ITR Filing New Rules 2025: ఎండాకాలం వచ్చిందంటే చాలు మండే ఎండలతో పాటు.. ఆదాయపు పన్ను రిటర్న్‌లు (ITR) ఫైల్ చేయాల్సిన సమయం దగ్గర పడిందని గుర్తుంచుకోవాలి. ఈసారి మీరు ITR ఫైల్ చేసే ముందు కొన్ని కొత్త విషయాలు ముఖ్యంగా తెలుసుకోవాలి. మీరు పాత పన్ను విధానాన్ని ఎంచుకుంటే, కొన్ని మినహాయింపులకు తప్పకుండా ప్రూఫ్‌లు చూపించాల్సి ఉంటుంది. అయితే, కొత్త పన్ను విధానం పాటించే వారికి మాత్రం ఈ చింత అవసరం లేదు. ఆదాయపు పన్ను శాఖ పారదర్శకతను పెంచడానికి ఈ మార్పులు చేసింది.
ప్రూఫ్‌లు తప్పనిసరి!
సాధారణంగా నెలవారి జీతం తీసుకునే ఉద్యోగులు తమ కంపెనీ ఇచ్చే ఫామ్-16 ఆధారంగా ITR-1 లేదా ITR-2 ఫైల్ చేస్తారు. కానీ ఈసారి నుంచి మీరు కింద పేర్కొన్న సెక్షన్ల కింద ఎలాంటి మినహాయింపులు క్లెయిమ్ చేయాలన్నా, వాటికి సంబంధించిన ప్రూఫ్‌లు తప్పనిసరిగా సమర్పించాలి. ఒకవేళ ఈ ప్రూఫ్‌లు చూపించలేకపోతే, మీ క్లెయిమ్‌లు ఆమోదించబడవు. అప్పుడు మీరు ఎక్కువ పన్ను కట్టాల్సి రావచ్చు. తప్పుడు వివరాలు ఇస్తే, మీ ITR రిజెక్ట్ అయ్యే అవకాశం కూడా ఉంది.
ప్రూఫ్‌లు చూపించాల్సిన కొన్ని ముఖ్యమైన మినహాయింపులు
హోమ్ లోన్ వడ్డీ (సెక్షన్ 24(బి)): మీరు హోమ్ లోన్ తీసుకుంటే వడ్డీపై రూ.2 లక్షల వరకు మినహాయింపు పొందవచ్చు. గతంలో వడ్డీ మొత్తం చెబితే సరిపోయేది. ఇప్పుడు మీరు లోన్ ఎక్కడ తీసుకున్నారు, లోన్ అకౌంట్ నంబర్, లోన్ తీసుకున్న తేదీ, ఎంత తీసుకున్నారు, ఎంత వడ్డీ చెల్లించారు వంటి పూర్తి వివరాలను తప్పకుండా ఇవ్వాలి. మీ బ్యాంక్ నుంచి ఈ వివరాలు తీసుకోవాలి.
ఆరోగ్య బీమా ప్రీమియం (సెక్షన్ 80D): మీ ఆరోగ్య బీమా ప్రీమియంపై రూ.25,000 వరకు మినహాయింపు ఉంటుంది. తల్లిదండ్రుల కోసం కట్టిన ప్రీమియానికి కూడా క్లెయిమ్ చేయవచ్చు. ఇక్కడ పాలసీ నంబర్‌ను స్పష్టంగా తెలపాలి.
ఆధారపడిన వారి వైద్య ఖర్చులు (సెక్షన్ 80DD): మీపై ఆధారపడిన వారికి అయిన వైద్య ఖర్చులు, మెయింటెనెన్స్ ఖర్చులకు మినహాయింపు పొందవచ్చు. సాధారణ వైకల్యం ఉంటే రూ.75,000 వరకు, తీవ్రమైన వైకల్యం ఉంటే రూ.1,25,000 వరకు మినహాయింపు ఉంటుంది. ఇక్కడ ఆధారపడిన వారి PAN, ఆధార్ వివరాలు, 10AI సర్టిఫికేషన్ అవసరం.
ఎడ్యుకేషన్ లోన్ వడ్డీ (సెక్షన్ 80E): ఉన్నత విద్య కోసం తీసుకున్న విద్యా రుణంపై చెల్లించిన వడ్డీకి ఎలాంటి లిమిట్ లేకుండా మినహాయింపు లభిస్తుంది. దీనికి కూడా లోన్ వివరాలు పూర్తిగా ఇవ్వాల్సి ఉంటుంది.
ఎలక్ట్రిక్ వెహికల్ లోన్ వడ్డీ (సెక్షన్ 80EEB): 2019 ఏప్రిల్ 1 నుండి 2023 మార్చి 31 మధ్య ఎలక్ట్రిక్ వాహనం కొనుగోలుకు తీసుకున్న లోన్ వడ్డీపై రూ.1,50,000 వరకు మినహాయింపు పొందవచ్చు. దీనికి వాహనం రిజిస్ట్రేషన్ నంబర్, లోన్ వివరాలు ఇవ్వాలి.
సెక్షన్ 80C కింద మినహాయింపులు: ఈపీఎఫ్, పీపీఎఫ్, లైఫ్ ఇన్సూరెన్స్ ప్రీమియంలు, హోమ్ లోన్ ప్రిన్సిపల్, పిల్లల ట్యూషన్ ఫీజులు వంటి వాటికి ఈ సెక్షన్ కింద మినహాయింపులు ఉంటాయి. వీటిని క్లెయిమ్ చేయడానికి సంబంధిత సర్టిఫికేషన్లు, ఇన్సూరెన్స్ అయితే పాలసీ నంబర్ తప్పనిసరి.
హౌస్ రెంట్ అలవెన్స్ (HRA) క్లెయిమ్: HRA క్లెయిమ్ చేసుకోవాలంటే మీరు ఫామ్ 10BA అక్నాలెడ్జ్‌మెంట్ నంబర్‌ను తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది.
Also Read: March 31st: మార్చి 31 వ తేదీ లోపు చేయాల్సిన పనులు ఇవే..!
చివరి తేదీ పొడిగింపు
ఈ కొత్త మార్పుల నేపథ్యంలో ఆదాయపు పన్ను శాఖ ITR ఫైల్ చేయడానికి చివరి తేదీని పొడిగించింది. ఇప్పుడు మీరు సెప్టెంబర్ 15, 2025 వరకు మీ ఆదాయపు పన్ను రిటర్న్‌లను దాఖలు చేయవచ్చు. ఈ ఎక్స్ ట్రా టైం ఉపయోగించుకుని పన్ను మినహాయింపులకు సంబంధించిన అన్ని పత్రాలను సిద్ధం చేసుకొని, జాగ్రత్తగా ITR ఫైల్ చేయండి. కొత్త పన్ను విధానం లాభమా లేదా పాత పన్ను విధానం బెటరా అన్న చూసుకుని జాగ్రత్తగా ఫైల్ చేయండి.