Ola Roadster X : ఓలా ఎలక్ట్రిక్ తన మొదటి ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్ రోడ్‌స్టర్ ఎక్స్ డెలివరీలను మే 23 నుంచి భారత మార్కెట్లో ప్రారంభించింది. ఓలా ఎలక్ట్రిక్ ఫ్యూచర్‌ఫ్యాక్టరీలో ఈ రోడ్‌స్టర్ ఎక్స్ బైక్‌లను ఉత్పత్తి చేస్తున్నారు. ఈ బైక్ కావాలని అనుకున్న వాళ్లు ఓలా డీలర్‌షిప్‌లను సందర్శించి ఈ అద్భుతమైన ఎలక్ట్రిక్ మోటార్‌సైకిల్‌ను కొనుగోలు చేయవచ్చు.
ఓలా రోడ్‌స్టర్ ఎక్స్ మోడల్‌ను ఫిబ్రవరి 2025లో భారత మార్కెట్లో లాంచ్ చేశారు. ఆ సమయంలో ఓలా ఎలక్ట్రిక్ తమ ఈవీకి బుకింగ్‌లను ప్రారంభించినట్లు, త్వరలోనే డెలివరీలను కూడా ప్రారంభిస్తామని ప్రకటించింది. కొన్ని కారణాల వల్ల డెలివరీలు ఆలస్యమయ్యాయి. రెండుసార్లు డెలివరీ తేదీని వాయిదా వేసిన తర్వాత వరకు ఓలా తన రోడ్‌స్టర్ ఎక్స్ బైక్ డెలివరీలను ప్రారంభించడం పట్ల వినియోగదారులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
Also Read : రూ. 6.89 లక్షలకే టాటా అల్ట్రోజ్ ఫేస్‌లిఫ్ట్.. బాలెనో, గ్లాంజాకు ఇక కష్టకాలమే!
దశలవారీగా డెలివరీలు
ఓలా రోడ్‌స్టర్ ఎక్స్ బైక్‌ల డెలివరీలు ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్ల మాదిరిగా కాకుండా దేశంలో దశలవారీగా జరుగుతాయి. మొదటి దశలో ఈ బైక్‌లు బెంగళూరులోని కస్టమర్‌లకు అందుబాటులోకి వస్తాయి. ఆ తర్వాతే దేశంలోని ఇతర ప్రాంతాలకు పంపుతారు. ఇలా చేయడం వల్ల ప్రారంభ దశలో ఎదురయ్యే ఏవైనా సమస్యలను గుర్తించి, వాటిని పరిష్కరించడానికి కంపెనీకి అవకాశం లభిస్తుంది. తద్వారా తర్వాత వచ్చే బ్యాచ్‌ల బైక్‌లు మరింత మెరుగైన నాణ్యతతో వినియోగదారులకు చేరువ కానున్నాయి.
ఓలా రోడ్‌స్టర్ ఎక్స్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉంది. ఎక్స్ (X), ఎక్స్+ (X+). ఎక్స్ మోడల్‌లో మూడు బ్యాటరీ ప్యాక్ ఎంపికలు ఉన్నాయి. అవి 2.5 kWh, 3.5 kWh, 4.5 kWh. ఈ బైక్ గరిష్టంగా గంటకు 118 కి.మీ. వేగంతో దూసుకుపోగలదు. కేవలం 3.1 సెకన్లలో గంటకు 0 నుండి 40 కి.మీ. స్పీడ్ అందుకోగలదు. ఈ మోడల్స్ లోకెల్లా అతి పెద్ద బ్యాటరీ ప్యాక్ (4.5 kWh) ఒకేసారి ఛార్జ్ చేస్తే 252 కి.మీ.ల వరకు రేంజ్ ఇస్తుంది.
ధరలు, ఇతర ఫీచర్లు
ఓలా రోడ్‌స్టర్ ఎక్స్ ఒక ఎలక్ట్రిక్ స్ట్రీట్ బైక్. ఇది 3 వేరియంట్లు, 5 రంగులలో లభిస్తుంది. ముందు, వెనుక రెండు చక్రాలకు డ్రమ్ బ్రేక్‌లతో పాటు, రెండు చక్రాలకు కాంభీ బ్రేకింగ్ సిస్టమ్ (CBS) లభిస్తుంది.
ఓలా రోడ్‌స్టర్ ఎక్స్ వేరియంట్ల ధరల విషయానికి వస్తే రోడ్‌స్టర్ ఎక్స్ 2.5 kWh ధర రూ.1,15,936 నుండి ప్రారంభమవుతుంది. రోడ్‌స్టర్ ఎక్స్ 3.5 kWh బ్యాటరీ ప్యాక్ ధర రూ.1,26,227, రోడ్‌స్టర్ ఎక్స్ 4.5 kWh బ్యాటరీ ప్యాక్ ధర రూ.1,41,517కు లభిస్తుంది. ఈ ధరలు మార్కెట్ పరిస్థితులు, సబ్సిడీలను బట్టి మారుతాయి. ఓలా రోడ్‌స్టర్ ఎక్స్ డెలివరీలు ప్రారంభం కావడంతో ఎలక్ట్రిక్ టూ-వీలర్ విభాగంలో ఓలా తన స్థానాన్ని మరింత పటిష్టం చేసుకుంటుందని భావిస్తున్నారు.