Foxconn Vedanta Deal Cancelled: ఆ మధ్య మహారాష్ట్రలో ఏర్పాటు చేయాల్సిన సెమీకండక్టర్ ప్లాంటును ప్రధానమంత్రి మోడీ పట్టు పట్టి గుజరాత్ రాష్ట్రంలో ఏర్పాటు చేయించాడు కదా. అప్పుడు ఎన్నికలు ఉన్నాయి కాబట్టి మోడీ ఈ పని చేశారని చాలామంది అనుకున్నారు. అయినప్పటికీ అవి ఏం లెక్కపెట్టకుండా మోడీ ముందుకే వెళ్ళాడు. ఈ ప్రభావం గుజరాత్ రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల మీద బాగానే పనిచేసింది. ఏకంగా 1,60,000 కోట్లతో ఈ ప్లాంట్ ఏర్పాటు చేస్తుండడంతో బిజెపిపై సానుకూల పవనాలు వీచాయి. ఇప్పుడు తాజాగా అందుతున్న సమాచారం ప్రకారం గుజరాత్ లో ఏర్పాటు చేయబోయే సెమీ కండక్టర్ ప్లాంట్ నుంచి తాము వెళ్ళిపోతున్నామని ఈ ప్రాజెక్టులో ప్రధాన భాగస్వామి ఫాక్స్ కాన్ వెల్లడించింది. దీంతో ఒక్కసారిగా దేశవ్యాప్తంగా కలకలం చెలరేగింది. “ఇతర అవకాశాలను అందిపుచ్చుకునే క్రమంలో పరస్పర అంగీకారం మేరకు జాయింట్ వెంచర్ నుంచి మేము వైదొలగుతున్నాం. నిజానికి గొప్ప ఆలోచనతో సెమీ కండక్టర్ ప్లాంట్ ఏర్పాటు కోసం వేదాంత అనే కంపెనీతో ఏడాది పాటు కష్టపడి పని చేసాం. అయితే, ఈ మైత్రి బంధం నుంచి మేము వెళ్లిపోవాలి అని నిర్ణయించుకున్నాం.. గడిచిన ఏడాది మాకెంతో అనుభవాన్ని నేర్పించింది” అని ఫాక్స్ కాన్ వెల్లడించింది.
గతంలో ఏం జరిగిందంటే?
తైవాన్ దేశానికి చెందిన గ్లోబల్ ఎలక్ట్రానిక్స్ దిగ్గజం ఫాక్స్ కాన్ గనులు, చమురు రంగ దిగ్గజం వేదాంత అనే కంపెనీతో జట్టు కట్టింది. గుజరాత్ రాష్ట్రంలో 1.6 లక్షల కోట్ల పెట్టుబడితో సెమీ కండక్టర్, డిస్ప్లే తయారీ ప్లాంట్లు ఏర్పాటు చేసేందుకు సంతకాలు చేసింది.. అయితే ఈ జాయింట్ వెంచర్ నుంచి ఫాక్స్ కాన్ పేరు తొలగించేందుకు మేము తీవ్రంగా కసరత్తు చేస్తున్నాం.. ఇకనుంచి ఆ జాయింట్ వెంచర్ పూర్తిగా వేదాంత గ్రూపునకు చెందినదే అంటూ ఫాక్స్ కాన్ చేసిన ప్రకటన ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది. వాస్తవానికి మహారాష్ట్రలో సెమీ కండక్టర్, డిస్ ప్లే తయారీ ప్లాంట్ల ఏర్పాటుకు వేదాంత_ ఫాక్స్ కాన్ ఏడాది క్రితమే అంటే ఫిబ్రవరిలో ముందుకు వచ్చాయి. అదే ఏడాది చివరిలో గుజరాత్ అసెంబ్లీకి ఎన్నికలు జరగాల్సి ఉంది. అయితే అనూహ్యంగా ఈ వెంచర్ గుజరాత్ రాష్ట్రానికి వెళ్లిపోయింది. దీనిపై విపక్షాలు మండిపడ్డాయి. ఎన్నికల్లో లబ్ధి కోసమే కేంద్రంలోని బిజెపి సర్కార్ ప్రాజెక్టును గుజరాత్ కు తీసుకెళ్లిందని విమర్శించాయి. 1.6 లక్షల కోట్లతో గుజరాత్ లో ప్లాంట్ ఏర్పాటు చేయబోతున్నట్టు సెప్టెంబర్ 2022న రెండు కంపెనీలు కూడా ప్రకటించాయి. గుజరాత్ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ గెలిచింది. అయితే ఇక్కడ సెమీ కండక్టర్ల తయారీలో వేదాంత తో పాటు ఫాక్స్ కాన్ కు కూడా సాంకేతిక పరిజ్ఞానం లేదు. దీంతో మూడో కంపెనీని టెక్నాలజీ భాగస్వామిగా చేర్చుకోవాలని రెండు కంపెనీలు నిర్ణయించాయి. దీనికి కేంద్రం కూడా అనుమతించింది. ఈ క్రమంలో ఐరోపాకు చెందిన ఎస్టీ మైక్రో ఎలక్ట్రానిక్స్ ను సాంకేతిక భాగస్వామిగా చేర్చుకునేందుకు సిద్ధమయ్యాయి. కానీ టెక్నాలజీ పార్ట్ నర్ గానే కాకుండా ప్రాజెక్టులోనూ ఎస్టీ మైక్రో ను భాగస్వామిగా చేసుకోవాలంటూ కేంద్రం మెలిక పెట్టింది. దీనికి ఫాక్స్ కాన్ అడ్డు చెప్పింది.. అయితే ఈ వ్యవహారంలో ఎస్టీ మైక్రో కూడా అంత ఆసక్తి చూపకపోవడం విశేషం.
ప్రోత్సాహకాలు బంద్
ఈ నేపథ్యంలో పి ఎల్ ఐ స్కీం కింద ప్రాజెక్టుకు ప్రోత్సాహకాలను కేంద్రం నిలిపివేసింది. కేంద్రం కొర్రీలు, ఇతర దేశాల్లో కొత్త ప్రాజెక్టులపై ఈ వెంచర్ ప్రభావం పడుతుండడం, కంపెనీ ట్రాక్ దెబ్బతినే సూచనలు… ఇవన్నీ కూడా ఈ ప్రాజెక్టు నుంచి ఫాక్స్ కాన్ తప్పుకునేందుకు కారణాలుగా సంబంధిత వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.
అందుకే అడ్డుకున్నారా?
ఇక దేశంలో వేదాంత గ్రూప్ చమురు, గనుల రంగంలో దిగ్గజ సంస్థ. ఈ సంస్థ చైర్మన్ అనిల్ అగర్వాల్ కు బిజెపితో సన్నిహిత సంబంధాలు ఉన్నట్టు వ్యాపార వర్గాలు పేర్కొంటుంటాయి. గత ఏడాది ఎలక్టోరల్ బాండ్ల రూపంలో వివిధ రాజకీయ పార్టీలకు వేదాంత గ్రూప్ 155 కోట్లు విరాళం ఇచ్చింది. ఇలా గత ఐదేళ్లలో ఏకంగా 457 కోట్లు చెల్లించింది.. మెజారిటీ నిధులు భారతీయ జనతా పార్టీకి ఇచ్చిందని కొంతమంది రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. ఇక ఎస్టి మైక్రో నుంచి కొన్ని రోజుల క్రితమే ట్వీన్ స్టార్ టెక్నాలజీ అనే కంపెనీ సెమీ కండక్టర్ తయారీ సాంకేతికతను అందిపుచ్చుకుంది. ఈ కంపెనీనే గత వారం వేదాంత గ్రూప్ కొనుగోలు చేసింది. దీంతో సెమీ కండక్టర్ తయారీ సాంకేతికతను వేదాంత అందిపుచ్చుకున్నట్టయింది. ఈ వెంచర్ నుంచి ఫాక్స్ కాన్ తప్పుకోవడానికి ఇది కూడా ఓ కారణం కావచ్చని పలువురు అభిప్రాయపడుతున్నారు.. దీని ధ్రువపరుస్తూ ప్రోత్సాహకాల విడుదలకు మొన్నటి వరకు అడ్డు పుల్ల వేసిన కేంద్రం.. ఇటీవల వెంచర్ కు 50% రాయితీ ఇస్తామని వెల్లడించడం విశేషం. ఇక, చిప్ అసెంబ్లింగ్ ప్యాకేజింగ్ కోసం రూ. 22,717 కోట్లతో అమెరికా కంపెనీ మైక్రాన్ టెక్నాలజీ తో ఇటీవల కేంద్రం ఒక ఒప్పందం కుదుర్చుకుంది. గుజరాత్ లో ఏర్పాటు చేసే ఈ కంపెనీ కోసం 70% రాయితీ ఇస్తోంది. వేదాంత కంపెనీ తయారు చేసే సెమీ కండక్టర్లు మైక్రాన్ బ్రాంచ్ లో అసెంబ్లింగ్ కాబోతున్నాయి. వీటన్నిటిని విశ్లేషిస్తే 1.26 లక్షల కోట్ల అప్పులో కూరుకుపోయిన వేదాంతను ఒడ్డుకు చేర్చి.. రానున్న ఎన్నికల్లో రాజకీయ లబ్ధి పొందేందుకు భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం 1.6 లక్షల కోట్ల విలువైన జాయింట్ వెంచర్ నుంచి ఫాక్స్ కాన్ ను తప్పించి మొత్తం ప్రాజెక్టును వేదాంతకు కట్టబెట్టేలా చేసిందని పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
వేదాంత ఏమంటుందంటే..
వెంచర్ నుంచి ఫాక్స్ కాన్ వైదొలిగిన నేపథ్యంలో వేదాంతకంపెనీ కీలక ప్రకటన చేసింది. ఫాక్స్ కాన్ వెళ్లిపోయిన తర్వాత మాత్రాన జాయింట్ వెంచర్ కు వచ్చిన ఇబ్బంది లేదని వెల్లడించింది. చిప్ ప్లాంట్ ఏర్పాటుకు తాము కట్టుబడి ఉన్నామని వివరించింది. 40 ఎన్ ఎం గ్రేడ్ టెక్నాలజీ చిప్స్ తయారీకి సంబంధించి తన వద్ద లైసెన్సు ఉందని ప్రకటించింది. మరో వైపు దీనిపై కేంద్రం కూడా ఇదే స్థాయిలోనే స్పందించింది. జాయింట్ వెంచర్ నుంచి ఫాక్స్ కాన్ వైదొలిగినంత మాత్రాన వచ్చిన ఇబ్బందిలేదని స్పష్టం చేసింది. భారత్ సెమి కండక్టర్, డిస్ ప్లే తయారీలో కచ్చితంగా అగ్రస్థానం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేసింది.