
పన్ను చెల్లింపుదారులకు కేంద్రంలో అధికారంలో ఉన్న మోదీ సర్కార్ అదిరిపోయే శుభవార్త చెప్పింది. పలు ట్యాక్స్ డెడ్‌లైన్స్‌ను పొడిగిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం నుంచి కీలక ప్రకటన వెలువడింది. కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయం వల్ల పన్ను చెల్లింపుదారులకు ఊరట కలగనుండగా కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు ఈ విషయాన్ని వెల్లడించింది. కరోనా ప్రతికూల పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో కేంద్రం ఈ నిర్ణయం తీసుకుంది.
పరిశ్రమ వర్గాలు, పన్ను చెల్లింపుదారుల నుంచి అభ్యర్థనలు అందడంతో డెడ్ లైన్ గడువును పొడిగించినట్టు కేంద్ర ప్రత్యక్ష పన్నుల బోర్డు తెలిపింది. సబ్ సెక్షన్ 5 కింద రివైజ్డ్ రిటర్న్స్ దాఖలుకు మరియు ఆదాయపు పన్ను చట్టంలోని సెక్షన్ 139 లోని సబ్ సెక్షన్ 4 కింద ఆలస్య రిటర్న్స్ దాఖలుకు మే31 వరకు సీబీడీటీ గడువును పొడిగించింది. సాధారణంగా గడువు మార్చి 31గా ఉంది.
అయితే వివాద పరిష్కార ప్యానెల్ (డీఆర్‌పీ)కు అభ్యంతరాలు దాఖలు చేయడానికి, కమీషనర్‌కు అప్పీళ్లు దాఖలు చేయడానికి కేంద్రం గడువును పొడిగించడం గమనార్హం. సెక్షన్ 148కి బదులుగా ఇన్‌కమ్ ట్యాక్స్ రిటర్న్స్ దాఖలు చేయడానికి కూడా మే 31వ తేదీ చివరి తేదీగా ఉండటం గమనార్హం. మోదీ సర్కార్ తీసుకున్న నిర్ణయం పట్ల పన్ను చెల్లింపుదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
మరోవైపు కరోనా వల్ల ప్రజలకు ఆర్థికపరమైన ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ప్రజలకు ప్రయోజనం చేకూరే విధంగా కేంద్రం నిర్ణయాలు తీసుకుంటే మంచిదని సామాన్య, మధ్యతరగతి వర్గాల ప్రజల నుంచి అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.