దేశంలో కరోనా మహమ్మారి కోరలు చాస్తోంది. ప్రతిరోజూ దేశవ్యాప్తంగా రికార్డు స్థాయిలో కొత్త కేసులు నమోదవుతున్నాయి. వేగంగా వ్యాప్తి చెందుతున్న ఈ వైరస్ ప్రత్యక్షంగా, పరోక్షంగా అన్ని రంగాలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. కరోనా వైరస్ ప్రభావం గ్యాస్ సిలిండర్ వినియోగదారులపై కూడా పడుతుండటం గమనార్హం. కరోనా విజృంభణ వల్ల ఎల్పీజీ సిలిండర్ డెలివరీ వాయిదా పడుతోంది. కొన్ని రోజుల క్రితం వరకు గ్యాస్ సిలిండర్ ఒకరోజులో డెలివరీ అయ్యేది.
ప్రస్తుతం గ్యాస్ సిలిండర్ డెలివరీ కావడానికి మూడు రోజుల సమయం పడుతోందని తెలుస్తోంది. వెండర్లు, డెలివరీ బాయ్స్ కరోనా బారిన పడటంతో సిలిండర్ డెలివరీ ఆలస్యమవుతోందని సమాచారం. రాబోయే రోజుల్లో కరోనా కేసులు మరింత పెరిగితే మాత్రం గ్యాస్ సిలిండర్ డెలివరీ మరింత ఆలస్యం అయ్యే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. కరోనా విజృంభణ వల్ల ఆంక్షలు విధించిన ప్రాంతాల్లో గ్యాస్ సిలిండర్ డెలివరీ నాలుగు నుంచి 5 రోజులు పట్టే అవకాశం ఉంది.
ఇంట్లో గ్యాస్ సిలిండర్ అయిపోయిన వాళ్లు వెంటనే సిలిండర్ ను బుకింగ్ చేసుకోవడం ద్వారా ఈ సమస్యకు చెక్ పెట్టవచ్చు. మరోవైపు గ్యాస్ సిలిండర్ల వినియోగం కూడా క్రమంగా తగ్గుతోందని తెలుస్తోంది. కరోనా వైరస్ భయం వల్ల చాలామంది హోటళ్లు, రెస్టారెంట్లలో భోజనం చేయడానికి ఆసక్తి చూపించడం లేదు. ఈ నెలలో కమర్షియల్ గ్యాస్ సిలిండర్ బుకింగ్ ఏకంగా 80 శాతం తగ్గినట్టు తెలుస్తోంది.
డొమెస్టిక్ సిలిండర్ బుకింగ్ సైతం ఏకంగా 25 శాతం క్షీణించినట్టు తెలుస్తోంది. మరోవైపు రోజురోజుకు పెరుగుతున్న నిత్యావసర వస్తువుల ధరల వల్ల ప్రజలు పడుతున్న ఇబ్బందులు అన్నీఇన్నీ కావు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ధరలు తగ్గించడానికి చర్యలు చేపడితే బాగుంటుందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు