Phonepe: తాగే టీ నుంచి.. తినే టిఫిన్ వరకు.. సినిమా టికెట్ నుంచి మొదలు పెడితే హాస్పిటల్ బిల్లు వరకు ఇప్పుడు ప్రతీది కూడా డిజిటల్ పేమెంట్ యాప్స్ ద్వారానే జరుగుతోంది. వాస్తవానికి మొదట్లో డిజిటల్ పేమెంట్ యాప్స్ వాడకం నగరాలకు మాత్రమే పరిమితమయ్యేది. అందులోనూ కొంతమందికి మాత్రమే ఈ సౌకర్యం అందుబాటులో ఉండేది. ఎప్పుడైతే కరోనా ప్రబలిందో.. అప్పటినుంచి డిజిటల్ పేమెంట్ యాప్స్ వాడకం విపరీతంగా పెరిగిపోయింది.
డిజిటల్ పేమెంట్ యాప్స్ విభాగంలో మొదట్లో పేటియం మాత్రమే అందుబాటులో ఉండేది. ఆ తర్వాత ఫోన్ పే, గూగుల్ పే, బీమ్, క్రెడ్ వంటివి అందుబాటులోకి వచ్చాయి.. మొదట్లో పేటియం ఈ విభాగంలో సంచలనం సృష్టించింది.. ఆ తర్వాత ఫోన్ పే అందుబాటులోకి వచ్చింది. ఫలితంగా డిజిటల్ పేమెంట్ యాప్స్ విభాగం పూర్తిగా మారిపోయింది.. గూగుల్ లాంటి సంస్థ కూడా డిజిటల్ పేమెంట్ విభాగంలోకి రావడంతో పోటీ విపరీతంగా పెరిగిపోయింది.. అయితే యూపీఐ చెల్లింపులలో ప్రస్తుతం ఫోన్ పే తన ఆధిపత్యాన్ని కొనసాగిస్తోంది. 45.47 శాతం మార్కెట్ ఫోన్ పే సొంతం. గూగుల్ పే 34.62%, పేటీఎం 7.36 శాతం, నవి 2.78 శాతం, సూపర్ మని 1.28% మార్కెట్ వాటా కలిగి ఉన్నాయి. బీమ్, క్రీడ్ లాంటి విభాగాలు కూడా డిజిటల్ పేమెంట్స్ లో సరి కొత్త చరిత్రను సృష్టిస్తున్నాయి.
ఫోన్ పే మొదట్లో తక్కువ మార్కెట్ వాటాను కలిగి ఉండేది. డిజిటల్ పేమెంట్స్ చేసే వారికి ఫ్రెండ్లీ వాతావరణాన్ని కల్పించడంలో ఈ యాప్ విజయవంతమైంది. ఫలితంగా యూజర్లు పెరిగిపోయారు. సత్తెకాలపు విధానాలతో పేటీఎం యూజర్లను ఇబ్బంది పెట్టేది. ఇదే సమయంలో గూగుల్ పే కూడా అందుబాటులోకి రావడంతో ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. పేటీఎం అంతకంతకూ తన పరపతిని కోల్పోగా.. ఫోన్ పే , గూగుల్ పే మాత్రం తమ స్థాయిని పెంచుకున్నాయి. మార్కెట్ లో వాటాను కూడా పెంచుకున్నాయి. అయితే పేటీఎం ఎప్పటికప్పుడు తన సేవలను విస్తృతం చేసుకునే క్రమంలో సరికొత్త విధానాలకు శ్రీకారం చుడుతోంది. గూగుల్ పే కూడా అదే స్థాయిలో సేవలు అందిస్తున్నప్పటికీ.. ఫోన్ పే మాదిరిగా దూసుకుపోవడం లేదు.