
గత కొన్ని రోజులుగా పసిడి ధరలు తగ్గుతుండగా దేశీయ మార్కెట్లో ఈరోజు బంగారం ధర పెరిగింది. దేశీయ మార్కెట్ లో 10 గ్రాముల బంగారం ధర ఏకంగా 150 రూపాయలు పెరగటంతో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 48,950 రూపాయలుగా 10 గ్రాముల 22 క్యారెట్ల ధర 47,950 రూపాయలుగా ఉంది. గత కొన్ని రోజులుగా నేల చూపులు చూసిన పసిడి మళ్లీ పెరుగుతూ ఉండటం గమనార్హం.
హైదరాబాద్ మార్కెట్ లో 24 క్యారెట్ల బంగారం ధర 49,950 రూపాయలుగా ఉండగా 22 క్యారెట్ల బంగారం ధర 45,800 రూపాయలుగా ఉంది. బంగారం ధర పెరుగుతున్నా కొనుగోళ్లు మాత్రం భారీగానే జరుగుతున్నాయని తెలుస్తోంది. బంగారం ధరలతో పాటు వెండి ధరలు కూడా పరుగులు పెట్టడం గమనార్హం. గత వారం రోజుల్లో వెండి ధర 2,000 రూపాయలు పెరగడంతో కిలో వెండి ధర 73,400 రూపాయలుగా ఉంది.
డిమాండ్ అంతకంతకూ పెరుగుతూ ఉండటంతో బంగారం, వెండి ధరలు పెరుగుతున్నాయని సమాచారం. భౌగోళిక ఉద్రిక్తతలు, వాణిజ్య యుద్ధాలు, బంగారంపై వడ్డీ రేట్లు, కేంద్ర బ్యాంకుల దగ్గర ఉన్న బంగారం నిల్వలు, ద్రవ్యోల్బణం, గ్లోబల్ మార్కెట్ పసిడి ధరలలో మార్పు, ఇతర అంశాలు బంగారం ధరపై ప్రభావం చూపుతాయి. దేశంలోని ప్రజలకు అందుబాటులోకి వస్తున్న కరోనా వ్యాక్సిన్ కూడా బంగారం, వెండి ధరలపై ప్రభావం చూపుతోంది.
మరోవైపు దేశంలోని పలు ప్రాంతాల్లో 10 గ్రాముల 24 క్యారెట్ల బంగారం ధర 50,000 మార్కును దాటడం గమనార్హం. చెన్నైలో 24 క్యారెట్ల బంగారం ధర 50,770 రూపాయలుగా ఉండగా 10 గ్రాముల 22 క్యారెట్ల బంగారం ధర 46,550 రూపాయలుగా ఉంది.