Online Shopping: గతంలో షాపింగ్ ఎలా ఉండేది. ఒక వస్తువు కావాలంటే ముందుగా పేపర్ పై రాసుకోవాలి. ఆ వస్తువు ఎక్కడ దొరుకుతుందో ఇరుగు, పొరుగువారితో తెలుసుకోవాలి, ఆ తర్వాత వెళ్లి కొనుగోలు చేయాలి. కొనడం ఒక ఎత్తయితే వాటిని ఇంటికి తీసుకురావడం మరో ఎత్తు. ఈ విధానంతో డబ్బుతో పాటు బాగా ప్రయాస అవుతుంది.
ఇప్పుడు ఆన్ లైన్ షాపింగ్ వచ్చిన తర్వాత హాయిగా ఇంటి వద్దే ఉంటూ తమకు నచ్చిన వస్తువులను దేశంతో పాటు ప్రపంచంలో ఏ మూల ఉన్నా కొంటున్నాం. దీంతో సమయం, డబ్బు రెండూ ఆదా అవుతాయి. ఒక వస్తువు కొనాలంటే ఆ వస్తువుకు సంబంధించి ఇతర కంపెనీల ఉన్నవాటిని చూసి రివ్యూలు చూసి తమకు నచ్చిన కంపెనీలోని వస్తువును కొనవచ్చు. పైగా వస్తువు కూడా క్షేమంగా (ఎటువంటి డ్యామేజీ లేకుండా) ఇంట్లోకి వస్తుంది.
ఆన్ లైన్ షాపింగ్ తో ఇబ్బందులు తప్పాయి. దుకాణాల చుట్టూ తిరగాల్సిన అవసరం లేదు. వందల కొద్ది వస్తువులను అరచేతిలోని స్మార్ట్ ఫోన్ లో పరిశీలించి, నచ్చిన దాన్ని బుక్ చేసుకోవచ్చు. ఆ వస్తువు ఇంటికి వచ్చాకే పరిశీలించి మరీ డబ్బు కట్టవచ్చు.
జాగ్రత్తలు అవసరం
ఆన్ లైన్ షాపింగ్ తో లాభాలు ఉన్నట్లే మోసాలు కూడా పక్కనే పొంచి ఉంటాయి. సైబర్ నేరగాళ్ల తరచూ ఈ కామర్స్ ప్లాట్‌ఫాంలనే లక్ష్యంగా చేసుకుంటారు. వ్యక్తి గత, ఆర్థిక సమాచారాన్ని దొంగలించే ప్రయత్నాలు చేస్తారని నిపుణులు చెప్తున్నారు.
ఇలా జాగ్రత్తలు తీసుకోవాలి
ఆన్ లైన్ మోసాలకు గురవకుండా ఉండాలంటే ఏం చేయాలనే విషయాలను ఓఎల్ఎక్స్ సూచించింది. ఓఎల్‌ఎక్స్ కూడా ఒక ఈ కామర్స్ ప్లాట్ ఫారమే.
వెబ్‌సైట్ల గురించి తెలుసుకోవాలి
విశ్వసనీయ వెబ్ సెట్ల లోనే వస్తువులను కొనాలి. ప్రధాన రిటైలర్లు, ప్రముఖ బ్రాండ్లు తమ ఖాతాదారుల సమాచారం రక్షించేందుకు భద్రతా చర్యలు తీసుకుంటాయి. వెబ్‌సైట్ యూఆర్ఎల్ లో హెచ్‌టీటీపీఎస్ ఎన్‌క్రిప్షన్ కోసం చూడండి.. అడ్రస్ బార్‌లో ప్యాడ్‌లాక్ చిహ్నం ద్వారా దీన్ని గుర్తించవచ్చు.
పాస్ వర్డ్..: మీ బ్యాంక్ ఖాతాలన్నింటికీ ఒకే పాస్‌వర్డ్ పెట్టవద్దు. దీని వల్ల నష్టాలు జరుగుతాయి. ఒక వేళ స్కామర్ మీ ఒక్క క్రెడిట్ కార్డు లేదంటే బ్యాంకు ఖాతాకు సంబంధించి పాస్ వర్డ్ హ్యాక్ చేస్తే అన్ని కార్డులు, అన్నీ ఖాతాలను తెరవచ్చు. కాబట్టి ప్రతీ ఆన్ లైన్ ఖాతాకు ప్రత్యేక పాస్ వర్డ్ పెట్టుకోవాలి.
డేటా భద్రత..: ఇ-కామర్స్ నిర్వాహకులు వస్తువులను కొనుగోలు చేసేందుకు ఖాతాను తెరవమని మిమ్మల్ని ప్రోత్సహించడం సాధారణ విషయమే. దీని వల్ల మీ కొనుగోళ్లు సులభతరం అవుతాయి. అయితే దీనిలో మీ వ్యక్తి గత సమాచారం ఉన్నందున డేటా ఉల్లంఘనకు సంబంధించి ప్రమాదం జరిగే అవకాశం ఉంది. కాబట్టి గెస్ట్ గా షాపింగ్ మంచిది.
సమాచార గోప్యత..: సాధారణంగా మీ ఫోన్ కు, లేదంటే ఈ మెయిల్ కు ఓటీపీలు వస్తుంటాయి. వాటిని ఎవ్వరితో షేర్ చేసుకోవద్దు.
ఉచిత వైఫైతో ట్రాన్జాక్షన్ వద్దు..: ఫ్రీగా వైఫై దొరికిందని ఎడా పెడా వాడడం మంచిది కాదు. కొన్ని బ్యాంకులు వైఫై కనెక్షన్ ఉంటే యాప్ లను ఓపెన్ చేయవు అంటే అర్థం చేసుకోవచ్చు. వైఫైతో ఎంత హామీ ఉంటుందో. వైఫైతో ఈజీగా మీ సమాచారం సేకరించవచ్చు. బ్యాంకింగ్, ఆర్థిక లావాదేవీలకు సంబంధించి వైఫై ఉపయోగించవద్దు.
ఫ్రాడ్ మెయిల్స్..: మీ ఆన్ లైన్ ఖాతాల లాగిన్లు, క్రెడిట్ కార్డు సమాచారం కోసం కొన్ని మోసపూరిత ఈ-మెయిల్లు, వెబ్ సైట్ల లింకులు వస్తాయి. లింక్ లపై క్లిక్ చేయాలని, వ్యక్తి గత సమాచారం కావాలని అడుగుతాయి. వీటితో జాగ్రత్తగా వ్యవహరించాలి.
రివ్యూలు చూడాలి..: ఆన్ లైన్ షాపింగ్ లో వస్తువులు కొనేప్పుడు రేటింగ్, రివ్యూలను తప్పకుండా పరిశీలించాలి. ప్రొడక్ట్ నాణ్యత, షిప్పింగ్ సమయంకు సంబంధించి ప్రతికూల అభిప్రాయం వస్తే తప్పక చదవాలి. అధిక రేటింగ్, సానుకూల సమీక్షలున్న వాటినే ఎక్కువగా ఎంచుకోవాలి.