Swiggy Most Ordered Food: ఒకప్పుడు ఇంట్లో వండుకొని తినేవారు. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. హోటల్లోకి వెళ్లి తినడం కూడా తగ్గిపోయింది. ఏదైనా సరే ఇంటికి తెప్పించుకొని.. తినడం పరిపాటిగా మారిపోయింది. జనాల అవసరాల ఆధారంగా అనేక సంస్థలు పుట్టుకొచ్చాయి. కేవలం ఒక క్లిక్ దూరంలోనే అన్నింటిని అందించే సదుపాయాన్ని తీసుకొచ్చాయి. అలా స్విగ్గి, జొమాటో, రాపిడో.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో సంస్థలు అందుబాటులోకి వచ్చాయి.
ప్రతి ఏడాది స్విగ్గి నుంచి మొదలు పెడితే జొమాటో వరకు తమకు అత్యధికంగా ఆర్డర్లు వచ్చిన ఫుడ్ ఐటమ్స్ గురించి వెల్లడిస్తాయి. వాస్తవానికి ఈ జాబితాలో జొమాటో ముందు వరుసలో ఉంటుంది. అయితే ఈసారి జోమాటో కంటే ముందుగా స్విగ్గి తనకు ఈ ఏడాది ఎక్కువగా వచ్చిన ఫుడ్ ఐటెం ఆర్డర్ల గురించి వెల్లడించింది. గత ఏడాది కంటే ఈసారి ఎక్కువ వ్యాపారం చేసినట్టు వెల్లడించిన స్విగ్గి.. దేశవ్యాప్తంగా ఫుడ్ ఐటమ్స్ ఆర్డర్లలో తమకు ఎక్కువగా వచ్చిన వాటి గురించి స్విగ్గి ప్రకటించింది.
స్విగ్గి తెలిపిన 2025 నివేదిక ప్రకారం ఈ ఏడాది అత్యధికంగా ఆర్డర్ వచ్చిన ఆహార ప్రాంతాల జాబితాలో బిర్యాని ముందు వరుసలో ఉంది. ఆ తర్వాత బర్గర్, పిజ్జా, దోశ ఉందని స్విగ్గి తన నివేదికలో ప్రకటించింది. దేశ వ్యాప్తంగా తమ సంస్థకు 93 మిలియన్ బిర్యాని ఆర్డర్లు వచ్చినట్టు ప్రకటించింది.. 44.2 మిలియన్ల బర్గర్లు, 40.1 మిలియన్ల పిజ్జా ఆర్డర్లు వచ్చినట్టు ప్రకటించింది. 26.2 మిలియన్ దోశలు ఆర్డర్లు వచ్చాయని వెల్లడించింది. “ఒకప్పటితో పోల్చితే జనం ఆలోచన విధానం మారింది. తిండి తినే విధానం సంపూర్ణంగా మారింది. అందువల్లే ఆర్డర్లు పెరిగాయి. ఇంతటి అనిశ్చితి కరమైన వాతావరణంలో కూడా ఆర్డర్లు పెరిగాయని” స్విగ్గి ప్రకటించింది.
గత ఏడాది కూడా స్విగ్గి ప్రకటించిన జాబితాలో బిర్యాని నెంబర్ వన్ స్థానంలో ఉండేది. ఈఏడాది కూడా బిర్యాని అదే స్థాయిలో ఘనతను అందుకుంది. ఢిల్లీ నుంచి మొదలుపెడితే టైర్ 2 సిటీల వరకు జనాలు బిర్యానీలనే ముందుగా ఆర్డర్ చేస్తున్నారు. గతంలో చికెన్ బిర్యాని కి మాత్రమే డిమాండ్ ఉండేది. ఇప్పుడు అన్ని బిర్యానిలకు అదే స్థాయిలో డిమాండ్ ఉంటోంది.. ముఖ్యంగా శాకాహార బిర్యానీలను కూడా చాలామంది ఆర్డర్ చేస్తున్నట్టు స్విగ్గి ప్రకటించింది. ఏకంగా 93 మిలియన్ల బిర్యానీలను జనం ఆర్డర్ ఇచ్చారంటే..ఆఫ్ లైన్ లో బిర్యానీ విక్రయాలు ఇంకా ఏ స్థాయిలో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. అన్నట్టు అదేదో సినిమాలో ఫ్యామిలీ మొత్తం ఉప్మా తిని బతికేస్తున్నారా నాన్నా అని మహేష్ బాబు అంటాడు. ఇప్పుడు స్విగ్గి ప్రకటించిన వివరాలు చూస్తే దేశం మొత్తం బిర్యానీ తిని బతికేస్తుందేమో అనిపిస్తోంది..