Red Bhindi: కూరగాయలలో బెండకాయలది ప్రత్యేక స్థానమనే సంగతి తెలిసిందే. పిల్లల నుంచి పెద్దల వరకు అందరూ ఇష్టంగా తినేవాటిలో బెండకాయలు కూడా ఒకటి. బెండకాయలు తినడం వల్ల జ్ఞాపకశక్తి పెరగడంతో పాటు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయి. కీళ్లనొప్పుల నుంచి రక్షణ కల్పించడంలో బెండకాయలు ఉపయోగపడతాయి. సాధారణంగా బెండకాయలు ఆకుపచ్చ రంగులో ఉంటాయి.
అయితే మధ్యప్రదేశ్ కు చెందిన ఒక రైతు మాత్రం ఎర్ర బెండకాయలను పండిస్తూ లక్షల్లో సంపాదిస్తున్నారు. సేంద్రీయ పద్ధతిలో ఎర్ర బెండకాయలను సాగు చేస్తూ భారీ మొత్తంలో రైతు లాభాలను సొంతం చేసుకుంటూ ఉండటం గమనార్హం. పూర్తి వివరాల్లోకి వెళ్తే భోపాల్ జిల్లాలోని ఖజూరి కలాన్ అనే ప్రాంతంలో శ్రీశ్రీలాల్ రాజ్‌పుత్ అనే రైతు ఉండేవారు. ఈ రైతుకు సేంద్రీయ వ్యవసాయం అంటే ఎంతో ఇష్టం.
శ్రీశ్రీలాల్ రాజ్‌పుత్ తన పొలంలో ఎరుపు రంగులో ఉన్న బెండను సాగు చేయగా ఆశాజనకంగా దిగుబడి వచ్చింది. బెండమొక్కలు కేవలం 40 రోజుల్లోనే పెరగడం ప్రారంభమైందని శ్రీశ్రీలాల్ రాజ్ పుత్ వెల్లడించారు. చలిప్రాంతాల్లో ఈ పంట సాగు చేయడానికి అనుకూలమని రక్తపోటు సమస్యలు, మధుమేహం, అధిక కొలెస్ట్రాల్ సమస్యలతో బాధ పడేవాళ్లకు ఈ బెండకాయలు ప్రయోజనకరంగా ఉంటాయని శ్రీశ్రీలాల్ రాజ్ పుత్ చెప్పుకొచ్చారు.
ఎకరా భూమిలో 40 నుంచి 50 క్వింటాళ్ల దిగుమతి వస్తుందని ఈ బెండకాయ కిలో 300 రూపాయల నుంచి 400 రూపాయల వరకు పలుకుతుందని శ్రీశ్రీలాల్ రాజ్ పుత్ తెలిపారు.