Hero Splendor, Honda Activa Sales
February Sales : దేశంలో అత్యధికంగా అమ్ముడయ్యే బైక్ హీరో స్ప్లెండర్..స్కూటర్ హోండా యాక్టివా ఈ రెండింటి అమ్మకాలు ఫిబ్రవరి 2025లో పెద్ద ఎదురుదెబ్బను చవిచూశాయి. అమ్మకాల పరంగా ఇవి ఇప్పటికీ మొదటి, రెండవ స్థానాల్లో ఉన్నప్పటికీ హీరో స్ప్లెండర్ అమ్మకాలు ఫిబ్రవరిలో మాత్రం 25 శాతానికి పైగా తగ్గాయి. దీని వెనుక కారణం ఏంటో తెలుసుకుందాం.
ఫిబ్రవరి 2025లో 2.07 లక్షల యూనిట్ల హీరో స్ప్లెండర్ అమ్ముడయ్యాయి. గత ఏడాది ఫిబ్రవరిలో అమ్ముడైన 2.77 లక్షల యూనిట్ల కంటే ఇది పూర్తిగా 25.25 శాతం తక్కువ. అదే విధంగా ఈ ఏడాది ఫిబ్రవరిలో హోండా యాక్టివా అమ్మకాలు 1.74 లక్షల యూనిట్లుగా నమోదయ్యాయి. ఇది గతేడాది 2లక్షల యూనిట్ల కంటే 13శాతం తక్కువ.
Also Read : హైబ్రిడ్ మోటార్ సైకిల్ అంటే ఏంటి.. యమహా FZ-S Fi ఫీచర్స్, ధర పూర్తి వివరాలివే
గత నెలలో ద్విచక్ర వాహన మార్కెట్లో పెద్ద మార్పు కనిపించింది. హీరో స్ప్లెండర్ ప్రత్యర్థి హోండా షైన్, హోండా యాక్టివా ప్రత్యర్థి టీవీఎస్ జూపిటర్ అమ్మకాలు భారీగా పెరిగాయి. ఫిబ్రవరి 2025లో హోండా షైన్ అమ్మకాలు 8.26 శాతం పెరిగి 1.54 లక్షల యూనిట్లకు చేరుకున్నాయి. టీవీఎస్ జూపిటర్ అమ్మకాలు 40.23 శాతం వృద్ధితో 1.03 లక్షల యూనిట్లుగా నమోదయ్యాయి. గతేడాది వాటి అమ్మకాలు వరుసగా 1.42 లక్షలు, 73,860 యూనిట్లుగా నమోదయ్యాయి.
ఇండియాలో బైక్ మార్కెట్ ను సమూలంగా మార్చిన బజాజ్ పల్సర్ అమ్మకాలు కూడా ఫిబ్రవరి 2025లో తగ్గాయి. దీని అమ్మకాలు 21.90 శాతం తగ్గి 87,902 యూనిట్లకు చేరుకున్నాయి. కాగా, ఫిబ్రవరి 2024లో 1.12 లక్షల యూనిట్లు అమ్ముడయ్యాయి.
హీరో స్ప్లెండర్ అమ్మకాలు పడిపోయినప్పటికీ ఆ బైక్ ఇప్పటికీ దేశంలో నంబర్-1గా ఉంది. కాగా, హోండా యాక్టివా తన రెండవ స్థానాన్ని అలాగే నిలబెట్టుకుంది. దీని తరువాత హోండా షైన్ మూడవ స్థానంలో, టీవీఎస్ జూపిటర్ నాల్గవ స్థానంలో, బజాజ్ పల్సర్ ఐదవ స్థానంలో, హీరో హెచ్ఎఫ్ డీలక్స్ ఆరవ స్థానంలో, సుజుకి యాక్సెస్ ఏడవ స్థానంలో, టీవీఎస్ అపాచీ ఎనిమిదవ స్థానంలో, టీవీఎస్ ఎక్స్ఎల్ తొమ్మిదవ స్థానంలో, రాయల్ ఎన్ఫీల్డ్ క్లాసిక్ 360 పదో స్థానంలో ఉన్నాయి.
అమ్మకాలు ఎందుకు తగ్గుతున్నాయి?
దేశంలోని ద్విచక్ర వాహన విభాగంలో పెద్ద మార్పు కనిపిస్తోంది. నాలుగు చక్రాల వాహనాలతో పోలిస్తే ద్విచక్ర వాహనాల విభాగంలో ఎలక్ట్రిక్ వాహనాల విక్రమాలు వేగంగా పెరుగుతున్నాయి. మన దేశంలో బజాజ్ చేతక్, ఓలా S1 ప్రో, TVS iQube, Ather Rezza వంటి ఎలక్ట్రిక్ స్కూటర్లు , Revolt వంటి ఎలక్ట్రిక్ బైక్‌ల అమ్మకాలు ప్రతినెల పెరుగుతున్నాయి. వినియోగదారులు భవిష్యతులో పెట్రోల్ టూ-వీలర్ల నుంచి ఎలక్ట్రిక్ టూ-వీలర్లకు మారే అవకాశం కనిపిస్తుంది.
Also Read : త్వరలో మార్కెట్లోకి బీఎండబ్ల్యూ రూ.11లక్షల స్కూటర్.. ఫీచర్లు తెలిస్తే దిమ్మ తిరగాల్సిందే