Chittem Sudheer Success Story: చదువుకోవాలి.. ఉద్యోగం సాధించాలి.. దాదాపు అందరి యువత ఆలోచన కూడా ఇదేవిధంగా ఉంటుంది. మనదేశంలో నూటికి 90% మంది ఇలానే ఆలోచిస్తూ ఉంటారు. కానీ ఆ పది శాతం మంది మాత్రమే విభిన్నంగా ఉంటారు. అదే స్థాయిలో ఆలోచిస్తారు.. వారికి ఉద్యోగించడం ఇష్టం ఉండదు. ఉద్యోగాలను సృష్టించడం ఇష్టం ఉంటుంది. అన్నిటికంటే ముఖ్యంగా తాము ఒకరి కింద పని చేయడం కంటే.. తామే పది మందికి ఉపాధి కల్పించడాన్ని ఇష్టంగా భావిస్తుంటారు. అలాంటి జాబితాలో ఈ యువకుడు కూడా ఉంటాడు. పైగా ఇతడికి ప్రథమ స్థానం ఇవ్వవచ్చు. ఎందుకంటే ఇతడు ఎంచుకున్న మార్గం భిన్నమైనది. ఇతడు సాగిస్తున్న వ్యాపారం అత్యంత ప్రాచుర్యం పొందింది.
నేటి కాలంలో చాలామందికి ఆరోగ్యం మీద విపరీతమైన స్పృహ పెరిగిపోయింది. జంక్ ఫుడ్ తినకుండా.. నూనె పదార్థాలు తినకుండా.. సాధ్యమైనంతవరకు వెనకటి కాలంలో ఉన్న ఆహారాన్ని తినడానికి ఇష్టపడుతున్నారు. వెనుకటి కాలంలో ఎక్కువగా తృణ ధాన్యాలను ఆహారంగా తీసుకునేవారు. జొన్నలు, అరికెలు, ఊదలు, సామలు, కొర్రలు, అండు కొర్రలు, రాగులు, సజ్జలను ఆహారంగా తీసుకునేవారు. వీటితో రకరకాల వంటలు తయారు చేసుకుని తినేవారు. నాటి కాలంలో వీటిని తినడం ద్వారా ఆరోగ్యంగా ఉండేవారు. ఎటువంటి రోగాల బారిన పడకుండా దాదాపు 100 సంవత్సరాల పాటు జీవించేవారు.. నాటి కాలంలో వీటిని తిన్నవారు.. నేటి రోజుల్లోనూ ఆరోగ్యంగా ఉన్నారు. అయితే వీటి ప్రాముఖ్యతను గుర్తించిన వైజాగ్ యువకుడు సరికొత్త ప్రయోగం చేశాడు. తను చదువుకున్న చదువుకు సంబంధం లేని వ్యాపారం మొదలు పెట్టాడు. కేవలం 50 ఇన్వెస్ట్మెంట్ తో నెలకు 7.5 లక్షలు ఇన్ కం సొంతం చేసుకుంటున్నాడు.
Also Read: ఎంత గుండెధైర్యం అమ్మా.. అంత పెద్ద కింగ్ కోబ్రాను ఇలా పట్టేసింది.. వీడియో
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని వైజాగ్ ప్రాంతానికి చెందిన చిట్టెం సుధీర్.. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేశాడు. ఇతడికి బిజినెస్ చేయడం పట్ల విపరీతమైన ఆసక్తి ఉండేది. అందువల్లే హోటల్ వ్యాపారం లోకి వచ్చేసాడు. అలాగని భారీ హంగామా తో హోటల్ పెట్టలేదు. తనకు ఉన్న వనరులతోనే హోటల్ ఏర్పాటు చేశాడు. అది కూడా కేవలం ఇడ్లీ మాత్రమే అమ్మడం మొదలుపెట్టాడు. కాకపోతే రొటీన్ గా మినప పప్పు, బియ్యం రవ్వతో కాకుండా.. మిల్లెట్ ఇడ్లిని పరిచయం చేశాడు. వైజాగ్ నగరంలో మిల్లెట్ ఇడ్లీ అమ్ముతూ సరికొత్త చరిత్ర సృష్టించాడు. పైగా ఆ ఇడ్లీలను పనస ఆకులలో తయారుచేసి విక్రయించడం మొదలుపెట్టాడు. ఆ వ్యాపారం మొదట్లో అంతగా ఆదరణకు నోచుకోలేదు. ఆ తర్వాత ఆ నోట ఈ నోట పడి ప్రచారం పెరగడంతో సుధీర్ వ్యాపారానికి తిరుగులేకుండా పోయింది. ప్రస్తుతం అతడు ప్రతినెలకు 7.5 లక్షల ఆదాయాన్ని సంపాదిస్తున్నాడు.. ఇందులో మిల్లెట్స్ కొనుగోలు, గ్యాస్, ముగ్గురు సిబ్బంది జీతాలు పోనూ అతడికి నెలకు దాదాపు మూడు లక్షల వరకు మిగులుతున్నాయి.
ప్రతిరోజు ఉదయం 5 గంటలకు అతడి దినచర్య మొదలవుతుంది. మధ్యాహ్నం 12 గంటలకు ముగుస్తుంది. ప్రతిరోజు 25వేల వరకు ఆదాయం వస్తుంది. అయితే ఇతడు తనకు అవసరమైన మిల్లెట్స్ మొత్తాన్ని స్థానికంగా ఉన్న రైతుల దగ్గర నుంచే కొనుగోలు చేస్తాడు. వైజాగ్ దాటిన తర్వాత శ్రీకాకుళం, విజయనగరం జిల్లాల్లో ఉన్న రైతులు ఎక్కువగా మిల్లెట్స్ పండిస్తారు. ఆ గిరిజన రైతుల నుంచి సుధీర్ వీటిని కొనుగోలు చేసి ఇడ్లీ తయారు చేస్తాడు.