Mobile Charging Problem: మొబైల్ ఫోన్‌లో ఛార్జింగ్ కేవలం 1 శాతం మాత్రమే ఉండి.. చుట్టుపక్కల ఛార్జర్ పెట్టుకునే సదుపాయం లేనప్పుడు చాలామంది కంగారుపడుతుంటారు. ఇలాంటి సమయంలో ముఖ్యమైన ఫోన్ కాల్స్ మిస్ అవుతాయేమోననే ఆందోళన మొదలవుతుంది. అయితే ఇలాంటి క్లిష్ట సమయంలో ‘కాల్ ఫార్వర్డింగ్’ (Call Forwarding) ఫీచర్ ఒక అద్భుతమైన సంజీవనిలా పనిచేస్తుంది. మీ ఫోన్ పూర్తిగా స్విచ్ఛాఫ్ అవ్వడానికి ముందే ఈ ఆప్షన్ యాక్టివేట్ చేసుకుంటే, మీ నెంబరుకు వచ్చే ఇంపార్టెంట్ కాల్స్‌న్నింటినీ మీ వద్ద ఉన్న మరో ప్రత్యామ్నాయ నెంబరుకు లేదా మీ స్నేహితులు, కుటుంబ సభ్యుల మొబైల్‌కు మళ్లించవచ్చు. దీనివల్ల ఫోన్ ఆఫ్ అయినా సరే, మీరు ఎలాంటి ముఖ్యమైన సమాచారాన్ని మిస్ అవ్వకుండా ఉంటారు. మరి దీనిని ఎలా సెట్ చేసుకోవాలి?
కాల్ ఫార్వర్డ్:
ఈ ఫీచర్‌ను సెట్ చేసుకోవడానికి రెండు సులువైన పద్ధతులు ఉన్నాయి. మొదటిది మొబైల్ సెట్టింగ్స్ ద్వారా, రెండోది ఒక చిన్న సీక్రెట్ కోడ్ (USSID Code) ద్వారా. మీ ఫోన్ ఛార్జింగ్ చాలా వేగంగా అయిపోతుంటే, కింద పేర్కొన్న కోడ్ పద్ధతి ద్వారా కేవలం కొన్ని సెకన్లలోనే ఈ పని పూర్తి చేయవచ్చు.
సీక్రెట్ కోడ్ ద్వారా యాక్టివేట్ చేసుకోవాలని అనకుంటే మీ మొబైల్‌లోని డయల్ ప్యాడ్ (Dial Pad) ఓపెన్ చేయండి.*21 [పది అంకెల మొబైల్ నెంబర్] # అని టైప్ చేయండి. (ఉదాహరణకు: మీ ప్రత్యామ్నాయ నెంబరు 9876543210 అయితే, మీరు **21*9876543210# అని డయల్ చేయాలి). ఆ తర్వాత కాల్ బటన్ నొక్కండి. స్క్రీన్ పై ‘Call Forwarding Registration Was Successful’ అని మెసేజ్ వస్తుంది. అంటే మీ కాల్స్ విజయవంతంగా డైవర్ట్ అయ్యాయని అర్థం.
మొబైల్ సెట్టింగ్స్ ద్వారా.. మీ ఫోన్ Settings ఓపెన్ చేసి, Apps లేదా Call Settings లోకి వెళ్లండి (కొన్ని ఫోన్లలో నేరుగా ఫోన్ యాప్ ఓపెన్ చేసి, పైన ఉన్న మూడు చుక్కలపై క్లిక్ చేస్తే సెట్టింగ్స్ కనిపిస్తాయి). అక్కడ Calling Accounts లేదా Supplementary Services పై క్లిక్ చేయండి. ఇప్పుడు Call Forwarding ఆప్షన్‌ను ఎంచుకుని, అందులో Voice Calls సెలెక్ట్ చేసుకోండి. అక్కడ మీకు కొన్ని ఆప్షన్లు కనిపిస్తాయి. అందులో Always Forward అనే ఆప్షన్‌ను ఎంచుకుని, మీరు ఏ నెంబరుకైతే కాల్స్ వెళ్లాలో ఆ నెంబర్ టైప్ చేసి ‘Turn On’ లేదా ‘Enable’ క్లిక్ చేయండి.
కాల్ ఫార్వర్డ్‌ను డీయాక్టివేట్ చేయడం ఎలా?
మీకు మళ్లీ ఛార్జర్ అందుబాటులోకి వచ్చి, ఫోన్ ఆన్ చేసిన తర్వాత ఈ కాల్ ఫార్వర్డింగ్ ఆప్షన్‌ను ఖచ్చితంగా తీసేయాలి. లేదంటే మీ నెంబరుకు వచ్చే కాల్స్ అన్నీ పాత నెంబరుకే వెళ్తుంటాయి. దీనిని రిమూవ్ చేయడం కూడా చాలా సులభం.
సీక్రెట్ కోడ్ ద్వారా మీ మొబైల్ డయల్ ప్యాడ్ ఓపెన్ చేయండి. ##21# అని టైప్ చేసి కాల్ బటన్ నొక్కండి. వెంటనే స్క్రీన్ పై ‘Call Forwarding Erasure Successful’ లేదా ‘Service has been disabled’ అని వస్తుంది. దీంతో కాల్ ఫార్వర్డ్ ఆప్షన్ పూర్తిగా రద్దయిపోతుంది.
సెట్టింగ్స్ ద్వారా మీరు పైన కాల్ ఫార్వర్డ్ యాక్టివేట్ చేయడానికి వెళ్లినట్లే.. Settings, Call Settings, Call Forwarding లోకి వెళ్లండి.అక్కడ Always Forward ఆప్షన్ యాక్టివ్‌గా ఉన్నట్లు చూపిస్తుంది. దానిపై క్లిక్ చేసి ‘Disable’ లేదా ‘Turn Off’ బటన్ నొక్కితే సరిపోతుంది.
ఈ చిన్న ట్రిక్ ఫాలో అవ్వడం ద్వారా ఛార్జింగ్ లేనప్పుడు కూడా మీ ముఖ్యమైన కాల్స్ మిస్ అవ్వకుండా జాగ్రత్తపడవచ్చు.
