Homeబిజినెస్Adani Stocks Fall: హిండెన్ బర్గ్ నివేదిక మరవకముందే.. అదాని గ్రూపులో భారీ కుదుపు..

Adani Stocks Fall: హిండెన్ బర్గ్ నివేదిక మరవకముందే.. అదాని గ్రూపులో భారీ కుదుపు..

Adani Stocks Fall: హిండెన్ బర్గ్ నివేదిక మరవకముందే అదాని గ్రూపులో భారీ కుదుపు చోటుచేసుకుంది. అదాని గ్రూపు విస్తరణ పై మరోసారి తీవ్ర ఆరోపణలు వ్యక్తం అయ్యాయి. ఈసారి “ఆర్గనైజ్డ్ క్రైమ్ అండ్ కరప్షన్ రిపోర్టింగ్ ప్రాజెక్ట్”(ఓసిసిఆర్పి) అనే అంతర్జాతీయ ఇన్వెస్టిగేటివ్ జర్నలిస్టుల నెట్వర్క్ అదానీ కంపెనీల లావాదేవీలపై ప్రశ్నలు సంధించింది. డొల్ల కంపెనీలకు, పన్నులు వసూలు చేయని దేశంగా ప్రసిద్ధి పొందిన మారిషస్ లోని.. కొన్ని డొల్ల కంపెనీల ద్వారా వందల కోట్ల డాలర్లను భారత్ లోని అదానీ గ్రూప్ సంస్థలకు అక్రమంగా తరలించారని, తద్వారా తమ గ్రూపు ఆస్తుల విలువను అనూహ్యంగా పెంచుకున్నారని అదానీ కుటుంబంపై ఓ సి సి ఆర్ పి ఆరోపణలు గుప్పించింది. 2013 నుంచి 2018 వరకూ తమ గ్రూప్ కంపెనీల షేర్ల ధరలను విపరీతంగా పెంచుకునేందుకు ఈ మార్గాన్ని అనుసరించారని ప్రకటించింది. ఈ మేరకు తమ వద్ద ఆధారాలు ఉన్నాయని పేర్కొంటూ గురువారం ఒక నివేదికను విడుదల చేసింది. ఈ ఆరోపణలను అదాని గ్రూప్ ఖండించింది. తమను అప్రతిష్ట పాలు చేయడం కోసమే పాత ఆరోపణలను మళ్లీ చేస్తున్నారని ప్రకటించింది. అయితే, ఓ సి సి ఆర్ పి నివేదిక నేపథ్యంలో అదాని గ్రూప్ సంస్థల షేర్ల ధరలు పడిపోయాయి.

75% కు మించరాదు

సెక్యూరిటీ ఎక్స్చేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా ( సెబీ) నిబంధనల ప్రకారం ఒక కంపెనీ ప్రమోటర్లు ఆ కంపెనీలో 75% వాటాలను మాత్రమే కలిగి ఉండాలి. మిగతా 25% వాటాలను బహిరంగంగా షేర్ మార్కెట్లో అందుబాటులో ఉంచాలి. కానీ, అదానీ కుటుంబం ఈ నిబంధనను ఉల్లంఘించి తమకు చెందిన వ్యక్తుల ద్వారా తమ కంపెనీల్లో 75 శాతానికి మించి వాటాలను కొనుగోలు చేసిందని, దీని ద్వారా షేర్ మార్కెట్లో తమ కంపెనీ షేర్ల కృత్రిమ కొరతను సృష్టించి, డిమాండ్ ను పెంచి, వాటి ధరలను పెంచేసిందని ఓ సి సి ఆర్ పి ఆరోపిస్తోంది. ఈ అక్రమ లావాదేవీలు ఎలా జరిగాయి అనే దానిపై కూడా తన నివేదికలో వెల్లడించింది. అదా నీ గ్రూప్ చైర్మన్ గౌతమ్ అదానీ తన అన్న వినోద్.. వినోద్ అదానీకి సన్నిహితులైన ఇద్దరు వ్యక్తులు ఈ అక్రమ లావాదేవీలలో కీలక పాత్ర పోషించాలని ఓ సి సి ఆర్ పి ఆరోపిస్తోంది. వినోద్ కు సన్నిహితులైన వారిలో ఒకరు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ కు చెందిన నాజర్ అలీ షాబాన్ అహ్లీ కాగా, మరొకరు తైవాన్ కు చెందిన చాంగ్ చుంగ్ లింగ్. 2010 నాటి కొన్ని పత్రాల ప్రకారం, అదానీ కంపెనీలకు డైరెక్టర్ లు గా కొనసాగుతున్న నాజర్ అలీ, చాంగ్ చుంగ్.. మారిషస్, బ్రిటిష్ వర్జిన్ ఐలాండ్స్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ లో డొల్ల కంపెనీలను నెలకొల్పారు. వీరు ఏర్పాటు చేసిన నాలుగు డొల్ల కంపెనీల ద్వారా బెర్ముడాలోని గ్లోబల్ అపార్చునిటీస్ ఫండ్( జీవో ఎఫ్) లోకి వందల కోట్ల డాలర్లు ప్రవహించాయి. సదరు ఫండ్ నుంచి భారత్ లోని అదాని కంపెనీల్లోకి నిధులు మళ్ళాయి. ఇదంతా 2013 నుంచి మొదలైంది. జీవో ఎఫ్ నుంచి దాని అనుబంధ సంస్థలయిన ఎమర్జింగ్ ఇండియా ఫోకస్ ఫండ్స్, ఈ ఎం రిసార్జంట్ ఫండ్ లకు కూడా నిధులు భారీ ఎత్తున తరలి వెళ్లాయి. ఈ రెండు సంస్థలు తిరిగి అదానీ ఎంటర్ప్రైజెస్, పోర్ట్స్ అండ్ స్పెషల్ ఎకనామిక్ జోన్, ట్రాన్స్మిషన్ కంపెనీల షేర్లను భారీగా కొనుగోలు చేశాయి.

అమాంతం పెరిగాయి

నాజర్, చాంగ్ కొనుగోళ్ల ఫలితంగా అదానీ షేర్ల ధరలు 2013 నుంచి 2018 మధ్యకాలంలో అనూహ్యంగా పెరిగిపోయాయి. ఫలితంగా భారతదేశంలోని అత్యంత సంపన్న, అతి పెద్ద వ్యాపార సంస్థగా అదాని గ్రూప్ ఎదిగింది. నాజర్, చాంగ్ లకు అదా నీ కుటుంబం నుంచే డబ్బులు వెళ్ళాయా అన్నది స్పష్టంగా తేలకపోయినప్పటికీ, అదాని కంపెనీ షేర్ల వ్యాపారం అదాని కుటుంబం సమన్వయంతోనే జరిగినట్టు తెలుస్తోందని ఓసీసీ ఆర్ పీ వివరించింది. ఈ విధంగా అదాని కంపెనీల షేర్ల ధరలు విపరీతంగా పెరిగిపోవడం వల్ల అదానీ గ్రూప్ సంపద అనూహ్యంగా పెరిగింది. 2013లో 800 కోట్ల డాలర్లు ఉన్న సంపద గత ఏడాదికి 26 వేల కోట్ల డాలర్లకు చేరుకోవడమే దీనికి నిదర్శనమని ప్రకటించింది. మారిషస్ లోని రెండు ఫండింగ్ ఏజెన్సీలను వినోద్ అదానికి చెందిన ఒక ఉద్యోగి ఓ దుబాయ్ కంపెనీ ద్వారా పర్యవేక్షించే వాళ్ళని ఓ సి సి ఆర్ పి పేర్కొన్నది.

Rakesh R
Rakesh Rhttps://oktelugu.com/
Rocky is a Senior Content writer who has very good knowledge on Bussiness News and Telugu politics. He is a senior journalist with good command on writing articles with good narative.
RELATED ARTICLES

Most Popular