Car Sales : కారు కొనాలని ఉందా? ఎలాంటి కారు కొంటారు? దాని డిజైన్ చూస్తారా? మైలేజ్ చూస్తారా? మనం కార్లు కొనే పద్ధతికి, అమెరికాలో వాళ్ళు కార్లు కొనే పద్ధతికి చాలా తేడా ఉంటుంది. ఇది ఎందుకు? మన ప్రాధాన్యతలు వేరుగా ఎందుకుంటాయి? ఎందుకో తెలుసుకుందాం. అమెరికాలో కారు కొనడం అంటే, అది చాలా కాలం తమతో ఉండే ఫ్రెండ్‌ను కొన్నట్లే చూస్తారు. అంటే ఒక కారు కొంటే దాన్ని చాలా ఏళ్లు వాడుకుంటారు. అందుకే అక్కడ కారు కొనేటప్పుడు ఈ మూడు విషయాలకు ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తారు..
అస్సలు రిపేర్లు రాకూడదు: తరచుగా మెకానిక్ షాపుకి వెళ్లాల్సిన అవసరం వస్తుందా లేదా అని చూస్తారు.
అమ్మితే డబ్బులు రావాలి: మళ్ళీ ఆ కారును అమ్మేటప్పుడు మంచి ధర వస్తుందా లేదా అని చూస్తారు. దీన్నే రీసేల్ విలువ అంటారు.
ఖర్చు తక్కువ ఉండాలి: సర్వీసింగ్‌కు, రిపేర్లకు ఎక్కువ డబ్బు ఖర్చు కాకూడదు అనుకుంటారు.
Also Read: ఆ ‘గేమ్ చేంజర్’ గోల ఇక వదిలేయండ్రా బాబు.. టార్చర్ చేయొద్దు – దిల్ రాజు
అందుకే అమెరికాలో ఎక్కువగా హోండా, టయోటా, మజ్దా లాంటి బ్రాండ్‌ల కార్లు కొనమని సలహా ఇస్తారంట. ఎందుకంటే, అవి చాలా ఏళ్లు పాడవకుండా ఉంటాయి. ఖర్చు తక్కువ, మళ్ళీ అమ్మినా మంచి ధర వస్తుంది. ఇండియాలో కారు కొనేటప్పుడు ఆలోచనలు వేరే ఉంటాయి. ఇక్కడ చాలామంది ఎక్కువ కాలం కారు పాడవకుండా ఉండటం కంటే ఈ విషయాలకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు.
బడ్జెట్‌లో దొరకాలి: మన జేబుకు సరిపోయే ధరలో ఉందా అని చూస్తాం.
కొత్త ఫీచర్లు ఉండాలి: టచ్‌స్క్రీన్, సన్‌రూఫ్, లేటెస్ట్ టెక్నాలజీ లాంటివి ఉన్నాయా అని చూస్తాం.
కారు స్టైలిష్‌గా ఉండాలి: చూడటానికి ఎంత అందంగా, స్టైలిష్‌గా ఉంటే అంత మంచిది అనుకుంటాం.
ఇండియాలో చాలామంది కార్లను తక్కువ కాలంలోనే అమ్మేస్తుంటారు. అందుకే కారు మళ్ళీ అమ్మితే ఎంత ధర వస్తుంది అనేది, దాని బ్రాండ్, ఎంత మైలేజ్ ఇస్తుంది, సర్వీస్ సెంటర్లు దగ్గర్లో ఉన్నాయా అనే వాటిపై ఆధారపడి ఉంటుంది. హ్యుందాయ్, కియా లాంటి బ్రాండ్‌లకు ఇప్పుడు మన దేశంలో మంచి సర్వీస్ సెంటర్లు ఉన్నాయి. అమెరికాలో వోక్స్‌వ్యాగన్ కార్లకు రిపేర్లు ఎక్కువ ఖర్చు అని పేరు. కానీ ఇండియాలో సర్వీస్ ఖర్చులు తక్కువగా ఉండటం, మన ప్రజల అంచనాలు వేరుగా ఉండటం వల్ల వోక్స్‌వ్యాగన్ కార్లు ఇక్కడ బాగానే అమ్ముడవుతాయి. అమెరికాలో కొన్ని కొరియన్ కార్లు (హ్యుందాయ్, కియా) దొంగతనానికి గురయ్యే అవకాశం ఎక్కువని ఒక రూమర్ ఉంది. కానీ ఇండియాలో దొంగతనం జరిగే విధానాలు వేరుగా ఉంటాయి కాబట్టి, మనకి ఆ విషయం పెద్దగా పట్టదు. మొత్తంగా చెప్పాలంటే, ఆర్థిక పరిస్థితులు, రోడ్ల పరిస్థితి, ట్రాఫిక్ – ఇవన్నీ మనం ఎలాంటి కారు కొనాలో నిర్ణయిస్తాయి. ఒక దేశంలో బెస్ట్ అనుకున్న కారు, ఇంకో దేశంలో అంత బాగా అమ్ముడవకపోవచ్చు.