Nishtha Chauhan: నేటి యువతలో చాలా మంది అధిక జీతాల ఉద్యోగాల కోసం పరుగులు తీస్తున్నారు. ఎక్కువ మంది తక్కువ శ్రమతో ఎక్కువ డబ్బు సంపాదించాలనుకుంటున్నారు. ఈ క్రమంలో పర్యావరణం గురించి పట్టించుకోవడం లేదు. ఈ పరిస్థితిని గమనించిన గుజరాత్‌లోని అహ్మదాబాద్‌కు చెందిన నిష్ఠా చౌహాన్ కొత్త మార్గాన్ని ఎంచుకుంది. ఏరోస్పేస్ ఇంజనీరింగ్ రంగంలో మంచి జీతం వచ్చే ఉద్యోగాన్ని వదిలి, సమాజానికి ఉపయోగపడేలా పర్యావరణ హిత వ్యాపారాన్ని ప్రారంభించి అందరికీ ఆదర్శంగా నిలిచింది. అయితే ఇందులోనూ ఆమె ఏడాదికి సుమారు రూ.1.44 కోట్ల టర్నోవర్ సాధిస్తోంది. ఇంతకీ నిష్ఠా చేసే పనేంటి? ఆమె వల్ల సమాజానికి ఎటువంటి ఉపయోగం జరుగుతోంది?
ఇంజనీరింగ్ పూర్తిచేసిన నిష్ఠా చౌహాన్ ఏరోస్పేస్ రంగంలో పనిచేస్తూ మంచి ఆదాయం పొందేవారు. అయితే ఆరోగ్యకరమైన ఆహారం, పర్యావరణ పరిరక్షణపై ఉన్న ఆసక్తి ఆమెను కొత్త ఆలోచన వైపు మళ్లించింది. ప్రజలు ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడంతో పాటు ఆహార వ్యర్థాలను కూడా తగ్గించే విధంగా ఒక వ్యాపార నమూనాను రూపొందించాలని నిర్ణయించుకుంది. ఈ ఆలోచనతోనే ఆమె అహ్మదాబాద్‌లో ‘కేఫ్ ఆరంభ్’ పేరుతో జీరో-వేస్ట్ మిల్లెట్స్ కేఫ్‌ను ప్రారంభించింది. ఈ కేఫ్‌లో ప్రధానంగా చిరుధాన్యాలతో తయారైన ఆహార పదార్థాలను అందిస్తున్నారు. సంప్రదాయంగా మన పెద్దలు తినే రాగులు, జొన్నలు, సజ్జలు వంటి మిల్లెట్స్‌ను ఆధునిక రుచులకు అనుగుణంగా మార్చి యువతను ఆకర్షిస్తోంది.
నిష్ఠా ప్రయత్నాలు వ్యాపారపరంగా కూడా అద్భుత ఫలితాలు ఇచ్చాయి. ప్రస్తుతం ‘కేఫ్ ఆరంభ్’ ఏడాదికి సుమారు రూ.1.44 కోట్ల టర్నోవర్ సాధిస్తోంది. ఆరోగ్యకరమైన ఆహారం కోసం పెరుగుతున్న డిమాండ్‌ను సద్వినియోగం చేసుకుంటూ ఆమె వ్యాపారాన్ని విజయవంతంగా ముందుకు తీసుకెళ్తోంది. ఇక్కడ ఆహార పదార్థాల తయారీలో వ్యర్థాలు దాదాపు లేకుండా చూసుకుంటారు. ముడి పదార్థాల వినియోగం నుంచి మిగిలిపోయే ఆహార అవశేషాల నిర్వహణ వరకు ప్రతి దశలో జీరో-వేస్ట్ విధానాన్ని అనుసరిస్తున్నారు. దీంతో పర్యావరణంపై ప్రతికూల ప్రభావం గణనీయంగా తగ్గుతోంది.
వ్యాపార లాభాలతో పాటు సామాజిక బాధ్యతను కూడా నిష్ఠా విస్మరించలేదు. జీరో-వేస్ట్ విధానాన్ని అమలు చేయడం ద్వారా ప్రతి సంవత్సరం సుమారు 47 టన్నుల ఆహార వ్యర్థాలను అరికడుతున్నట్లు సమాచారం. దీంతో ఆహార వృథా తగ్గడమే కాకుండా కార్బన్ ఉద్గారాల నియంత్రణకూ తోడ్పడుతోంది.
సంప్రదాయ ఆహారాలకు ఆధునిక రూపాన్ని ఇచ్చి, ఆరోగ్యం పర్యావరణం వ్యాపారం అనే మూడు అంశాలను సమతుల్యం చేస్తూ నిష్ఠా చౌహాన్ కొత్త తరానికి స్ఫూర్తిగా నిలుస్తోంది. మంచి ఉద్యోగాన్ని వదిలినా, స్పష్టమైన లక్ష్యం మరియు వినూత్న ఆలోచన ఉంటే విజయాన్ని సాధించవచ్చని ఆమె కథ నిరూపిస్తోంది.
