Online food Business : ఆన్లైన్ ఫుడ్ బిజినెస్ మహా మహా నగరాలు మాత్రమే కాదు ఒక మోస్తరు పట్టణాలకు కూడా వచ్చేసింది. స్విగ్గి, జొమాటో.. పేర్లు ఏవైతేనేం.. వేడివేడి ఫుడ్ క్షణాల్లో కంచంలోకి తీసుకొస్తున్నాయి. ఇక్కడ డబ్బులు ఎంత అనేది మేటర్ కాదు.. ఏం తింటున్నాం? ఎలాంటివి తింటున్నాం? మనసులో కోరిక పుట్టగానే.. నచ్చినవి తింటున్నామా? లేదా? అనేవే చూస్తున్నారు. అందువల్లే ఆన్లైన్ ఫుడ్ బిజినెస్ ఏకంగా నాలుగు లక్షల కోట్లకు చేరుకుంది. దీని ఆధారంగా వేలాదిమంది ఉపాధి పొందుతున్నారంటే దీని కెపాసిటీ ఏమిటో అర్థం చేసుకోవచ్చు. హైదరాబాద్ నగరంలో ఉన్న హోటళ్లు మొత్తం ఆన్లైన్ లో కూడా ఆహారాన్ని విక్రయిస్తున్నాయి. పైగా అటువంటి వాటి వైపే అవి ఎక్కువగా మొగ్గు చూపుతున్నాయి. ఇలా కూడా తమ వ్యాపారాలను పెంచుకుంటున్నాయి. కొన్ని హోటల్స్ అయితే పేరుపొందిన ఫుడ్ వ్లాగర్స్ తో ప్రచారం చేయించుకుంటున్నాయి. ఆ తర్వాత విక్రయాలను పెంచుకుంటున్నాయి. తద్వారా కస్టమర్ తమ హోటల్ గుమ్మం తొక్కకుండానే తమ ఫుడ్ ఐటమ్స్ ఆన్లైన్లో విక్రయిస్తున్నాయి. ఇందుకు జొమాటో, స్విగ్గిని రవాణాకు ఉపయోగించుకుంటున్నాయి. ఇటీవల కాలంలో క్లౌడ్ కిచెన్లు కూడా పుట్టుకొచ్చాయి. కస్టమర్లకు కావలసిన ఆహారాన్ని అందించడంలో పోటీ పడుతున్నాయి. ఒకప్పుడు హైదరాబాదులో హైదరాబాద్ దమ్ బిర్యాని మాత్రమే ఫేమస్. ఇప్పుడు భీమవరం రాజుల బిర్యాని, చిట్టి ముత్యాల బిర్యాని, దూపుడు పోతు బిర్యాని, ధర్మవరం నాటుకోడి బిర్యానీ, కర్ణాటక దొన్నె బిర్యాని, తాడిపత్రి కోడిపలావ్.. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో రకాల హోటల్స్ వచ్చాయి. మటన్, చికెన్, ఫిష్, ఫ్రాన్స్ ఇలా అనేక రకాల వంటకాలు సందడి చేస్తున్నాయి.
వెజ్ లో కూడా..
నాన్ వెజ్ మాత్రమే కాదు వెజ్ లో కూడా రకరకాల వంటకాలు అందుబాటులోకి వచ్చాయి. ఇటీవల కాలంలో డయాబెటిక్ పేషెంట్లు పెరిగిపోయిన నేపథ్యంలో.. వారికోసం కూడా ప్రత్యేకమైన మెనూ అందుబాటులోకి తీసుకొచ్చాయి. స్థూలంగా చెప్పాలంటే ఒకప్పటిలాగా మనుషులకు సమయం ఉండడం లేదు. సమయం అది 24 గంటలయినప్పటికీ.. వండుకునే సమయం ఎవరికీ ఉండడం లేదు. వండాలని కోరిక కలగడం లేదు. పైగా ఈ తరం డబ్బులు వేటలో పడి.. వంటలను నేర్చుకోవడం మానేశారు. భార్యాభర్తలు ఉద్యోగాలు చేసి.. తమకు ఏం కావాలో ఆన్లైన్లో ఆర్డర్ పెట్టుకుంటున్నారు. కంచంలో వేడి వేడి ఆహారాన్ని తింటూ, నచ్చిన సినిమాలు చూస్తూ గడిపేస్తున్నారు. ఇది మంచిదా, చెడ్డదా అనే విషయాన్ని పక్కన పెడితే.. కాసుల వేటలో పడి చివరికి తినే తిండిని కూడా కొనుకుంటున్నారు. అందువల్లే కదా స్విగ్గి, జొమాటో లాంటివి పుట్టుకొచ్చాయి.