https://oktelugu.com/

Byjus Crisis: బై జూస్.. ఎంత పతనం.. ఎంత అవమానం..

ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ఉల్లంఘనకు పాల్పడ్డారని రవీంద్రన్ పై ఈడీ పలు అభియోగాలు మోపింది. 9362 కోట్ల అక్రమ లావాదేవీలకు పాల్పడ్డారని రవీంద్రన్ పై ఆరోపణలు ఉన్నాయి.

Written By:
  • Velishala Suresh
  • , Updated On : February 22, 2024 6:54 pm
    Byjus Crisis
    Follow us on

    Byjus Crisis: అప్పట్లో సత్యం కంపెనీ అంటే ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో మాత్రమే కాదు దేశం మొత్తం క్రేజ్ ఉండేది. అమెరికా అధ్యక్షుడు బిల్ క్లింటన్ సత్యం రామలింగరాజు వ్యాపార చొరవను అభినందించారు. కానీ కొంతకాలానికి ఏమైంది సత్యం అసలు రూపం మేటాస్ తో బయటపడింది. దీంతో ఒక్కసారిగా సత్యం రామలింగరాజు ఆర్థిక నేరగాడయిపోయారు. జైలుకు వెళ్లారు. తర్వాత బయటికి వచ్చినప్పటికీ ఒకప్పటి ప్రభ, తేజస్సు ఆయనలో లేదు. పెద్దపెద్ద కార్పొరేటర్ తో వ్యాపార లావాదేవీలు నిర్వహించే ఆయన ప్రస్తుతం ఒక అనామక వ్యక్తిగా మిగిలిపోయారు. కనీసం ఆయన ఏం చేస్తున్నారో బయటి ప్రపంచానికి తెలియనంత అజ్ఞాత జీవితం గడుపుతున్నారు. ప్రస్తుతం బైజూస్ సీఈవో రవీంద్రన్ కూడా ఇలాంటి పరిస్థితిని ఎదుర్కొంటున్నారు.. ఒకప్పుడు తాను స్థాపించిన బైజుస్ కంపెనీ ఎడ్ టెక్ విభాగంలో మెరుపులు మెరిపించింది. రవీంద్రన్ ను మీడియా ఆకాశానికి ఎత్తింది. కోవిడ్ సమయంలో ఈ కంపెనీ షేర్ తారాజువ్వలాగా ఎగిసింది. కోట్లల్లో లావాదేవీలు జరగడంతో కంపెనీ స్థాయి ఎక్కడికో వెళ్ళింది. చివరికి టీమిండియా క్రికెట్ జట్టుకు స్పాన్సర్ గా వ్యవహరించే స్థాయికి ఎదిగింది. ఏపీ ప్రభుత్వం కూడా బై జూస్ తో వందల కోట్లతో ఒప్పందం కుదుర్చుకుంది. కానీ ఇదంతా గతం. వెలుగు వెనుక చీకటి ఉన్నట్టే.. ఒక్కొక్కటిగా చీకటి బాగోతాలు వెలుగు చూస్తుండడంతో బైజూస్ రవీంద్రన్ ఒక్కసారిగా ఆర్థిక నేరగాడైపోయారు.. అతనిపై ఏకంగా ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ లు కౌట్ నోటీస్ జారీ చేసింది. ఈ నోటీస్ జారీ చేయాలని ఇమ్మిగ్రేషన్ బ్యూరోను ఈడీ కోరింది. రవీంద్రన్ దేశం విడిచి వెళ్ళిపోకుండా ఉండేందుకు ఈడీ పకడ్బందీగా చర్యలు తీసుకుంటోంది.

    ఫారెన్ ఎక్స్చేంజ్ మేనేజ్మెంట్ యాక్ట్ ఉల్లంఘనకు పాల్పడ్డారని రవీంద్రన్ పై ఈడీ పలు అభియోగాలు మోపింది. 9362 కోట్ల అక్రమ లావాదేవీలకు పాల్పడ్డారని రవీంద్రన్ పై ఆరోపణలు ఉన్నాయి. రవీంద్రన్ నడిపిన వ్యవహారం చాలా తీవ్రమైనదని.. అతనిపై ఎల్ఓసి ఓపెన్ చేశామని ఈడి అధికారులు చెబుతున్నారు. ఫెమా నిబంధనలకు విరుద్ధంగా రవీంద్రన్ విదేశాలకు డబ్బులు పంపించారని ఈడి అధికారులు ఆరోపిస్తున్నారు. అతడు చేసిన పని వల్ల కేంద్ర ప్రభుత్వానికి తీవ్ర నష్టం వాటిల్లిందని అన్నారు. ఇలా విదేశాలకు అక్రమంగా డబ్బులు పంపి.. కంపెనీలో కృత్రిమ నష్టాలు సృష్టించారని.. చివరికి ఉద్యోగులకు జీతాలు కూడా ఇవ్వలేదని.. బై జూస్ ను ఒక నష్టదాయక సంస్థగా చూపించే ప్రయత్నం చేశారని ఈడి అధికారులు అంటున్నారు.. తమకు వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా రవీంద్రన్ వ్యవహారాలను పరిశీలిస్తే కళ్ళు బైర్లు కమ్మే వాస్తవాలు తెలిసాయని అధికారులు అంటున్నారు.

    బైజుస్ మాతృ సంస్థగా థింక్ అండ్ లెర్న్ వ్యవహరిస్తోంది. ఈ కంపెనీ కింద ఫెమా నిబంధనలు ఉల్లంఘించి 9362 కోట్ల అక్రమ లావాదేవీలను రవీంద్రన్ జరిపినట్టు తెలుస్తోంది. ఈ క్రమంలోనే థింక్ అండ్ లెర్న్ ప్రైవేట్ సంస్థకు గత ఏడాది నవంబర్లో ఈడి అధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. అయినప్పటికీ ఆ సంస్థ నుంచి ఎటువంటి బదులు లేకపోవడంతో ఈడి అధికారులు రంగంలోకి దిగి అసలు విషయాన్ని తవ్వడం ప్రారంభించారు. రవీంద్రన్ థింక్ అండ్ లెర్న్ కంపెనీ ద్వారా 9362 కోట్ల అక్రమ లావాదేవీలు జరిపారు. ఈ నేపథ్యంలో గత ఏడాది ఏప్రిల్ 27, 28 తేదీల్లో ఈడి అధికారులు రవీంద్రన్ ఇంట్లో తనిఖీలు చేశారు. పెట్టుబడులకు సంబంధించిన దస్త్రాలను స్వాధీనం చేసుకున్నారు. విచారణ సమయంలో రవీంద్రన్ తో పాటు చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ వాంగ్మూలం తీసుకున్నారు.

    ఎడ్ టెక్ కంపెనీగా బైజూస్ సృష్టించిన సంచలనం అంతా ఇంతా కాదు. 43 సంవత్సరాల రవీంద్రన్ అప్పుడు ఈ కంపెనీ ప్రారంభించినప్పుడు దేశం మొత్తం అతడిని వెయ్యినోళ్ల కొనియాడింది. ఆ తర్వాత ఈ కంపెనీ తన విలువను కోల్పోవడం ప్రారంభించింది. కోవిడ్ తర్వాత పాఠశాలలు పునః ప్రారంభం కావడంతో బైజూస్ కు డిమాండ్ తగ్గింది. వ్యాపార విస్తరణ కోసం తీసుకున్న రుణాలు భారీగా పెరిగిపోవడంతో కంపెనీ తీవ్ర ఒడిదుడుకులు ఎదుర్కొంది. చివరికి 1.2 బిలియన్ డాలర్ల రుణ విషయంలోనూ బైజూస్ న్యాయపరంగా పోరాడాల్సి వచ్చింది. అంటే కంపెనీ విలువ పడిపోవడమే ఇందుకు ప్రధాన కారణం. ఈ క్రమంలో బై జూస్ లో రవీంద్రన్ ను తొలగించి కొత్త బోర్డు ఏర్పాటు చేయాలని వాటాదారులు డిమాండ్ చేస్తున్నారు.. అయితే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్ల సమావేశంలో తీసుకున్న ఏవైనా నిర్ణయాలు తదుపరి విచారణ వరకు చెల్లుబాటు కావని కర్ణాటక హైకోర్టు ఆదేశాలు జారీ చేయడం విశేషం. ఈ ఆదేశాల వల్ల రవీంద్రన్ కు కొంత ఉపశమనం కలిగించే అవకాశం ఉంది.. బైజూస్ లో ప్రోసస్, జనరల్ అట్లాంటిక్, చాన్ జూకర్ బర్గ్ ఇని షి యేటివ్ వంటి సంస్థలున్నాయి. చాన్ జూకర్ బర్గ్ ఇని షి యేటివ్ ను ఫేస్ బుక్ వ్యవస్థాపకుడు మార్క్ జూకర్ బర్గ్, అతడి భార్య ప్రిస్పిల్లా చాన్ ఏర్పాటు చేశారు. మొదట్లో ఎడ్ టెక్ కంపెనీగా బైజూస్ భారీగా లాభాలు నమోదు చేస్తున్న నేపథ్యంలోమార్క్ జూకర్ బర్గ్, అతడి భార్య ప్రిస్పిల్లా చాన్ ఇందులో పెట్టుబడులు పెట్టారు. గత సంవత్సరం బైజుస్ బోర్డు నుంచి వైదొలిగారు.