ID Cards: కరోనా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ వల్ల దేశంలోని చాలామంది తమ స్నేహితులను, బంధువులను కోల్పోయారు. అధికారిక లెక్కల ప్రకారం కరోనా వల్ల దేశంలో 3,45,000 మంది చనిపోయినట్లు తెలుస్తోంది. అయితే ఒక వ్యక్తి చనిపోయిన తర్వాత ఆ వ్యక్తికి సంబంధించిన ఆధార్ కార్డ్, పాన్ కార్డ్, ఐడీ కార్డు, ఇతర గుర్తింపు కార్డులను ఏం చేయాలనే విషయం చాలామందికి తెలియదు. అయితే వ్యక్తి మరణించిన తర్వాత అతని కార్డులకు సంబంధించి నిపుణులు చెబుతున్న విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
ఒక వ్యక్తి మరణించిన తర్వాత అతని ఆధార్ ను రద్దు చేసే వ్యవస్థ ఇప్పటివరకు అందుబాటులోకి రాలేదు. మరణించిన వ్యక్తి ఆధార్ కార్డ్ ద్వారా ఏదైనా బెనిఫిట్ పొందుతుంటే సంబంధిత శాఖకు ఆ వ్యక్తి మృతి గురించి తెలియజేయాల్సి ఉంటుంది. మరణించిన వ్యక్తి ఆధార్ ను యూఐడీఏఐ వెబ్ సైట్ ద్వారా లాక్ చేస్తే ఆధార్ నంబర్ దుర్వినియోగం చేయకుండా చేయవచ్చు. మన దేశంలో పాన్ కార్డు కూడా ఎంతో ముఖ్యమైన కార్డు అనే సంగతి తెలిసిందే.
ఆదాయపు పన్ను దాఖలు చేయడంతో పాటు ఇతర అవసరాల కోసం పాన్ కార్డును వినియోగించడం జరుగుతుంది. మరణించిన వ్యక్తి యొక్క పాన్ కార్డును రద్దు చేస్తే మంచిది. అయితే పాన్ కార్డును రద్దు చేయడం తప్పనిసరి మాత్రం కాదు. మరణించిన వ్యక్తి కుటుంబం ఆదాయపు పన్ను శాఖను సంప్రదించి పాన్ కార్డును సరెండర్ చేసే అవకాశం అయితే ఉంటుంది. మన దేశంలోని ప్రజలకు ముఖ్యమైన కార్డులలో ఓటర్ కార్డు కూడా ఒకటి.
వ్యక్తి మరణం తర్వాత ఎన్నికల కార్యాలయానికి వెళ్లి ఫారం నింపడం ద్వారా ఓటర్ కార్డును రద్దు చేయవచ్చు. పాస్‌పోర్ట్ విషయంలో పాస్ పోర్ట్ గడువు ముగిస్తే అది ఆటోమేటిక్ గా చెల్లదు. అయితే ఆ పాస్ పోర్ట్ ను అడ్రస్ ప్రూఫ్ కొరకు ఇతర పనుల కొరకు దుర్వినియోగం చేయకూడదు. ఈ డాక్యుమెంట్లు పోయినా లేదా దొంగిలించబడినా పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేస్తే మంచిది.