Car Market : నేటి కాలంలో ప్రతి ఒక్కరూ సొంత కారు ఉండాలని అనుకుంటున్నారు. అయితే ఏదైనా ఆఫర్లు, డిస్కౌంట్ల ద్వారా కొనుగోలు చేయాలని చూస్తున్నారు. ఈ తరుణంలో 2023 సంవత్సరం ముగింపు సందర్భంగా కొన్ని కంపెనీలు ఆఫర్లు ప్రకటించాయి. ఇదే సమయంలో 2024లో కార్ల ధరలు పెరుగుతున్నాయని ప్రకటించాయి. అయితే చాలా మంది కొత్త ఏడాది సందర్భంగా కొత్త కారు కొనుగోలు చేయాలని అనుకుంటున్నారు. కానీ ఈ ఏడాది చివరిలో కొంటే డిస్కౌంట్లు లభిస్తాయి. ఈ నేపథ్యంలో అసలు కారు ఎప్పుడు కొనుగోలు చేయాలి? కొత్త ఏడాదిలో కొనడం మంచిదా? లేక ఈ ఏడాది ముగింపులోనే కొనుగోలు చేయడం బెటరా? అనే అయోమయంలో ఉన్నారు. ఆటోమొబైల్ రంగ ప్రతినిధులు చెబుతున్న ప్రకారం..
కరోనా తరువాత కారు కొనుగోలు చేయడానికి చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. వినియోగదారుల డిమాండ్ మేరకు కొన్ని కంపెనీలు ఉత్పత్తులు పెంచాయి. అయితే కార్ల కంపెనీల మధ్య పోటీ వాతావరణం ఏర్పడడంతో ఆఫర్లు, డిస్కౌంట్లను భారీగా ప్రకటిస్తూ తమ సేల్స్ ను పెంచుకునే ప్రయత్నం చేస్తున్నాయి. పండుగలు, ప్రత్యేక రోజుల్లోనే కాకుండా ఏడాది ముగింపు సందర్భగా కూడా కొన్ని కంపెనీలు భారీగా ఆఫర్లు ప్రకటించాయి. అయితే వచ్చే సంవత్సరంలో కార్ల ధరలు పెంచుతున్నామని ముందే చెప్పడంతో వినియోగదారులు ఆలోచనలో పడ్డారు.
కొంత మంది ఆటోమోబైల్ రంగ ప్రతినిధులు చెబుతున్న ప్రకారం కారు కొనాలనుకునేవారు సెంటిమెంట్ కంటే తక్కువ ధరలో కార్లను కొనుగోలు చేయడం మంచిదని అంటన్నారు. 2023 ఏడాది ముగింపు సందర్భంగా కొన్ని కంపెనీలు భారీగా ఆఫర్లు ప్రకటించాయి. మహీంద్రా కంపెనీ తన XUV400 EV అనే కారుపై ఏకంగా రూ.4.2 లక్షల తగ్గింపును ప్రకటించింది. సాధారణంగా ఈ కారు రూ.15 లక్షలకు పైగానే విక్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో 4.2 లక్షల తగ్గింపుతో కొనుగోలు చేస్తే భారీగా సేవ్ చేసుకున్నవారవుతారు. అలాగే హ్యుందాయ్ కోనా EV పై రూ.3 లక్షల తగ్గింపును ప్రకటించారు. దీని ధర రూ.23 లక్షల వరకు ఉంది.
దేశంలో అత్యధిక విక్రయాలు జరుపుకుంటున్న మారుతి సుజుకీ కార్ల కంపెనీ సైతం రూ.30,000.. టాటా మోటార్స్ రూ.50,000 వరకు తగ్గింపును ప్రకటించాయి. ఈ తగ్గింపు డిసెంబర్ 31 వరకే ప్రకటిస్తాయని కంపెనీలు ప్రకటించాయి. కంపెనీలు తమ సేల్స్ ను పెంచుకోవడానికి ఈ ఆఫర్లు ప్రకటిస్తున్నా.. కార్లు కొనాలనుకునే వారికి మాత్రం ఇవి ఉపయోగమేనన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. అంతేకాకుండా 2024లో కార్ల ధరలు పెరుగుతాయని ముందే ప్రకటించినందున తక్కువ బడ్జెట్ లో కారు కొనాలనుకునేవారు ఇప్పుడు కొనుగోలు చేయడం మంచిదని చెబుతున్నారు.