Rupee fall against Dollar: వందకోట్లకు మించిన జనాభా.. సుస్థిరమైన ప్రభుత్వం.. విలువైన మానవ వనరులు..అంతకుమించి పని చేసే సత్తా ఉన్న వ్యక్తులు.. ఇన్ని అనుకూలతలున్నప్పటికీ భారత్ ఇబ్బందిపడుతోంది. ఎదిగే క్రమంలో బొక్కాబోర్లాపడుతోంది. మన కరెన్సీ రూపాయి విలువ దారుణంగా పడిపోతోంది. ఇది సరిపోదన్నట్టు ఇప్పుడు స్టాక్ మార్కెట్ వ్యాల్యూ కూడా పడిపోవడం ఆందోళన కలిగిస్తోంది.
యుద్దం, డాలర్ విలువ పెరిగిపోవడం, ఇన్వెస్టర్లు పెట్టుబడులను వెనక్కి తీసుకోవడం, కొనుగోళ్లలో ఆటుపోట్లు ఇవన్నీఅంతర్జాతీయంగా రూపాయి విలువను తీవ్రంగా ప్రభావితం చేస్తున్నాయి. రూపాయి విలువ కొంత కాలంగా దారుణంగా పడిపోతోంది. అంతేకాదు, జీవితకాల కనిష్టాన్ని చేరుకుని, పాలకులకు కన్నీరు మిగుల్చుతోంది. కరెన్సీ విలువ తగ్గిపోతున్న నేపథ్యంలో ఫారెక్స్ నిల్వల మీద విపరీతమైన ఒత్తిడి పెరుగుతోంది.
రూపాయి విలువ ఈస్థాయిలో పతనమవుతుంటే.. స్టాక్ మార్కెట్ కూడా నేల చూపులు చూస్తోంది. ఇటీవల తైవాన్ స్టాక్ మార్కెట్ భారతదేశాన్ని వెనక్కి నెట్టింది. ఐదో స్థానానికి చేరుకుంది. తాజాగా ఆరోస్థానాన్ని దక్షిణ కొరియా సొంతం చేసుకుంది. ఏఐ జమానాలో సెమీ కండక్టర్లు, మెమొరీ పరికరాలకు విపరీతమైన డిమాండ్ ఉంది. దీనికి తోడు సామ్ సంగ్, ఎస్ కే హైనిక్స్ కంపెనీల షేర్లు ర్యాలీ కొనసాగించాయి.
సౌత్ కొరియా ప్రమాణిక ఈక్విటీ సూచి కోస్పీలో సామ్ సంగ్ అత్యధిక వెయిటేజీ సాధించాయి. సామ్ సంగ్, ఎస్ కే హైనిక్స్ మోస్ట్ వ్యాల్యూడ్ కంపెనీలుగా నిలిచాయి. ఇవన్నీ కూడా లక్ష కోట్ల డాలర్ల జాబితాలో చేరాయి. సౌత్ కొరియా కంపెనీలు సెమీ కండక్టర్ల తయారీలో దూసుకుపోతున్నాయి. విపరీతమైన లాభాలను నమోదు చేస్తున్నాయి. అందువల్లే సౌత్ కొరియా కెనడా, జర్మనీ, యూకే, ఫ్రాన్స్ స్టాక్ మార్కెట్లను సైతం దాటేసింది.
మనదేశంలో చిప్ ల తయారీ అంతగా ఊపందుకోలేదు. సెమీకండక్టర్లకు ప్రపంచవ్యాప్తంగా విపరీతమైన డిమాండ్ ఉంది. ఏఐ యుగంలో వీటికి విపరీతమైన డిమాండ్ పెరుగుతున్న నేపథ్యంలో కంపెనీలు పండగ చేసుకుంటున్నాయి. అందువల్లే వీటి విలువ చూస్తుండగానే లక్షలకోట్లను దాటేస్తోంది. ఇది మార్కెట్ నిపుణులను ఆశ్యర్యానికి గురి చేస్తోంది.
