Byjus: కీలెరిగి వాత పెట్టాలి. ఆకలి తెలిసి భోజనం వడ్డించాలి. అంతే తప్ప రోగం లేకుండా వాత పెడితే చర్మం బొబ్బలెక్కుతుంది. ఆకలి లేకున్నా తింటే ఆయాసం వస్తుంది. ప్రఖ్యాత ఎడ్ టెక్ కంపెనీ బైజూస్ కూడా ఇలాంటి పరిస్థితినే ఎదుర్కొంటోంది. కోవిడ్ సమయంలో అద్భుతమైన రాబడితో తిరుగులేని కంపెనీగా ఎదిగిన బై జూస్.. కోవిడ్ తర్వాత ఒకసారిగా పతనం దిశగా సాగుతోంది. అప్పటిదాకా దేశవ్యాప్తంగా నడిచిన సంస్థల్ని ఒక్కొక్కటిగా మూసుకుంటూ వస్తోంది. డిమాండ్ లేకపోవడంతో ఆన్ లైన్ క్లాసులు చెప్పే అవకాశం తగ్గిపోయింది. ఫలితంగా చాలా మంది ఉద్యోగులను ఇంటికి పంపించింది. అయినప్పటికీ ఆ సంస్థ కష్టాలు తీరలేదు. ప్రస్తుతం ఫిబ్రవరి నెల వేతనాలు చెల్లించలేమని ఆ సంస్థ సీఈవో రవీంద్రన్ ఉద్యోగులతో పేర్కొనడం కార్పొరేట్ వర్గాల్లో విస్మయాన్ని కలిగిస్తోంది. ఇదే సమయంలో పొంగిన పాలు పొయ్యి పాలే అనే సామెత గుర్తుకు వస్తోంది.
వాస్తవానికి ఆర్థిక క్రమశిక్షణ ఉండి ఉంటే బై జూస్ కు ఇన్ని కష్టాలు ఉండేవి కావు. కానీ ఆ సంస్థ వాపును బలుపు అనుకుంది. కోవిడ్ సమయంలో వచ్చిన గిరాకీ ఎల్లకాలం ఉంటుందని భావించింది. కానీ మనదేశంలో ఎడ్యుకేషన్ మాఫియా ఎలా ఉంటుందో.. ఒక ఎడ్ టెక్ కంపెనీని ఎలా తినేస్తుందో బై జూస్ సీఈవో రవీంద్రన్ కు అర్థమయ్యేలోపే జరగాల్సిన నష్టం జరిగిపోయింది.బై జూస్ టీమిండియా క్రికెట్ జట్టుకు స్పాన్సర్ గా వ్యవహరించింది. అడ్డగోలుగా డబ్బు ఖర్చు చేసింది. ప్రఖ్యాత. ఫుట్ బాల్ క్రీడాకారుడితో ఒప్పందం కుదుర్చుకుంది. ఇష్టానుసారంగా డబ్బు వెదజల్లింది. ఆ తర్వాత కోవిడ్ ప్రబలడంతో బై జూస్ రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. అయితే ఇది ఎల్లకాలం ఉంటుందని రవీంద్రన్ భావించాడు. కానీ అక్కడే అతడు పప్పులో కాలేశాడు.
కోవిడ్ సమయంలో మన దేశంలో ఉన్న ఎడ్యుకేషన్ మాఫియాకు డబ్బులు అందలేదు. ఫలితంగా అది గిలగిలా కొట్టుకుంది.. దీంతో కిందా మీదా పడి ఆయా రాష్ట్రాల ప్రభుత్వాలను ఒప్పించి పాఠశాలలు, కళాశాలలు తెరుచుకునేలా చేసింది. ఆన్ లైన్ లో ఉపాధ్యాయులతో పాఠాలు బోధించడం మొదలుపెట్టింది. ఫలితంగా బై జూస్ కు గిరాకి తగ్గింది. ఈ లోగానే రవీంద్రన్ అవకతవకలకు పాల్పడ్డాడని ఎన్ ఫోర్స్ మెంట్ డైరెక్టరేట్ సంచలన అభియోగాలు మోపింది. అతడి ఆస్తులు సీజ్ చేసింది..లుక్ ఔట్ నోటీస్ జారీ చేసింది. బై జూస్ ఖాతాలు కూడా స్తంభింపజేసింది. చదువుతుంటే మేటాస్ సంస్థ గుర్తుకొస్తోంది కదూ.. అలాంటి వ్యవహారం ఉందనే కేంద్ర దర్యాప్తు సంస్థ అనుమానం వ్యక్తం చేస్తున్నది. మునుముందు ఏం జరుగుతుందో తెలియదు గానీ ప్రస్తుతానికైతే బై జూస్ ను కేంద్ర దర్యాప్తు సంస్థ అష్టదిగ్బంధనం చేసింది. దీనివల్లే వేతనాలు ఇవ్వడం కుదరడం లేదని ఆ సంస్థలో పనిచేస్తే 20,000 మంది ఉద్యోగులకు బై జూస్ అధినేత రవీంద్రన్ సోషల్ మీడియాలో పేర్కొన్నాడు. మార్చి 10 లోగా వేతనాలు ఇస్తామని చెప్పాడు. మరి ఈ లోగా ఈ సమస్య పరిష్కారం అవుతుందా? లేక సంస్థమూతపడుతుందా? అనే ప్రశ్నలు ఉద్యోగులను ఇబ్బంది పెడుతున్నాయి. మరి దీనికి కేంద్ర దర్యాప్తు సంస్థ ఎలాంటి సమాధానం చెబుతుందో చూడాల్సి ఉంది.
Swathi Chilukuri is a Journalist Contributes Film & Lifestyle News. She has rich experience in picking up the latest trends in Life style category and has good analytical power in explaining the topics on latest issues.
Read More