Health Drinks: బహుళ జాతి సంస్థలు తయారు చేసే చాక్లెట్ డ్రింక్ మిశ్రమాల బ్రాండ్ లపై కేంద్రం కీలక నిర్ణయం తీసుకుంది. వివిధ వర్గాల నుంచి వస్తున్న ఫిర్యాదులు, ప్రజల విజ్ఞప్తుల నేపథ్యంలో పలు తయారీ కంపెనీల వెబ్ సైట్ లు, ఇతర మాధ్యమాలలో పలు చాక్లెట్ మాల్ట్ డ్రింక్ ఉత్పత్తులపై “హెల్త్ డ్రింక్” అనే పదాన్ని తొలగించాలని కేంద్రం ఆయా సంస్థలకు ఆదేశాలు జారీ చేసింది. ఇటీవల వీటిపై కేంద్రానికి ఫిర్యాదులు రావడం పెరిగిపోయింది.. పైగా చాక్లెట్ మాల్ట్ డ్రింక్ మిశ్రమాలను హెల్త్ డ్రింక్ అని ఎలా పిలుస్తారని కొంతమంది నేరుగా కేంద్ర వాణిజ్య, పరిశ్రమల మంత్రిత్వ శాఖకు లేఖలు రాశారు. దీంతో ఆ శాఖ స్పందించాల్సి వచ్చింది. ఫలితంగా పై విధంగా ఈ కామర్స్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు జారీ చేసింది.
కేంద్రం ఆదేశాలు జారీ చేసిన వాటిల్లో క్యాడ్బరీ కంపెనీకి చెందిన బోర్నా విటా ఉత్పత్తి కూడా ఉంది. నేషనల్ కమిషన్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్ (NCPCR), బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ (CPCR) చట్టం 2005 సెక్షన్ (3), సీఆర్పీసీ చట్టం 2005 లోని సెక్షన్ -14 కింద ఎంక్వయిరీ జరిగిన తర్వాత బోర్న్ విటాలో చక్కెర స్థాయిలు అధికంగా ఉన్నాయని తేలింది. ఇది ఆమోదించిన పరిమితి కంటే ఎక్కువగా ఉందని NCPCR చేసిన పరిశోధనలో తేలింది. ఇది పిల్లల ఆరోగ్యానికి సంబంధించింది కావడంతో.. కేంద్రం ఈ కీలక ఉత్తర్వులు తెరపైకి తీసుకువచ్చింది.. షుగర్ స్థాయి ఎక్కువగా ఉంటే అది పిల్లల ఆరోగ్యం పై ప్రభావం చూపిస్తుందని.. అందువల్లే కంపెనీలకు ఆ స్థాయిలో ఆదేశాలు ఇవ్వాల్సి వచ్చిందని కేంద్రం ప్రకటించింది.
వాటిపై కూడా..
కేవలం చాక్లెట్ మాల్ట్ డ్రింక్ మిశ్రమాలు మాత్రమే కాకుండా.. నిబంధనలు పాటించడంలో, భద్రత ప్రమాణాలు అమలు చేయడంలో విఫలమైన పవర్ సప్లిమెంట్లను సైతం హెల్త్ డ్రింక్ గా విక్రయాలు జరుపుతున్న కంపెనీలపై చర్యలు తీసుకోవాలని NCPCR భారత ఆహార భద్రత ప్రమాణాల అథారిటీ FSSAI ని ఆదేశించింది. అంతేకాదు దేశంలోని ఆహార చట్టాలను అనుసరించి ఇకపై హెల్త్ డ్రింక్ అనే పేరును కంపెనీలు వాడకూడదు. హెల్త్ డ్రింక్ పేరుతో అమ్మకాలు సాగించకూడదు. ఒకవేళ అలా చేస్తే కంపెనీలపై కేంద్రం చర్యలు తీసుకుంటుంది. డెయిరీ, మాల్ట్ ఆధారిత ఉత్పత్తుల ఆధారంగా తయారుచేసిన పానీయాలను హెల్త్ డ్రింక్స్ గా పేర్కొనడం.. వాటిపై లేబుల్స్ ఏర్పాటు చేయడాన్ని కేంద్రం తప్పు పట్టింది. అలాంటి వాటిని విక్రయించకూడదని కంపెనీలకు ఆదేశాలు జారీ చేసింది. ఒకవేళ నిబంధనలు అతిక్రమిస్తే కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని హెచ్చరించింది. ఇక గతంలోనూ కేంద్రం మ్యాగీ సంస్థ తయారు చేసే నూడిల్స్ విషయంలోనూ ఇలానే వ్యవహరించింది. ఆ తర్వాత ఆ కంపెనీ తన తీరు మార్చుకోవడం.. ఉత్పత్తుల్లో ప్రమాదకరమైన అవశేషాలను తొలగించడంతో.. అమ్మకాలను తిరిగి ప్రారంభించింది. ఇప్పుడు బోర్నా విటా కూడా కేంద్ర నిబంధనలకు అనుగుణంగా తన ఉత్పత్తులను తయారు చేయాల్సిన అవసరం ఉందని మార్కెట్ రంగ నిపుణులు పేర్కొంటున్నారు.