Google: ఆర్థిక మందగమనం కోరలు చాచింది. వస్తు సేవలకు డిమాండ్ తగ్గింది. మార్కెట్లో ద్రవ్యలభ్యత కూడా తగ్గింది. కొనుగోళ్ళు పాతాళానికి పడిపోయాయి. ఈ పరిస్థితి ఇక్కడికి దారితీస్తుందో తెలియదు. వచ్చే రోజుల్లో మెరుగుపడుతుందో కూడా తెలియదు. అందుకే చాలా వరకు సంస్థలు ఉద్యోగాల్లో ఊచకోత విధిస్తున్నాయి. కొత్త నియామకాలను దాదాపుగా నిలిపివేశాయి. కొత్త ప్రాజెక్టులు ఏవీ రాకపోవడంతో ఉన్నవారితోనే ఎక్కువ గంటలు పనిచేయించి పూర్తి చేయిస్తున్నాయి. ఇందుకు ఏ కంపెనీ కూడా మినహాయింపు కాదు. అయితే తాజాగా ఆర్థిక మందగమనం వేళ ప్రఖ్యాత గూగుల్ కంపెనీ చేసిన పని చర్చనీయాంశంగా మారింది.
గూగుల్ తన మాతృ సంస్థ ఆల్ఫాబెట్లో దాదాపు 12,000 మంది ఉద్యోగులను తొలగించేందుకు గత ఏడాది జనవరిలో నిర్ణయించుకుంది. 12 వేల మంది ఉద్యోగుల తొలగింపు అనేది గూగుల్ చరిత్రలోనే పెద్దది. 12 వేల ఉద్యోగులంటే గూగుల్ కంపెనీలో దాదాపు 6%. అయితే అంత మంది ఉద్యోగులను తొలగించడం గూగుల్ సంస్థకు చాలా ఇబ్బంది తెచ్చిపెట్టింది. ఎందుకంటే ఆయా దేశాల్లో ఉన్న కార్మిక చట్టాలకు అనుగుణంగా తొలగించే ఉద్యోగులకు చెల్లింపులు చేపట్టాల్సి ఉంటుంది. ఇందుకోసం ఏకంగా గూగుల్ 2.1 బిలియన్ డాలర్లు అంటే మన కరెన్సీలో దాదాపు 17,500 కోట్లు చెల్లించింది. కార్పొరేట్ ప్రపంచంలో ఒక కంపెనీ ఉద్యోగుల తొలగింపులకు సంబంధించి ఈ స్థాయిలో ఖర్చు చేయడం ఇదే మొదటిసారి. అయితే ఈ ఉద్యోగుల తొలగింపు పై గూగుల్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ సుందర్ పిచాయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఉద్యోగుల తొలగింపు అనేది కంపెనీకి అత్యవసరం అని పేర్కొన్నారు. అంతే కాదు తొలగించిన ఉద్యోగులకు ఆయన వ్యక్తిగతంగా మెయిల్స్ కూడా పంపారు.
ఇక గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ ఈ ఏడాది నాలుగవ త్రైమాసికంలో రెండు అంకెల ఆదాయ వృద్ధి నమోదు చేసింది. ముఖ్యంగా వీడియో షేరింగ్ ప్లాట్ ఫారం యూట్యూబ్, దాని క్లౌడ్ కంప్యూటింగ్ యూనిట్ నుంచి మెరుగైన ఆదాయం లభించడంతో గూగుల్ మాతృ సంస్థ గత ఏడాది చివరి త్రైమాసికంలో సాధించినట్టుగా రెండు అంకెల ఆదాయ వృద్ధిని నమోదు చేసింది. ముఖ్యంగా గూగుల్ సెర్చ్, ఆన్లైన్ ప్రకటనలతో గూగుల్ ఆదాయం పెరిగింది. దాదాపు రెండు దశాబ్దాల పాటు గూగుల్ నిరంతరాయ వృద్ధిని నమోదు చేసింది. కోవిడ్ సమయంలో గూగుల్ ఆదాయ వృద్ధి తగ్గింది. దీనికి తోడు ఆర్థిక మందగమనం వల్ల గూగుల్ తక్కువ వృద్ధిరేటు నమోదు చేసింది.. నాలుగో త్రైమాసికంలో అంచనాలను మించి ఆదాయాన్ని సాధించినప్పటికీ ట్రేడింగ్ విషయానికి వచ్చేసరికి ఆల్ఫాబెట్ షేర్లు దాదాపు ఏడు శాతం పతనాన్ని ఎదుర్కొన్నాయి. అయితే ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ సానుకూల ప్రభావం వల్ల చివరి త్రైమాసికంలో గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ షేర్లు లాభాలు నమోదు చేశాయని మార్కెట్ వర్గాలు అంటున్నాయి.. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మీద భారీగా పెట్టుబడులు పెట్టిన నేపథ్యంలో భవిష్యత్తులో గూగుల్ మాతృ సంస్థ ఆల్ఫాబెట్ కు వచ్చే ఆదాయం మొత్తం ఈ రంగం నుంచే ఉంటుందని మార్కెట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి.
గత ఏడాది జనవరి నుంచి 12,000 మంది ఉద్యోగులను తొలగించిన నేపథ్యంలో.. భవిష్యత్తులోనూ మరిన్ని ఉద్యోగాలు కోతకు గురవుతాయని గూగుల్ హెచ్చరించింది.. అంతేకాకుండా ఉద్యోగులను అప్రమత్తం చేసింది. పనితీరు సరిగా లేనివారు మెరుగుపరచుకోవాలని.. ఇచ్చిన ప్రాజెక్టులను సకాలం కంటే ముందే పూర్తి చేయాలని సూచించింది. నిర్వహణకు సంబంధించి కూడా ఖర్చులను తగ్గించుకోవాలని.. ఉద్యోగులకు ఇచ్చే ప్రయోజనాల విషయంలోనూ ఆచితూచి వ్యవహరించాలని గూగుల్ నిర్ణయం తీసుకుంది. అంతేకాదు సంస్థ లో చేపట్టే కొన్ని కార్యక్రమాలకు బయటి సేవల విభాగాలను ఉపయోగించుకోవాలని.. దీనివల్ల వాటిపై చేసే ఖర్చు తగ్గుతుందని గూగుల్ భావిస్తోంది. మొత్తానికి 12,000 మంది ఉద్యోగులతోనే తొలగింపు పూర్తి కాలేదని.. భవిష్యత్తు కాలంలోనూ కోతలు ఉంటాయని గూగుల్ హెచ్చరిస్తోంది. గూగుల్ తీసుకుంటున్న ఈ నిర్ణయం అందులో పనిచేస్తున్న ఉద్యోగులను మాత్రమే కాదు, కార్పొరేట్ ప్రపంచాన్ని కూడా భయభ్రాంతులకు గురిచేస్తుంది. ఆర్థిక మందగమనం ఇప్పటితో ముగిసిపోతే గూగుల్ సంస్థలో పరిస్థితులు మునుపటిలాగా ఉంటాయని.. తర్వాత నియామకాలు కూడా ప్రారంభమవుతాయని కార్పొరేట్ వర్గాలు అంచనా వేస్తున్నాయి. ఒకవేళ ఆర్థిక మందగమనం అలాగే కొనసాగితే మరింత కఠిన పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరిస్తున్నాయి.
Anabothula Bhaskar is a Senior Political Content writer who has very good knowledge on Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
Read MoreWeb Title: Google 17500 crore cost to google for layoffs of 12 thousand employees
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com