BMW C 400 GT: భారతీయ ఆటోమొబైల్ పరిశ్రమలో అసాధారణమైన విషయం చోటు చేసుకుంది. సాధారణంగా కార్ల కంటే తక్కువ ధరలో లభించే స్కూటర్ ఏకంగా అత్యంత ప్రజాదరణ పొందిన కార్లైన టాటా నెక్సాన్, మారుతి బ్రెజా కంటే ఎక్కువ ధరతో మార్కెట్‌లోకి ఎంట్రీ ఇచ్చింది. ఈ స్కూటర్ ఒక విలాసవంతమైన బ్రాండ్‌కు చెందినది కావడం, దాని ఇంజన్ కెపాసిటీ నుంచి హై స్పీడ్ వరకు అన్నీ అత్యున్నత ప్రమాణాల్లో ఉండడమే దీనికి కారణం. ఇంతకీ ఆ స్పెషల్ స్కూటర్ ఏది? దాని అసాధారణమైన ఫీచర్లు ఏమిటో వివరంగా తెలుసుకుందాం.
Also Read: 250 కిమీ రేంజ్‌తో టాటా నానో ఈవీ.. ధర ఎంతంటే ?
ఈ ఖరీదైన స్కూటర్ మరేదో కాదు. ప్రపంచ ప్రఖ్యాత లగ్జరీ కార్ల తయారీ సంస్థ BMW రూపొందించిన BMW C 400 GT. ఈ స్కూటర్ భారతదేశంలో ఎక్స్-షోరూమ్ ధర అక్షరాలా రూ. 11.50 లక్షలు. ఇది మారుతి బ్రెజా ప్రారంభ ధర రూ. 8.69 లక్షలు, టాటా నెక్సాన్ ప్రారంభ ధర రూ. 8.99 లక్షల కంటే చాలా ఎక్కువ. ఇంత అధిక ధర పలకడానికి గల కారణాలను పరిశీలిస్తే.. ఈ స్కూటర్ ఇంజన్, ఇతర టెక్నికల్ ఫీచర్లు చాలా ప్రత్యేకమైనవి.
BMW C 400 GT స్కూటర్‌లో పవర్ ఫుల్ 350cc సింగిల్-సిలిండర్ ఇంజన్‌ను అమర్చారు. ఈ ఇంజన్ గరిష్టంగా 34 హార్స్‌పవర్‌ను, 35 Nm పీక్ టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. కంపెనీ పేర్కొన్న ప్రకారం.. ఈ స్కూటర్ లీటరుకు 28.57 కిలోమీటర్ల మైలేజీని అందిస్తుంది. అంతేకాకుండా, కేవలం 3.5 సెకన్లలోనే 0 నుండి 100 కిలోమీటర్ల వేగాన్ని అందుకోగలదు. ఈ స్కూటర్‌ను ప్రత్యేకంగా సిటీ ప్రయాణాల సౌలభ్యం కోసం రూపొందించారు. అయితే సుదూర ప్రయాణాలను దృష్టిలో ఉంచుకుని 12 లీటర్ల పెట్రోల్ ట్యాంక్‌ను అందించారు.
ఇక ఫీచర్ల విషయానికి వస్తే BMW C 400 GT బ్లూటూత్ కనెక్టివిటీ, లగ్జరీ విండ్‌స్క్రీన్, పెద్ద TFT ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్ స్క్రీన్, గంటకు 129 కిలోమీటర్ల గరిష్ట వేగంతో వస్తుంది. ఇది యూరో 5+ ఉద్గార ప్రమాణాలకు అనుగుణంగా తయారు చేశారు. అంతేకాకుండా, ఈ స్కూటర్‌లో ఒక ప్రత్యేకమైన సేఫ్టీ ఫీచర్ దాని బూట్‌స్పేస్‌లో ఉంది. హెల్మెట్‌ను బూట్‌స్పేస్‌లో ఉంచగానే ఒక ప్రత్యేకమైన ఫ్లాప్ ఆటోమేటిక్ గా కిందకు వెళుతుంది. ఆ తర్వాత హెల్మెట్‌ను తీసి, ఆ ఫ్లాప్‌ను తిరిగి పైకి లేపితేనే స్కూటర్ ఇంజన్ స్టార్ట్ అవుతుంది. ఈ వినూత్నమైన సేఫ్టీ ఫీచర్ ప్రమాదాలను నివారించడంలో సహాయపడుతుంది. ఈ ప్రత్యేకమైన ఫీచర్లు, BMW లగ్జరీ బ్రాండ్ విలువ కారణంగానే ఈ స్కూటర్ కార్ల కంటే ఎక్కువ ధర పలుకుతోంది.