Bitcoin Hits $100000: ప్రపంచంలోనే అత్యంత పురాతనమైన, అతిపెద్ద, అత్యంత ప్రజాదరణ పొందిన క్రిప్టోకరెన్సీ అయిన బిట్‌కాయిన్ ధర 100,000 డాలర్లను దాటింది. బిట్‌కాయిన్ తొలిసారి ఈ స్థాయికి చేరుకుంది. అమెరికాలో డోనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడిగా విజయం సాధించిన తర్వాత, దాని ధర నిరంతరం పెరుగుతోంది. ట్రంప్ ప్రభుత్వం క్రిప్టో అనుకూల విధానాలను రూపొందిస్తుందని పెట్టుబడిదారులు భావిస్తున్నారు. దీని కారణంగా బిట్‌కాయిన్‌లో రికార్డు పెరుగుదల కనిపించింది. దాంతో పాటు అన్ని క్రిప్టోకరెన్సీల ధరలు పెరగడానికి ఇదే కారణం. ఈ ఏడాది బిట్‌కాయిన్ ధర 100 శాతం పెరిగింది. ట్రంప్ ఎన్నికల విజయం తర్వాత నాలుగు వారాల్లో దీని ధర 45శాతం పెరిగింది. దీంతో బిట్‌కాయిన్ మార్కెట్ క్యాప్ తొలిసారిగా 2 లక్షల కోట్ల డాలర్లు దాటింది.
ప్రారంభ ట్రేడింగ్‌లో బిట్‌కాయిన్ 2 శాతం కంటే ఎక్కువ పెరిగి ఆల్ టైమ్ హై 100,277డాలర్లకి చేరుకుంది. అమెరికా సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమీషన్ ప్రెసిడెంట్ గ్యారీ జెన్స్లర్ నిష్క్రమణ తర్వాత క్రిప్టోకరెన్సీ పెట్టుబడిదారులు ఉపశమనం పొందవచ్చని భావిస్తున్నారు. సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ కమిషన్‌కు నాయకత్వం వహించడానికి పాల్ అట్కిన్స్‌ను నామినేట్ చేస్తున్నట్లు ట్రంప్ ప్రకటించారు. టోకెన్ అలయన్స్ కో-చైర్‌గా క్రిప్టోకరెన్సీ పాలసీలో అట్కిన్స్‌కు అనుభవం ఉంది. అట్కిన్స్ ప్రస్తుతం పటోమాక్ పార్టనర్స్ సీఈవో. నిబంధనల పట్ల ఆయన ఆచరణాత్మక విధానాన్ని ట్రంప్ ప్రశంసించారు.
ధర ఎంత వరకు వెళ్తుంది?
ట్రంప్ తన ఎన్నికల ప్రచారంలో డిజిటల్ ఆస్తులకు మద్దతు పలికారు. అమెరికాను క్రిప్టో రాజధానిగా స్థాపించడం, జాతీయ బిట్‌కాయిన్ రిజర్వ్‌ను సృష్టించడం గురించి మాట్లాడారు. హాంకాంగ్‌లోని స్వతంత్ర క్రిప్టోకరెన్సీ విశ్లేషకుడు జస్టిన్ డి’అనేతన్ మాట్లాడుతూ.. బిట్‌కాయిన్ 100,000డాలర్లను దాటడం కేవలం ఒక మైలురాయి కాదు. ఇది ఫైనాన్స్, టెక్ , జియోపాలిటిక్స్‌లో మార్పుకు నిదర్శనం. కొంతకాలం క్రితం ఫాంటసీగా కొట్టిపారేసినది నేటి వాస్తవం. దీనితో పాటు, క్రిప్టోకరెన్సీ రంగం రెండేళ్ల క్రితం FTX క్రిప్టో ఎక్స్ఛేంజ్ మూసివేయబడినప్పుడు పెద్ద సంక్షోభాన్ని ఎదుర్కొంది. కంపెనీ వ్యవస్థాపకుడు సామ్ బ్యాంక్‌మన్-ఫ్రైడ్ జైలుకు వెళ్లవలసి వచ్చింది. డిసెంబర్ 25 నాటికి బిట్‌కాయిన్ ధర 120,000 డాలర్లకు చేరుకుంటుందని డిజిటల్ అసెట్ ఇన్వెస్ట్‌మెంట్ సంస్థ కానరీ క్యాపిటల్ వ్యవస్థాపకుడు స్టీవెన్ మెక్‌క్లర్గ్ తెలిపారు.
బిట్‌కాయిన్ తొలిసారి లక్ష డాలర్లను దాటింది
గురువారం, డిసెంబర్ 5, 2024న, బిట్‌కాయిన్ 102,727డాలర్ల వద్ద ట్రేడవుతోంది. నవంబర్ 5, 2024న అమెరికా అధ్యక్ష ఎన్నికల ఫలితాలు ప్రకటించినప్పటి నుండి బిట్‌కాయిన్ పెరుగుతూనే ఉంది. ఎన్నికల ప్రచారంలో ట్రంప్ అమెరికాను ప్రపంచంలోని బిట్‌కాయిన్, క్రిప్టోకరెన్సీ రాజధానిగా చేస్తామని హామీ ఇచ్చారు.