Small Cars: ఒకప్పుడు మధ్యతరగతికి, కొత్తగా కారు కొనుగోలు చేయాలనుకునే వారికి ఫస్ట్ ఆప్షన్ గా నిలిచిన మారుతి ఆల్టో వంటి చిన్న కార్ల డిమాండ్ గత కొన్నేళ్లుగా భారీగా పడిపోతోంది. తాజా నివేదికల ప్రకారం రూ. 5 లక్షల లోపు ధర కలిగిన కార్ల మార్కెట్ వాటా 2015లో 33.6 శాతం ఉండగా, గతేడాది ఇది కేవలం 0.3శాతానికి పడిపోయింది. ఇది చిన్న కార్ల విభాగం దాదాపు కనుమరుగైపోతోందన్న విషయాన్ని స్పష్టం చేస్తుంది.
గత ఐదేళ్లలో రూ. 5 లక్షల లోపు కార్ల ధరలు ఏకంగా 65 శాతం పెరిగాయి. దీనికి భిన్నంగా, సెడాన్లు, ఎస్‌యూవీలు, లగ్జరీ కార్ల ధరలు 24 శాతం వరకు మాత్రమే పెరిగాయి. చిన్న కార్ల ధరలు పెరిగినంత వేగంగా వాటి కొనుగోలుదారుల ఆదాయాలు పెరగకపోవడమే అమ్మకాలు తగ్గడానికి ప్రధాన కారణమని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. కారు ధరలతో పాటు, వాటి మెయింటెనెన్స్ ఖర్చులు కూడా గణనీయంగా పెరిగాయి. పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశాన్నంటడం, సర్వీసింగ్, రిపేర్ ఛార్జీలు, స్పేర్ పార్ట్స్, టైర్ల ధరలు అసాధారణంగా పెరగడంతో మధ్యతరగతిలో చాలా మంది కారు కొనే స్తోమత ఉన్నప్పటికీ, మెయింటెనెన్స్ ఖర్చుల భయంతో కొనుగోలు నిర్ణయాన్ని వాయిదా వేసుకుంటున్నారు.
కరోనా సంక్షోభం తర్వాత తక్కువ ఆదాయ వర్గాల ఆదాయం మరింత తగ్గడం కూడా చిన్న కార్ల డిమాండ్‌పై ప్రభావం చూపిందని ఆటో నిపుణులు చెబుతున్నారు. వాహన తయారీకి ఉపయోగించే ముడిసరుకు ధరలు అమాంతం పెరగడం, అలాగే ప్రభుత్వాలు భద్రతా ప్రమాణాలను కఠినతరం చేయడం కూడా పరోక్షంగా ఈ విభాగంలోని కార్ల అమ్మకాలను దెబ్బతీశాయి.
ప్రస్తుత కారు కొనుగోలుదారులలో చాలా మంది లేటెస్ట్ ఫీచర్లు ఉన్న మోడళ్లను కోరుకుంటున్నారని మార్కెట్ విశ్లేషకులు పేర్కొన్నారు. కనెక్టివిటీ, పెద్ద ఇన్ఫోటైన్‌మెంట్ స్క్రీన్, ఎస్‌యూవీ డిజైన్, 360-డిగ్రీ కెమెరా, సన్‌రూఫ్ వంటి ఫీచర్లతో కూడిన మోడళ్లకు వారు అధిక ధర చెల్లించడానికి వెనుకాడటం లేదన్నారు. దీని ఫలితంగా రూ. 10 లక్షల కంటే ఎక్కువ ధర కలిగిన కార్ల మార్కెట్ వాటా 2015లో కేవలం 12.5 శాతం మాత్రమే ఉండగా, 2023 చివరి నాటికి అది దాదాపు నాలుగు రెట్లు పెరిగి 46 శాతానికి చేరుకుంది. ప్రస్తుతం మార్కెట్లో అత్యధికంగా అమ్ముడవుతున్న కార్లు ఈ విభాగంలోనే ఉన్నాయని అంటున్నారు. 2019–20లో ప్యాసింజర్ వాహన అమ్మకాలలో 46.5శాతంగా ఉన్న చిన్న కార్ల వాటా 2023–24 నాటికి 27.7శాతానికి వచ్చి చేరిందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు.
వాహన తయారీ వ్యయాలు భారీగా పెరిగిన నేపథ్యంలో కారు కంపెనీలు కూడా అధిక లాభాల మార్జిన్‌లను అందించే హై-ఎండ్ మోడళ్లపైనే ప్రధానంగా దృష్టి సారిస్తున్నాయని తెలుస్తోంది. చిన్న కార్ల విభాగంలో మారుతి సుజుకి ఆల్టో, రెనాల్ట్ క్విడ్ మాత్రమే అందుబాటులో ఉన్నాయి. ఒకప్పుడు బడ్జెట్ కొనుగోలుదారులకు అందుబాటులో ఉన్న అనేక మోడళ్లు క్రమంగా కనుమరుగయ్యాయి.
2018–19లో 15.50లక్షల చిన్నకార్లు అమ్ముడయ్యాయి. 2023–24లో ఇది 11లక్షలకు పడిపోయింది. ప్యాసింజర్ వాహనాల పరంగా చూస్తే.. 2018–19లో 33.77లక్షలు అమ్ముడైతే.. 2023–24లో 42లక్షల వాహనాల అమ్మకాలు జరిగాయి. మొత్తం ప్యాసింజర్ వాహనాల్లో కూడా చిన్న కార్ల వాటా 46 నుంచి 27.7 శాతానికి తగ్గిపోయింది. ఇందులోనూ ఎంట్రీ లెవల్ కార్ల అమ్మకాలు అత్యంత వేగంగా క్షీణించాయి.
ప్రస్తుతం కారు మార్కెట్ ట్రెండ్స్ పరిశీలిస్తే వినియోగదారులు బడ్జెట్‌ను కాకుండా, భద్రత, ఫీచర్లు, లేటెస్ట్ టెక్నాలజీకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నట్లు స్పష్టమవుతోంది. చిన్న కార్ల తయారీ కంపెనీలు ధరలను తగ్గించలేకపోవడం, అలాగే లాభాల మార్జిన్‌లు తక్కువగా ఉండడంతో ఈ విభాగం మరింతగా కుచించుకుపోయే అవకాశం ఉంది. భవిష్యత్తులో చిన్న కార్ల స్థానంలో బడ్జెట్ ఫ్రెండ్లీ కాంపాక్ట్ ఎస్‌యూవీలు లేదా ఎలక్ట్రిక్ ఎంట్రీ-లెవల్ కార్లు వంటివి వస్తాయేమో చూడాలి.