Indian Economy : ప్రపంచంలో భారత్ ఆర్థిక పరంగా అత్యంత శక్తి వంతంగా ఎదుగుతోందనడంలో ఎలాంటి సందేహం లేదు. దేశం దాని ఆర్థిక అవసరాలే కాదు.. ఇతర దేశాలకు కూడా సాయంగా నిలుస్తోంది. భారీగా ఉత్పత్తులను ఎగుమతి చేయడంతో పాటు ఫారిన్ నిల్వలను పెంచుకుంటోంది. దీనికి జీఎస్టీ వసూళ్లు తోడవడంతో భారత్ అత్యంత వేగంగా ఆర్థిక వ్యవస్థలో ఎదుగుతోంది. మరో ఏడాదిలో (2025) నాలుగో ఆర్థిక వ్యవస్థగా ఎదుగుతున్న భారత్ తన ముందున్న జపాన్ ను దాటుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.
2025 నాటికి భారత్ జపాన్ ను అధిగమించి ప్రపంచంలో నాలుగో అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా అవతరిస్తుందని భారత జీ-20 షెర్పా, నీతి ఆయోగ్ మాజీ సీఈఓ అమితాబ్ కాంత్ అన్నారు. సానుకూల స్థూల ఆర్థిక సూచీల ఆధారంగా కాంత్ మాట్లాడుతూ.. 2022 లో యునైటెడ్ కింగ్‌డమ్(UK)ను అధిగమించి యునైటెడ్ స్టేట్స్ (US), చైనా, జర్మనీ, జపాన్ తర్వాత భారత్ జీడీపీలో ప్రస్తుతం ఐదో స్థానంలో కొనసాగుతోంది.
‘పదేళ్ల క్రితం ప్రపంచ వ్యాప్తంగా 11వ స్థానంలో ఉన్న భారత ఆర్థిక వృద్ధి నేడు 5వ స్థానంలో కొనసాగుతూ జీడీపీ 3.7 ట్రిలియన్ డాలర్లుగా ఉంది. 2025 వరకు మరో స్థానం ముందుకు వెళ్లనుంది.’ అన్నారు. ఇలా ఎదిగేందుకు గల కీలక అంశాలను అమితాబ్ కాంత్ వివరించారు.
రికార్డు స్థాయిలో జీఎస్టీ వసూళ్లు, మూడు త్రైమాసికాల్లో జీడీపీ వృద్ధి స్థిరంగా 8 శాతానికి పైగా కొనసాగుతుండడం, 27 దేశాలతో ట్రేడింగ్ కోసం భారత్ రూపాయిని ఉపయోగించుకోవడం, ద్రవ్యోల్బణ స్థాయిలను నిర్వహించడం వంటివి దోహదం చేశాయి.
‘Fragile 5’ అనే పదాన్ని మోర్గాన్ స్టాన్లీ విశ్లేషకుడు 2013లో సృష్టించాడు. ఆ సమయంలో ఆర్థిక కష్టాల్లో ఉన్న భారతదేశంతో సహా ఐదు వర్ధమాన దేశాలను Fragile 5 పదం సూచిస్తుంది. మిగిలిన నాలుగు దేశాలు బ్రెజిల్, ఇండోనేషియా, దక్షిణాఫ్రికా, టర్కీ.
స్టీల్, సిమెంట్, ఆటోమొబైల్ తయారీ రంగాల్లో రెండంకెల వృద్ధి, డిజిటల్ పబ్లిక్ ఇన్ ఫ్రాస్టక్చర్ లో గ్లోబల్ లీడర్గా భారత్ స్థానం గురించి కాంత్ ప్రస్తావించారు.
ఈ-లావాదేవీలు 134 బిలియన్లకు పెరిగాయి. ఇది మొత్తం ప్రపంచ డిజిటల్ చెల్లింపుల్లో 46 శాతం. జన్ ధన్, ఆధార్, మొబైల్ కింద తెరిచిన ఖాతాల్లో రూ.2.32 లక్షల కోట్లకు పైగా బ్యాలెన్స్ ఉంది. 2013-14 నుంచి 2022-23 మధ్య సగటు వార్షిక ద్రవ్యోల్బణం 2003-04 నుంచి 2013-14 మధ్య 8.2 శాతం నుంచి 5 శాతానికి తగ్గింది.
దృఢమైన జీడీపీ వృద్ధి అంచనాలు, నిర్వహించదగిన ద్రవ్యోల్బణ స్థాయిలు, రాజకీయ స్తిరత్వం, ప్రశంసనీయమైన సెంట్రల్ బ్యాంక్ మానిటరీ పాలసీ కారణంగా భారత ఆర్థిక వ్యవస్థ ఇటీవలి త్రైమాసికాల్లో ప్రకాశవంతమైనదిగా ఉందని ఏఎన్ఐ నివేదిక తెలిపింది.
2023-24 ఆర్థిక సంవత్సరం అక్టోబర్-డిసెంబర్ త్రైమాసికంలో భారత జీడీపీ 8.4 శాతం వృద్ధిని సాధించిందని, భవిష్యత్ లో దేశం వృద్ధి పథంలో కొనసాగుతుందని అంచనా వేసింది.
అంతర్జాతీయ ద్రవ్య నిధి తాజా వరల్డ్ ఎకనామిక్ అవుట్ లుక్ ప్రకారం 2024 నాటికి ప్రధాన ఆర్థిక వ్యవస్థల్లో భారత్ అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న దేశంగా నిలవనుంది. ఐఎంఎఫ్ 2024లో భారతవృద్ధి అంచనాలను 6.5 శాతం నుంచి 6.8 శాతానికి పెంచింది. భారత ఆర్థిక వ్యవస్థ 2022-23లో వరుసగా 7.2 శాతం, 2021-22లో 8.7 శాతం వృద్ధిని సాధించింది.