Vijaya Sai Reddy: విజయసాయిరెడ్డి ( Vijaya Sai Reddy )యూటర్న్ తీసుకున్నారా? జగన్మోహన్ రెడ్డికి దగ్గర అవుతున్నారా? లిక్కర్ స్కామ్ కేసులో సాక్షులుగా ఉన్న ఆయన అల్లుడు పిటిషన్ వేయడం ఏంటి? వాంగ్మూలం వెనక్కి తీసుకోవాలని కోరడం ఏంటి? ఇప్పుడు పొలిటికల్ సర్కిల్లో ఇదే చర్చ నడుస్తోంది. విజయసాయిరెడ్డి వ్యవహారంలో రెండు పరిణామాలు ఇప్పుడు ఆసక్తికరంగా మారాయి. విశాఖ బీచ్ ను విధ్వంసం చేశారని ఆయన కుమార్తె కంపెనీ పై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. జీవీఎంసీ కి నష్టపరిహారం చెల్లించాలని ఆదేశాలు ఇచ్చింది. అదే సమయంలో లిక్కర్ స్కాం కేసులో సాక్షులుగా ఉన్న రోహిత్ రెడ్డి, శరత్ చంద్రారెడ్డి ప్రత్యేక దర్యాప్తు బృందానికి ఇచ్చిన వాంగ్మూలాలను వెనక్కి తీసుకోవాలని కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు.
* కొద్దిరోజులుగా సైలెంట్..
కొన్ని నెలల కిందట విజయసాయిరెడ్డి వైయస్సార్ కాంగ్రెస్( YSR Congress) పార్టీకి గుడ్ బై చెప్పారు. అయితే ఆయన వ్యవసాయం చేసుకుంటానని చెప్పుకొచ్చారు. కానీ అనూహ్యంగా లిక్కర్ స్కాం కేసులు అనధికారిక అప్రూవర్ గా మారారు. ఆయన ఇచ్చిన సమాచారంతోనే వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలపై కేసుల నమోదు, అరెస్టులు జరిగాయని అంతా భావించారు. కానీ ఇటీవల విజయసాయిరెడ్డి ఫుల్ సైలెంట్ అయ్యారు. కనీసం ఎక్కడ ఉన్నారో కూడా తెలియడం లేదు. గతంలో విజయసాయి రెడ్డి అల్లుడు రోహిత్ రెడ్డి, ఆయన సోదరుడు శరత్ చంద్రారెడ్డి లిక్కర్ స్కామ్ దర్యాప్తు చేస్తున్న సిట్ కు వాంగ్మూలం ఇచ్చారు. తమ కంపెనీల ద్వారా లిక్కర్ స్కాం నగదును చలామణి చేశారని.. అందులో రూపాయి కూడా తాము సంపాదించలేదని చెప్పుకొచ్చారు. ఇప్పుడు ఆ వాంగ్మూలాన్ని వెనక్కి ఇప్పించాలని కోర్టులో వారు పిటిషన్ దాఖలు చేయడం మాత్రం సంచలనంగా మారింది. దీని వెనుక విజయసాయిరెడ్డి ఉన్నట్లు ప్రచారం నడుస్తోంది.
* అంతా ఆయన ఇచ్చిన వివరాలతో..
కచ్చితంగా కేసులకు భయపడి విజయసాయిరెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీకి గుడ్ బై చెప్పారని సాక్షాత్ జగన్మోహన్ రెడ్డి( Y S Jagan Mohan Reddy ) చెప్పుకొచ్చారు. వైసీపీ శ్రేణులు సైతం ఇదే విషయాన్ని చెప్పుకుంటూ వస్తున్నాయి. ప్రధాన నిందితుడు రాజ్ కసిరెడ్డి అసలు సూత్రధారుడు అన్న విజయసాయిరెడ్డి.. అవసరమైతే ప్రత్యేక దర్యాప్తు బృందానికి అన్ని వివరాలు సమర్పిస్తానని చెప్పుకొచ్చారు. మొత్తం విజయసాయిరెడ్డి ఇచ్చిన వివరాలతోనే ఇప్పటి వరకు అరెస్టులు జరుగుతున్నాయని అంతా భావించారు. అయితే ఇప్పుడు ఆయన అల్లుళ్లు ఇద్దరు పిటిషన్లు దాఖలు చేయడంతో.. విజయసాయిరెడ్డి అడ్డం తిరిగారు అన్న టాక్ వినిపిస్తోంది.
* వేరే గత్యంతరం లేక..
విజయసాయిరెడ్డి వైయస్సార్ కాంగ్రెస్ పార్టీలో తిరిగి చేరతారని ప్రచారం సాగింది. ఆయనకు ఇప్పుడు ఆప్షన్ లేదు. జగన్మోహన్ రెడ్డికి గత్యంతరం లేదు. జగన్ పక్కన విజయసాయిరెడ్డి ఉండడంతో చాలా రకాల పనులు ఇట్టే జరిగిపోయేవి. ఢిల్లీ స్థాయిలో చాలా పనులను చక్కదిద్దే వారు విజయసాయిరెడ్డి. కానీ జగన్మోహన్ రెడ్డికి ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పేరు మోసిన బిగ్ హాండ్స్ కలిసి రావడం లేదు. ఇటువంటి తరుణంలో విజయసాయిరెడ్డి తో రాజీ చేసుకుంటే మంచిదన్న అభిప్రాయానికి వచ్చినట్లు తెలుస్తోంది. అదే సమయంలో ఏ కేసులకు భయపడి వైసీపీ నుంచి బయటకు వచ్చారో.. అది నెరవేరడం లేదు. అందుకే విజయసాయిరెడ్డి నిర్ణయానికి వచ్చినట్లు ప్రచారం నడుస్తోంది. మరి అందులో ఎంత వాస్తవం ఉందో చూడాలి.