Elon Musk: మనదేశంలో అత్యధిక వేతనాలు తీసుకొనే ప్రైవేట్ కంపెనీల అధినేతలలో ముకేశ్ అంబానీ, కావేరి మారన్, రోషిణి నాడార్, ఆనంద్ మహీంద్రా ముందు వరసలో ఉంటారు. వీరి వార్షిక వేతనం కోట్లల్లో ఉంటుంది. ప్రతి ఏడాది వీరి వేతనం పెరుగుతూనే ఉంది. పెరిగిన వేతనం ద్వారా వీరు రికార్డులు సృష్టిస్తూనే ఉన్నారు.. కార్పొరేట్ ప్రపంచంలో సరికొత్త ఘనతలను అందుకుంటునే ఉన్నారు. మన దేశం గురించి కాస్త పక్కన పెడితే.. ప్రపంచంలోనే అత్యధిక వేతనం తీసుకుంటున్న వ్యక్తిగా రికార్డ్ సృష్టించాడు టెస్లా అధినేత మస్క్.
టెస్లా.. ఎక్స్, స్పేస్ ఎక్స్ కంపెనీల అధినేతగా.. ప్రపంచ కుబేరుడిగా పేరుపొందాడు మస్క్. ఇంకా తన వ్యాపారాలను మరింత స్థాయికి విస్తరించడానికి ఆయన ప్రణాళికలు రూపొందిస్తున్నారు. టెస్లా కార్ల విక్రయాల ద్వారా సరికొత్త రికార్డులను సృష్టిస్తున్నారు. అటువంటి మస్క్ శాటిలైట్ ఇంటర్నెట్ వ్యాపారం లోకి కూడా అడుగు పెట్టారు. త్వరలోనే భారతదేశంలో సేవలు అందించబోతున్నారు. దీనికి సంబంధించి అనుమతులు కూడా వచ్చాయి. ఈ నేపథ్యంలో మస్క్ మరో రికార్డు సృష్టించారు. కార్పొరేట్ ప్రపంచం కనీ విని ఎరుగని ఘనతను ఆయన అందుకున్నాడు. ఇంతకీ ఆయన ఏం చేశాడంటే..
ఇటీవల అమెరికా ఎన్నికల్లో ట్రంప్ తరఫున ప్రచారం చేశాడు మస్క్. ట్రంప్ ప్రభుత్వంలో క్రియాశీలక పాత్ర కూడా పోషించాడు. ఆ తర్వాత ఆ స్థానం నుంచి తప్పుకున్నాడు. ట్రంప్ తో తనకు విభేదాలు ఉన్నాయని పేర్కొన్నాడు. ట్రంప్ తో స్నేహం ముగిసిన అధ్యాయమని మస్క్ వెల్లడించాడు.. ఇక ఇప్పుడు మస్క్ కార్పొరేట్ ప్రపంచంలో సరికొత్త అధ్యాయాన్ని సృష్టించాడు. ఆయనకు వన్ ట్రిలియన్ డాలర్ల ప్యాకేజీ ఇవ్వడానికి టెస్లా కంపెనీకి చెందిన 75 శాతం షేర్ హోల్డర్లు ఆమోదం తెలిపారు. వన్ ట్రిలియన్ డాలర్లు అంటే దాదాపు 88 లక్షల కోట్లు. ఫలితంగా కార్పొరేట్ ప్రపంచంలో అత్యధిక వేతనం అందుకుంటున్న ఆయన చరిత్ర సృష్టించాడు. అయితే మస్త్ నెల జీతం గా కాకుండా.. ఆ మొత్తాన్ని వచ్చే పది సంవత్సరాలలో స్టాక్స్ రూపంలో ఆయన పొందుతారు. ప్రస్తుతం 476 బిలియన్ డాలర్ల సంపద తో మస్క్ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుడిగా ఉన్నాడు.