Red Bull Drink: ఒక వ్యాపారం విజయవంతం కావాలంటే సరైన మార్కెటింగ్ స్ట్రాటజీ ఉండాలి. అప్పుడే ఆ వ్యాపారం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతుంది. సరిగ్గా ఇదే విధానాన్ని ఆ కంపెనీ పాటించింది. కాకపోతే తన ఉత్పత్తిని ప్రమోట్ చేసుకోవడానికి సరికొత్త విధానాన్ని అవలంబించింది. అది కాస్త సూపర్ హిట్ అయింది. సీన్ కట్ చేస్తే ఇప్పుడు ఎన్నో దేశాలలో ఆ ఉత్పత్తి అందుబాటులో ఉంది. వేలకోట్ల వ్యాపారానికి ఎదిగింది.
రెడ్ బుల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.. ఈ ఎనర్జీ డ్రింక్ మన దేశంలోనే కాదు, ప్రపంచంలో 178 దేశాలలో అందుబాటులో ఉంటుంది.. ఎనర్జీ డ్రింక్ విభాగంలో 43% వాటా దీని సొంతం. ఇప్పటివరకు ప్రపంచ వ్యాప్తంగా 100 బిలియన్ డబ్బాలను ఈ కంపెనీ విక్రయించింది.. 2024 ఆర్థిక సంవత్సరం నాటికి రెడ్ బుల్ 11.227 బిలియన్ యూరోల ఆదాయాన్ని ఆర్జించింది. అత్యంత విలువైన బ్రాండ్ గా అవతరించింది. ఆస్ట్రియా దేశంలో ప్రాణమైన ఈ ఉత్పత్తి అంచలంచెలుగా ఎదిగింది. 2024 నాటికి రెడ్ బుల్ బ్రాండ్ విలువ సుమారు 20 బిలియన్ యూరోలకు చేరుకుంది.. 2022 నుంచి ప్రతి ఏడాది దాని వ్యాపారంలో 4.4% వృద్ధి నమోదవుతోంది.
రెడ్ బుల్ ను మొదట్లో అంతగా ఆదరించేవారు కాదు. అయితే దీనిని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఆ కంపెనీ వినూత్నమైన విధానాలను అవలంబించింది. ఖాళీ డబ్బాలను యూనివర్సిటీలు, క్లబ్బులు ఉన్నచోట పడేసేది. తద్వారా సరికొత్త ప్రచారాన్ని చేసుకునేది. దీనివల్ల ఈ కంపెనీ ఉత్పత్తుల పై ప్రజల్లో ఆకర్షణ పెరిగింది. తద్వారా వాటిని కొనుగోలు చేయడానికి ప్రజలు ముందుకు వస్తుండేవారు. పైగా ఈ డ్రింకులో ఎనర్జీ లెవెల్స్ ఎక్కువగా ఉండటం వల్ల చాలామంది కొనుగోలు చేయడానికి ఇష్టపడేవారు. అలా క్రమక్రమంగా ఇది అనేక దేశాలకు విస్తరించింది. కోకో కోలా, పెప్సికో హోల్డింగ్స్, పార్లే ఆగ్రో, రిలయన్స్ కంపా వంటి కంపెనీల నుంచి విపరీతమైన పోటీ ఎదురైనప్పటికీ ఎదుర్కొంది.. బలమైన బ్రాండ్ గా అవతరించింది. తద్వారా వేలకోట్ల ఆదాయాన్ని ఆర్జించింది.
నేటికీ చాలా కంపెనీలు తమ ఉత్పత్తులను మార్కెట్లో ప్రచారం చేసుకోవడానికి అనేక విధానాలను అవలంబిస్తాయి. ఇందుకోసం భారీగా ఖర్చుపెడతాయి. కానీ రెడ్ బుల్ రూపాయి ఖర్చు లేకుండా తన ఉత్పత్తులను ప్రమోట్ చేసుకుంది. వ్యాపారాన్ని పెంచుకుంది. లేని అవకాశాలను సృష్టించుకుంది. చివరికి వేలకోట్ల వ్యాపారాన్ని సొంతం చేసుకుంది. అన్నట్టు ఈ కంపెనీ 1987లో ప్రారంభమైంది.