Radisson Hotel Group: హోటల్లో క్రికెట్ స్టేడియం.. ఇంకా చాలా ప్రత్యేకతలు.. ఎక్కడ నిర్మిస్తున్నారంటే..

మనదేశంలో రాడిసన్ హోటల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాడిసన్ బ్లూ, రాడిసన్, రాడిసన్ ఇండివిజువల్స్ పేరుతో హోటళ్ళను నిర్వహిస్తోంది. రాజస్థాన్ లోని జవాయి, మధ్యప్రదేశ్లోని సాగర్, మహారాష్ట్రలోని యావత్మాల్, తమిళనాడులోని ఊటీ, కేరళలోని కోజికోడ్ ప్రాంతాలలో హోటళ్లు నిర్వహిస్తోంది.

Written By: Anabothula Bhaskar, Updated On : June 28, 2024 1:50 pm

Radisson Hotel Group

Follow us on

Radisson Hotel Group: మనదేశంలో క్రికెట్ కు ఉన్నంత ఆదరణ మరే క్రీడకు లేదు. క్రికెట్ కనుక ఒక మతం అయితే.. ఆ జాబితాలో భారతదేశం మొదటి స్థానంలో ఉంటుంది.. క్రికెటర్లను ఆరాధ్య దైవాలుగా అభిమానులు భావిస్తారు. అందుకే టీమిండియా ఎక్కడ క్రికెట్ మ్యాచ్లు ఆడినా.. అక్కడికి వెళ్తారు.. టీమిండియా ఆటగాళ్ల ఆటతీరును ఆస్వాదిస్తారు. టీమిండియా గెలిస్తే మైదానంలో కేరింతలు కొడతారు.. అయితే మన దేశంలో క్రికెట్ కి ఉన్న క్రేజ్ ను దృష్టిలో ఉంచుకొని.. దానిని క్యాష్ చేసుకునేందుకు.. ఓ హాస్పిటాలిటీ గ్రూపు రంగంలోకి దిగింది. ఇంతవరకు ఏ కార్పొరేట్ కంపెనీ చేయని ప్రయోగాన్ని అమల్లో పెట్టింది. ఇంతకీ ఆ గ్రూప్ ఏం చేస్తోందంటే.

మనదేశంలో రాడిసన్ హోటల్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. రాడిసన్ బ్లూ, రాడిసన్, రాడిసన్ ఇండివిజువల్స్ పేరుతో హోటళ్ళను నిర్వహిస్తోంది. రాజస్థాన్ లోని జవాయి, మధ్యప్రదేశ్లోని సాగర్, మహారాష్ట్రలోని యావత్మాల్, తమిళనాడులోని ఊటీ, కేరళలోని కోజికోడ్ ప్రాంతాలలో హోటళ్లు నిర్వహిస్తోంది. త్వరలో దేశవ్యాప్తంగా 10 హోటళ్లను నిర్మించనుంది. గత నాలుగు రోజుల్లో ఈ పది హోటళ్ల నిర్మాణానికి సంబంధించిన దస్త్రాలపై సంతకాలు చేసింది.. రాడిసన్ గ్రూప్ నిర్మించే పది హోటళ్లల్లో రాజస్థాన్ రాష్ట్రంలోని నాథ్ ద్వారా ప్రాంతంలో నిర్మించే హోటల్ చాలా ప్రత్యేకమైనది .

నాథ్ ద్వారా లోని క్రికెట్ స్టేడియానికి పక్కనే హోటల్ నిర్మిస్తోంది. ఒకరకంగా చెప్పాలంటే క్రికెట్ స్టేడియంలో హోటల్ అని దీనిని చెప్పుకోవచ్చు. ఇది భారతదేశంలోనే మొట్టమొదటి క్రికెట్ స్టేడియం హోటల్. ఈ హోటల్లో 234 విలాసవంతమైన గదులను రాడిసన్ గ్రూప్ నిర్మించనుంది. దాదాపు 75% గదులు ప్రధాన క్రికెట్ మైదానాన్ని చూసేందుకు వీలు కల్పిస్తాయి. క్రికెట్ ను ఇష్టపడే వారికి, క్రికెట్ చూస్తూ విశ్రాంతి తీసుకోవాలనుకునే వారికి తమ హోటల్ సరికొత్త అనుభూతిని అందిస్తుందని రాడిసన్ గ్రూప్ చెబుతోంది.. రాడిసన్ సాగర్, రాడిసన్ మొహాలి, రాడిసన్ బ్రాండ్ కింద ఈ కొత్త హోటళ్లను నిర్మించనున్నారు. ” మా గ్రూప్ ఆధ్వర్యంలో హోటళ్లు అంతర్జాతీయంగా పేరు పొందాయి. భారతదేశంలోనూ మేము సేవలు అందిస్తున్నాం. మా బ్రాండ్ పోర్ట్ పోలియోను విస్తరించేందుకు మేము దృష్టి పెట్టాం. మా విలువైన భాగస్వాములు ఇందులో బలమైన పాత్ర పోషిస్తారు. దక్షిణాసియాలో మేము బలపడేందుకు అనేక అవకాశాలు ఉన్నాయి. అందువల్లే ఇటీవల నాలుగు రోజుల్లో పది హోటళ్ల నిర్మాణం పై సంతకాలు చేశాం. కొత్త మార్కెట్లోకి ప్రవేశించడం వల్ల మేము సరికొత్త విప్లవాన్ని సృష్టించాలని అనుకుంటున్నామని” రాడిసన్ దక్షిణాసియా మేనేజింగ్ డైరెక్టర్, ఏరియా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ నిఖిల్ శర్మ పేర్కొన్నారు.

రాడిసన్ గ్రూప్ జవాయి ప్రాంతంలో నిర్మించిన హోటల్ రాజస్థాన్ అందాలను ప్రత్యేకంగా దిగుణీకృతం చేస్తుంది. నీలగిరి ప్రాంతంలో నిర్మించిన హోటల్లో అభయారణ్యం అందాలను వీక్షించవచ్చు. చిరుతపులులు, వన్యప్రాణులను చూడొచ్చు. వీటన్నిటికంటే నీలగిరి పర్వతాల అందాలను అత్యంత దగ్గరగా ఆస్వాదించవచ్చు.. ఇక ఉదయపూర్ ప్రాంతంలో నిర్మించే హోటల్ డిజైన్ లీడ్ గా ఉంటుంది. ఈ హోటల్లో ప్రతిగది ప్రత్యేకమైన డిజైన్ థీమ్ కలిగి ఉంటుంది. ఇక మిగతా ప్రాంతాలలో నిర్మించే హోటళ్లు అక్కడి సంస్కృతిని ప్రతిబింబిస్తాయి. ప్రజల ఆర్థిక స్థితిని బట్టి హోటల్లో గదులను విభజించనున్నారు. లగ్జరీ, సెమి లగ్జరీ, ఎకానమీ విభాగాలను ఏర్పాటు చేయనున్నారు. వచ్చే ఐదేళ్లలో కొత్త హోటళ్ల నిర్మాణం పూర్తి చేయాలని రాడిసన్ గ్రూప్ లక్ష్యంగా పెట్టుకుంది.