగై ఎలక్ట్రిక్ గ్రూప్ న కు 2008లో ఒక ఒప్పందం జరిగింది. సాసన్ పవర్ ప్రాజెక్టుకు సంబంధించి పరికరాలను సరఫరా చేస్తామని రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఒక ఒప్పందం కుదుర్చుకుంది. ఈ ఒప్పందం ప్రకారం వస్తువులు సరఫరా చేయకపోవడంతో షాంగై ఎలక్ట్రిక్ గ్రూప్ రిలయన్స్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ పై సింగపూర్ కోర్టులో కేసు వేసింది. వాదోపవాదాలు విన్న కోర్టు షాంగై కంపెనీకి 146 మిలియన్ డాలర్ల పరిహారం చెల్లించాలని అనిల్ అంబానీకి చెందిన కంపెనీని ఆదేశించింది. అయితే ఈ మొత్తాన్ని మిడ్ టర్మ్ రిలీఫ్ గా తమకు అందించాలని షాంగై కంపెనీ కోరింది. 2022లో సింగపూర్ కోర్టు తీర్పుకు అనుగుణంగా తమకు న్యాయం చేయాలని విన్నవించింది.. దీనికి సంబంధించి ఢిల్లీ హైకోర్టులో కోర్టులో ఒక పిటిషన్ కూడా దాఖలు చేసింది. దీనిని సింగిల్ జడ్జి విచారించారు.. ఈ కేసు విచారణలో భాగంగా రిలయన్స్ వాదనను అంగీకరించేందుకు షాంగై కంపెనీ ఒప్పుకోలేదు. ఇరుపక్షాల వాదనలు విన్న ఢిల్లీ హైకోర్టు అనిల్ అంబానీ కంపెనీకి చెందిన 1,100 కోట్లకు పై ఆస్తులను జాగ్రత్తగా ఉంచాలని, వాటిని అమ్మకం లేదా బదిలీ చేయకూడదని ఆదేశించింది. హైకోర్టు తీర్పు నేపథ్యంలో అనిల్ అంబానీ ఒక్కసారిగా నిరాశ చెందారు. దీనివల్ల సమస్య మరింత జటిలమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.

    ఇప్పుడంటే తీవ్ర నష్టాల్లో ఉన్నారు గాని.. ఒకప్పుడు అనిల్ అంబానీ దేశంలో ప్రముఖ వ్యాపారవేత్తగా కొనసాగారు. అప్పట్లో భారత సంపన్నుల జాబితాలో ఆరవ స్థానంలో ఉండేవారు. అనిల్ నికర ఆస్తుల విలువ 1.83 లక్షల కోట్లుగా ఉండేది. అప్పులు, వ్యాపార విస్తరణలో ముందు చూపు లేకపోవడం, వృధా ఖర్చులతో అనిల్ వ్యాపార సామ్రాజ్యం కూలిపోయింది. ఫలితంగా ఆయన దివాలా తీశారు. ఒకప్పుడు ఆరవ అతిపెద్ద ధనవంతుడిగా కొనసాగిన ఆయన.. ఇప్పుడు కేసుల పరిష్కారానికి కోర్టుల చుట్టూ తిరుగుతున్నారు. అతనితో పాటు వ్యాపారం మొదలుపెట్టిన ముకేశ్ అంబానీ అతిపెద్ద ధనవంతుడిగా కొనసాగుతున్నారు. వివిధ రంగాలలో పెట్టుబడులు పెట్టి భిన్న వ్యాపారాలు చేస్తున్నారు.