Pradhan Mantri Jan-Dhan Yojana: ప్రధాన మంత్రి జన్‌ధన్ యోజన (Jan Dhan Yojana) పథకం మోదీ ప్రభుత్వం (Modi Govt) ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకాలలో ఒకటి. ఈ పథకం అమలులోకి వచ్చి ఏడు సంవత్సరాలు పూర్తైంది. ఈ పథకం కింద ఇప్పటివరకు 43 కోట్ల 4 లక్షల ఖాతాలు తెరవబడ్డాయి. ఈ స్కీమ్ ద్వారా పేద, అణగారిన వర్గాలకు చెందిన కోట్ల మంది ప్రజలు సులభంగా జీరో బ్యాలెన్స్ బ్యాంక్ ఖాతాలను ఓపెన్ చేశారు. ప్రపంచంలోని అతిపెద్ద ఆర్థిక చేయూత కార్యక్రమాలలో ఈ స్కీమ్ ఒకటని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది.
ఈ స్కీమ్ కింద ఓపెన్ చేసిన ఖాతాల్లో డిపాజిట్ల మొత్తం లక్షా 46వేల కోట్లు కావడం గమనార్హం. ఈ స్కీమ్ కింద అకౌంట్ ఓపెన్ చేసిన వాళ్లు 10,000 రూపాయలు ఓవర్ డ్రాఫ్ట్ పొందే అవకాశం కూడా ఉంటుంది. ఖాతాదారుని ఖాతాలో బ్యాలెన్స్ లేని సమయంలో ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీని వినియోగించుకోవచ్చు. అయితే ఓవర్ డ్రాఫ్ట్ కింద పొందిన డబ్బులకు వడ్డీని చెల్లించాల్సి ఉంటుంది. గతంలో ఓవర్ డ్రాఫ్ట్ పరిమితి 5,000 రూపాయలు కాగా కేంద్రం తాజాగా పరిమితిని పెంచింది.
ఎవరైతే ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ కింద అప్పు తీసుకోవాలని అనుకుంటారో వాళ్లు జన్ ధన్ యోజన ఖాతాను కనీసం ఆరు నెలలు వినియోగించి ఉండాలి. ఒక కుటుంబంలో ఒక వ్యక్తి మాత్రమే ఈ సౌకర్యాన్ని పొందవచ్చు. మంచి క్రెడిట్ హిస్టరీ ఉన్న ఖాతాదారునికి మాత్రమే ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ కింద రుణం లభిస్తుంది. ఓవర్ డ్రాఫ్ట్ గరిష్ట వయోపరిమితిని కేంద్రం 65 సంవత్సరాలకు పెంచింది. పీఎంజేడీవై ఓవర్ డ్రాఫ్ట్ కింద 2,000 రూపాయల వరకు ఎటువంటి గ్యారంటీని ఇవ్వాల్సిన అవసరం అయితే లేదు.
సమీపంలోని బ్యాంక్ బ్రాంచ్ ను సంప్రదించి ఈ స్కీమ్ కు సంబంధించిన పూర్తి వివరాలను తెలుసుకోవచ్చు. సాధారణంగా మహిళా సభ్యులకు ఈ స్కీమ్ ద్వారా సులభంగా లోన్ ను పొందే అవకాశం అయితే ఉంటుందని చెప్పవచ్చు.