Insurance Policy Types: కారున్న ప్రతి ఒక్కరికీ దానిని నడపడానికి ఇన్సూరెన్స్ తప్పనిసరి. ఇది కేవలం చట్టపరమైన చిక్కుల నుంచి దూరం చేయడమే కాకుండా వాహనానికి ఏదైనా నష్టం జరిగినప్పుడు దాని నష్టాన్ని కూడా భర్తీ చేస్తుంది. ప్రమాదానికి కారణం ఏదైనా కావచ్చు, వాహనానికి నష్టం జరిగితే అది మనకు జీవితాంతం గుర్తుండిపోతుంది. అయితే, భారతదేశంలో ఎన్ని రకాల కార్ ఇన్సూరెన్స్‌లు ఉన్నాయో తెలుసా? వాటి గురించి వివరంగా తెలుసుకుందాం. భారతదేశంలో ప్రధానంగా నాలుగు రకాల కార్ ఇన్సూరెన్స్‌లు అందుబాటులో ఉన్నాయి.
1.థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్
2. కాంప్రహెన్సివ్ ఇన్సూరెన్స్
3. పే-పర్-యూజ్ ఇన్సూరెన్స్
4. ఓన్ డ్యామేజ్ ఇన్సూరెన్స్
ఈ ప్రతి రకం ఇన్సూరెన్స్ దాని స్వంత కవరేజ్, బెనిఫిట్స్ కలిగి ఉంటుంది. వినియోగదారుల అవసరాలకు అనుగుణంగా రూపొందించబడింది.
1. థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్
మోటార్ వాహన చట్టం 1988 ప్రకారం, మన దేశంలోని రోడ్ల మీద నడిచే ప్రతి మోటార్ వాహనానికి థర్డ్ పార్టీ ఇన్సూరెన్స్ తప్పనిసరి. ఇది వాహనానికి ఉండాల్సిన బేసిక్ ఇన్సూరెన్స్. ఈ ఇన్సూరెన్స్‌లో వాహనం నడుపుతున్నప్పుడు బీమా చేసిన వ్యక్తి ఏదైనా తప్పు వల్ల థర్డ్ పార్టీకి జరిగిన గాయాలు, వారి ఆస్తికి లేదా వాహనానికి జరిగిన నష్టం కవర్ అవుతుంది. దీని కవరేజ్ పరిధి చాలా పరిమితం. థర్డ్ పార్టీ కార్ బీమా, బీమా తీసుకున్న వ్యక్తి, వాహనానికి జరిగే నష్టం లేదా డ్యామేజీని కవర్ చేయదు. అంటే, మీ కారుకు ప్రమాదంలో నష్టం జరిగితే, దాని మరమ్మత్తు ఖర్చులు మీరే భరించాల్సి ఉంటుంది. దీని ప్రధాన ఉద్దేశ్యం ప్రమాదం వల్ల ఎదుటి వారికి ఆర్థిక భద్రత కల్పించడం.
2. ఓన్ డ్యామేజ్ ఇన్సూరెన్స్
ఈ రకమైన కార్ బీమాలో, పాలసీదారుడు వాహనం మరమ్మత్తుల కోసం చేసిన ఖర్చులను తిరిగి పొందుతాడు. అంటే, మీ స్వంత కారుకు ఏదైనా నష్టం (ఉదాహరణకు.. యాక్సిడెంట్, అగ్నిప్రమాదం, దొంగతనం, ప్రకృతి వైపరీత్యాలు) జరిగితే, దానిని ఈ బీమా కవర్ చేస్తుంది. ఈ బీమా ప్రీమియం అనేక అంశాలపై ఆధారపడి ఉంటుంది. అవి కారు వయస్సు, మోడల్, ఇంజిన్ సామర్థ్యం, కారు యజమాని నివసించే ప్రాంతం, ఎంచుకున్న అదనపు కవరేజీలు, నో-క్లెయిమ్ బోనస్, కారు ఫ్యూయెల్ టైప్, సేఫ్టీ ఫీచర్లు, ఇన్సూర్డ్ డిక్లేర్డ్ వాల్యూ ఇలా ప్రతీ దాని పరిమితిని బట్టి ఇన్సురెన్స్ కవరేజీ ఉంటుంది.
3. కాంప్రహెన్సివ్ కార్ ఇన్సూరెన్స్
కాంప్రహెన్సివ్ కార్ ఇన్సూరెన్స్, పేరుకు తగ్గట్టుగానే, పూర్తి స్థాయి కవరేజ్‌ను అందిస్తుంది. ఇది మీ స్వంత కారుకు జరిగిన నష్టాన్ని (ఓన్ డ్యామేజ్) కవర్ చేయడమే కాకుండా, ఏదైనా ప్రమాదంలో మూడవ పక్షానికి జరిగిన నష్టాలకు కూడా బాధ్యత వహిస్తుంది. దీనితో పాటు, ఈ ప్లాన్‌లో రూ.15 లక్షల వరకు పర్సనల్ యాక్సిడెంట్ కవర్ కూడా లభిస్తుంది, ఇది వాహన యజమానికి, డ్రైవర్‌కు వర్తిస్తుంది. అంటే, ప్రమాదంలో వారికి ఏదైనా జరిగితే, ఈ కవర్ ఆర్థిక సహాయాన్ని అందిస్తుంది. ఈ బీమా మరో పెద్ద ప్రయోజనం ఏమిటంటే బడ్జెట్‌కు అనుగుణంగా వివిధ యాడ్-ఆన్ కవర్‌లను యాడ్ చేసుకోవచ్చు.
4. పే-పర్-యూజ్ కార్ ఇన్సూరెన్స్
పే-పర్-యూజ్ కార్ ఇన్సూరెన్స్, తమ కారును చాలా తక్కువగా ఉపయోగించే వారికి ఒక అద్భుతమైన ఆప్షన్. ఈ ప్లాన్ కింద, మీరు వాస్తవంగా మీ కారును ఉపయోగించిన సమయానికి మాత్రమే ప్రీమియం చెల్లించాలి. కారును అప్పుడప్పుడు లేదా ప్రత్యేక సందర్భాలలో మాత్రమే ఉపయోగించే కారు యజమానులకు ఇది ప్రత్యేకంగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఉదాహరణకు, మీరు ఒక సంవత్సరంలో 5000 కిలోమీటర్లు మాత్రమే డ్రైవ్ చేస్తే, ఆ దూరం ఆధారంగానే ప్రీమియం లెక్కిస్తారు. ఇది సాధారణ పాలసీల కంటే తక్కువ ఖర్చుతో కూడుకుంది.