Tata Motors: భారత ప్రభుత్వం పర్యావరణ పరిరక్షణ, ముడి చమురు దిగుమతుల భారాన్ని తగ్గించుకోవడమే లక్ష్యంగా ఇథనాల్ బ్లెండింగ్ కార్యక్రమాన్ని ముమ్మరంగా ముందుకు తీసుకెళ్తోంది. ఇప్పటికే దేశవ్యాప్తంగా E20 (పెట్రోల్ 80శాతం, ఇథనాల్ 20 శాతం)ని అందుబాటులోకి తీసుకువచ్చింది. భవిష్యత్తులో దీనిని E85 లేదా పూర్తి స్థాయిలో E100కు చేర్చాలని ప్రభుత్వం భావిస్తోంది. దీనికి అనుగుణంగా కొన్ని కంపెనీలు ఇలాంటి కార్లనే తయారు చేస్తున్నాయి. అలాంటి వాటిలో TATA ఒకటి. దేశీయ వాహన తయారీ దిగ్గజం ‘టాటా మోటార్స్’ నుంచి E20 కార్లు రాబోతున్నాయి. ఆ వివరాల్లోకి వెళితే…
టాటా మోటార్స్ 2023 నుంచే తమ అన్ని వాహనాలను E20 ప్రమాణాలకు అనుగుణంగా మార్చేసింది. కేవలం ఇథనాల్‌తోనే ఆగకుండా ఎలక్ట్రిక్ (EV), సీఎన్‌జీ (CNG), హైడ్రోజన్ వంటి బహుళ పర్యావరణహిత ఇంధన వనరులపై సంస్థ భారీగా పెట్టుబడులు పెడుతోంది. ఇందులో భాగంగానే ‘భారత్ మొబిలిటీ గ్లోబల్ ఎక్స్‌పో’లో టాటా ప్రదర్శించిన ‘పంచ్ ఫ్లెక్స్-ఫ్యూయల్ కాన్సెప్ట్’ (Tata Punch Flex-Fuel) వాహన ప్రియులను ఎంతగానో ఆకట్టుకుంది.
సాధారణ టాటా పంచ్ కారులో ఉండే 1.2 లీటర్, త్రీ-సిలిండర్ పెట్రోల్ ఇంజన్ నే ఈ ఫ్లెక్స్-ఫ్యూయల్ మోడల్‌లోనూ ఉపయోగించారు. అయితే, ఇథనాల్ స్వభావం పెట్రోల్‌తో పోలిస్తే భిన్నంగా ఉంటుంది. కాబట్టి ఇంజిన్ దెబ్బతినకుండా టాటా ఇంజనీర్లు కీలక మార్పులు చేశారు. ఇంధనంలో ఇథనాల్ శాతం ఎంత ఉందో ఆటోమేటిక్‌గా గుర్తించి, దానికి తగినట్లుగా ఇంజిన్ పనితీరును ఇది మారుస్తుంది. ఇథనాల్ వల్ల తుప్పు పట్టకుండా ఉండేందుకు ఫ్యూయల్ లైన్లు, పంపులు, ఇంజెక్టర్లను ప్రత్యేక మెటీరియల్‌తో తయారు చేశారు. ఇథనాల్ దహన ప్రక్రియ తర్వాత వచ్చే ఉద్గారాలను సమర్థంగా నియంత్రించేలా ఎగ్జాస్ట్ (సైలెన్సర్) వ్యవస్థను రీ-డిజైన్ చేశారు.
ఫ్లెక్స్ ఫ్యూయల్ (Flex-Fuel)వాహనాల వల్ల ఒకే వాహనం 100 శాతం స్వచ్ఛమైన పెట్రోల్ లేదా పెట్రోల్-ఇథనాల్ కలిసిన ఏ ఏ నిష్పత్తి మిశ్రమంతోనైనా (ఉదాహరణకు E85 లేదా E100) ఎలాంటి ఇబ్బంది లేకుండా సాఫీగా వెళ్తుంది. ఇథనాల్ అనేది చెరకు రసం, మొలాసిస్, పాడైపోయిన ధాన్యాలు (మొక్కజొన్న, విరిగిన బియ్యం) వంటి వ్యవసాయ ఉత్పత్తుల నుండి తయారయ్యే ఒక రకమైన బయో-ఫ్యూయల్ (జీవ ఇంధనం). పెట్రోల్‌తో పోలిస్తే ఇథనాల్ మండటం వల్ల కార్బన్ మోనాక్సైడ్, హైడ్రోకార్బన్ల ఉద్గారాలు గణనీయంగా తగ్గుతాయి. ఇది గాలి నాణ్యతను మెరుగుపరుస్తుంది.మరోవైపు ఇథనాల్ తయారీకి వ్యవసాయ వ్యర్థాలు, పంటలు అవసరం కాబట్టి దేశీయ రైతులకు అదనపు ఆదాయ వనరు లభిస్తుంది. గ్రామీణ ఆర్థిక వ్యవస్థ బలోపేతం అవుతుంది. టాటా మోటార్స్ ప్రదర్శించిన పంచ్ ఫ్లెక్స్-ఫ్యూయల్ కాన్సెప్ట్.. భారతదేశం స్వయంసమృద్ధి, హరిత భవిష్యత్తు వైపు వేగంగా అడుగులు వేస్తోందనడానికి ఒక బలమైన నిదర్శనం.