LIC Policy: చాలా మంది ఆర్థికంగా ఉన్నప్పుడు.. ఏజెంట్ల ఒత్తిడికి లోనై బీమా పాలసీలు కొనుగోలు చేస్తారు. ఇతర వ్యాపకాల్లో పడి దాని గురించి మర్చిపోతారు. మెచ్యూరిటీ తర్వాత కూడా వాటిని క్లెయిమ్ చేసుకోరు. భారతీయ జీవిత బీమా సంస్థ(LIC) వద్ద ఇలా వేల కోట్లు ఉండిపోయాయి. ఈ విషయాన్ని కేంద్ర ఆర్థిక శాఖ సహాయ మంత్రి పంకజ్ చౌదరి పార్లమెంటు సాక్షిగా తెలిపారు. ఎల్‌ఐసీ వద్ద అన్ క్లెయిమ్ మెచ్యూరిటీ డబ్బులే రూ.889.93 కోట్లు ఉన్నట్లు వెల్లడించారు. 2023–24 నాటికి 3,72,282 పాలసీల మెచ్యూరిటీ డబ్బులు అన్‌క్లెయిమ్డ్‌గా ఉన్నట్లు తెలిపారు.
10 ఏళ్ల వరకు అన్‌క్లెయిమ్డ్‌గా ఉంటే..
అన్ క్లెయిమ్డ్ అమౌంట్ అంటే ఏమిటి అనే సందేహం చాలా మందిలో ఉంది. దీనిపై ఇన్సూరెన్స్ రెగ్యులేటరీ అండ్ డెవలప్‌మెంట్ అథారిటీ ఆఫ్ ఇండియా(IRDAI) వివరణ ఇచ్చింది. పాలసీదారులు ఇన్సూరెన్స్ గడువు పూర్తయిన తర్వాత డ్యూ డేట్ లేదా సెటిల్‌మెంట్ తేదీ నుంచి ఆరు నెలల్లోపు మెచ్యూరిటీ నగదును పాలసీ హోల్డర్లు లేదా బెనిఫిషియరీలకు కంపెనీలు అందించాలి. ఆరేళ్లలోపు మెచ్యూరిటీ నగదు ఇవ్వకపోతే వాటిని అన్ క్లెయిమ్డ్ అమౌంట్స్‌గా పరిగణిస్తారు. ఇలా పదేళ్ల వరకు ఉంటే ఆ తర్వాత దానిని సీనియర్ సిటిజన్స్ ఫండ్‌కు బదిలీ చేస్తారు.
ఎలా చెక్ చేసుకోవాలి?
అన్ క్లెయిమ్డ్ జాబితాలో మీ పాలసీ ఉందో లేదో తెలుసుకోవడానికి ఇలా చెక్ చేసుకోవచ్చు. ఇందుకోసం కొన్నిరకాల వివరాలు కావాలి. ఎల్‌ఐసీ పాలసీ నంబర్, పాలసీదారుడి పేరు, పుట్టిన తేదీ, పాన్‌కార్డు తదితర వివరాలు అందించాల్సి ఉంటుంది. ఇక అన్ క్లెయిమ్డ్ జాబితాను చెక్ చేసుకోవడానికి ఎల్‌ఐసీ అధికారిక వెబ్‌సైట్ https://licindia.in/home జిౌఝ్ఛ లోకి వెళ్లాలి. తర్వాత అందులోని కస్టమర్ సర్వీస్ ఆప్షన్‌పై క్లిక్ చేయాలి. తర్వాత అన్ క్లెయిమ్డ్ అమౌంట్‌స ఆఫ్ పాలసీ హోల్డర్స్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. దీనిపై క్లిక్ చేసిన తర్వాత పాలసీ నంబర్, పేరు, పుట్టిన తేదీ, పాన్ కార్డు వివరాలు నమోదు చేసుకోవాలి. తర్వాత సబ్‌మిట్ బటన్‌పై క్లిక్ చేయాలి. వెంటనే అన్ క్లెయిమ్డ్ వివరాలు కనిపిస్తాయి. మీ పాలసీ నగదు ఈ జాబితాలో ఉంటే అధికారిని సంప్రదించి క్లెయిమ్ చేసుకోవచ్చు.
పేరుకుపోడానికి కారణాలు..
ఇక బీమా సంస్థల్లో అన్ క్లెయిమ్డ్ నగదు పేరుకుపోవడానికి కారణాలను కూడా ఐఆర్‌డీఏఐ వివరించింది. ఇన్సూరెన్స్ పాలసీలో ఏదైనా లిటిగేషన్ ఉండడం, ఓపెన్ టైటిల్ లేదా వైరల్ క్లెయిమ్స్ ఉండడం, వినియోగదారులు యాన్యుటీ క్లెయిమ్స్ ఆప్షన్ ఎంచుకోకపోవడం, ఇన్సూరెన్స్ పాలసీలను ప్రభుత్వ ఏజెన్సీ ఫ్రీజింగ్ లేదా బ్లాకింగ్ చేయడం వలన క్లెయిమ్స్ చేయలేకపోతున్నారని వివరించింది. కొందరు పాలసీదారులు దేశం విడిచి వెళ్లిపోవడం కారణంగా కూడా అన్ క్లెయిమ్డ్ నగదు పేరుకుపోతుందని తెలిపారు. ఇక బీమా సంస్థలు కూడా ఈ అన్ క్లెయిమ్డ్ నగదు వివరాలను పదేళ్ల వరకు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచాల్సి ఉంటుందని ఐఆర్‌డీఏఐ స్పష్టం చేసింది.