Hospital Expensive : పెరగనున్న ఆస్పత్రి ఖర్చులు.. ఆపరేషన్ చేయించుకోవాలంటే ఆ చార్జీ చెల్లించాల్సిందే

ఆసుపత్రులలో చికిత్స పొందడం మునుపటి కంటే ఖరీదు కానుంది. ఎందుకంటే చాలా ఆసుపత్రులు రోగుల నుండి 'సర్ ఛార్జీ' లేదా 'పీక్ ఛార్జ్' వసూలు చేయడం ప్రారంభించాయి.

Written By: Mahi, Updated On : October 16, 2024 2:29 pm

Hospital Expensive

Follow us on

Hospital Expensive : ఇండియాలో హాస్పిటల్ బిల్లులు, ఖర్చులతో మధ్యతరగతి కుటుంబాలు దివాళా తీస్తున్నాయి.. ఇది మేం చెబుతున్నది కాదు.. ఇన్సర్ టెక్ అనే సంస్థ నిర్వహించిన సర్వేలో కఠోర నిజం వెల్లడైంది.. అవును.. 71 శాతం మంది ఉద్యోగులు వారి వైద్య ఖర్చుల కోసం తమ జేబులోని డబ్బులు పెడుతున్నారు. ఇటీవల కాలంలో పెరిగిన ఆసుపత్రి ఖర్చులు సగటు మధ్యతరగతి కార్మికుడిని భయాందోళనకు గురిచేస్తున్నాయి. ఏళ్ల తరబడి పొదుపు చేసిన సొమ్మును అనారోగ్యం పాలైతే చిటికెలో ఖర్చు చేసే పరిస్థితి ఉంది. మూలిగే నక్క మీద తాటికాయ పడ్డట్లు ఇప్పుడు ఆసుపత్రులలో చికిత్స పొందడం మునుపటి కంటే ఖరీదు కానుంది. ఎందుకంటే చాలా ఆసుపత్రులు రోగుల నుండి ‘సర్ ఛార్జీ’ లేదా ‘పీక్ ఛార్జ్’ వసూలు చేయడం ప్రారంభించాయి. గతంలో కంటే ఎక్కువ మంది రోగులు ఆసుపత్రిలో చేరినప్పుడు లేదా ఆపరేషన్ థియేటర్ రద్దీగా ఉన్నప్పుడు ఈ రుసుము వర్తిస్తుంది. ఈ ట్రెండ్‌ విమానం టిక్కెట్‌లలో ప్రయాణికుల సంఖ్య పెరిగే కొద్దీ టిక్కెట్‌ ధరలు ఎలా ఉంటుందో అలాగే ఇప్పటి నుంచి ఆస్పత్రుల్లో కూడా అలాగే ధరలు పెరుగుతాయి. ఫ్లైట్‌లో ముందుగా బుక్ చేసుకున్నప్పుడు తక్కువ ధరకే టిక్కెట్లు లభిస్తున్నా, రద్దీ ఎక్కువగా ఉంటే చివరి క్షణంలో ఖరీదైన టిక్కెట్లు పొందినట్లే, ఆసుపత్రుల్లో చికిత్స విషయంలోనూ అదే జరుగుతోంది.

నివేదిక ఏం చెబుతోంది?
‘ఎకనామిక్ టైమ్స్’ ప్రకారం.. ఆరోగ్య రంగంలో ఈ కొత్త ట్రెండ్ వేగంగా పుట్టుకొస్తోంది. ఆపరేషన్ థియేటర్లలో ఆక్యుపెన్సీ ఎక్కువగా ఉండటంతో ఇప్పుడు ఆసుపత్రులు అదనంగా ‘సర్జ్ ఛార్జీలు’ వసూలు చేస్తున్నాయి. ఆపరేషన్ థియేటర్లు నిండిపోవడంతో రోగుల నుంచి వసూలు చేసే ఛార్జీలు కూడా పెరుగుతున్నాయి. ఇది రోగులపై అదనపు ఆర్థిక భారాన్ని మోపడమే కాకుండా, ఆరోగ్య బీమా కంపెనీలకు కొత్త సవాలును కూడా సృష్టిస్తోంది.

పెరుగుతున్న చికిత్స ఖర్చు
ఆరోగ్య బీమా కంపెనీకి చెందిన ఓ అధికారి తెలిపిన వివరాల ప్రకారం.. చికిత్స ఖర్చు సంవత్సరానికి నిరంతరం పెరుగుతోంది. ద్రవ్యోల్బణం రేటు సాధారణం కంటే 14శాతం ఎక్కువగా ఉంది. ఈ ‘సర్జ్ ప్రైసింగ్’ కారణంగా చికిత్స ఖర్చు దాదాపు 20శాతం పెరిగింది. అంతకుముందు సాధారణంగా ఉండే లాపరోస్కోపీ లేదా హిస్టెరెక్టమీ వంటి సాధారణ ప్రక్రియలపై కూడా పీక్ ఛార్జీలు విధించబడుతున్నాయి. ఆసుపత్రులు కూడా తమ చికిత్స పద్ధతులను మార్చుకోవడం ప్రారంభించాయి. ఉదాహరణకు, యాంజియోప్లాస్టీ ప్రక్రియ ఇంతకు ముందు సమగ్ర ప్యాకేజీ కింద అందించబడింది. దీనిలో యాంజియోగ్రామ్, స్టెంటింగ్ రెండూ కలిసి ఉంటాయి. కానీ ఇప్పుడు చాలా ఆసుపత్రులు యాంజియోగ్రామ్ , స్టెంటింగ్ కోసం ప్రత్యేక ఫీజులు వసూలు చేస్తున్నారు. దీంతో రోగులపై అదనపు భారం పడడంతో పాటు బీమా కంపెనీలకు చికిత్సకు అయ్యే ఖర్చును అంచనా వేయడం కష్టమవుతోంది.

బీమా కంపెనీలపై పెరుగుతున్న ఒత్తిడి
ఈ పెరుగుతున్న ఖర్చులు బీమా కంపెనీలపై కూడా ప్రత్యక్ష ప్రభావం చూపుతున్నాయి. ఇంతకుముందు బీమా కంపెనీలు అంచనా వ్యయం ఆధారంగా ప్యాకేజీలను సిద్ధం చేసేవి, కానీ ఇప్పుడు ఆసుపత్రుల నుండి పెరుగుతున్న ‘పీక్ ఛార్జీలు’ కారణంగా, బీమా కంపెనీలు చికిత్స ఖర్చును నియంత్రించలేకపోతున్నాయి. దీంతో బీమా ప్రీమియం కూడా పెరిగే అవకాశం ఉంది. ఆసుపత్రులు అవలంబిస్తున్న కొత్త నియమాలు, ఛార్జీలు రోగులకు ఆందోళన కలిగించే విషయంగా మారుతున్నాయి. ఎందుకంటే చికిత్స ఖర్చు గతంలో కంటే ఇప్పుడు అనూహ్యంగా మారింది. ఇది బీమా కంపెనీల ప్లాన్‌లు, ఆరోగ్య సేవల మొత్తం ఖర్చుపై ప్రత్యక్ష ప్రభావాన్ని చూపుతోంది.