Profits of Banana Leaves: అరటిపండు సంపూర్ణ పౌష్టికాహారం అనే సంగతి తెలిసిందే. అరటి ఆకులో భోజనం చేయడం వల్ల ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు చేకూరుతాయని పెద్దలు చెబుతుంటారు. ఏవైనా శుభ కార్యక్రమాలు జరిగితే గుమ్మాల ముందు అరటి చెట్లను కట్టడం ఆనవాయితీగా వస్తోంది. తెలుగు రాష్ట్రాల ప్రజలతో పోలిస్తే తమిళనాడు రాష్ట్రానికి చెందిన వాళ్లు అరటి ఆకులను హోటళ్లలో, శుభకార్యాల కొరకు ఎక్కువగా వినియోగించడం జరుగుతుంది.
అరటి ఆకులకు ఉన్న డిమాండ్ ను దృష్టిలో పెట్టుకుని కొంతమంది అరటి తోటల పెంపకంపై దృష్టి పెట్టడం గమనార్హం. ప్రకాశం జిల్లాకు చెందిన రైతు ఒకరు అరటి సాగును చేపట్టి 15 సంవత్సరాల నుంచి మంచి లాభాలను సొంతం చేసుకుంటున్నారు. కేవలం అరటి ఆకుల కోసమే ఈ రైతు తోటను సాగు చేస్తున్నారు. రైతు లింగారెడ్డి అరటి ఆకుల ద్వారా కూడా మంచి ఆదాయాన్ని సొంతం చేసుకోవడం సాధ్యమేనని చెబుతున్నారు.
తోట నాటిన ఆరు నెలల నుంచి ఆకుల కోత మొదలవుతుందని ఈ తోటలో పెట్టుబడులు ఉండవని రైతు వెల్లడిస్తున్నారు. నెలకు ఒకసారి కాంప్లెక్స్ ఎరువులు వేస్తే సరిపోతుందని 6 నెలల తర్వాత 7 నుంచి 10 రోజులకు ఒకసారి చొప్పున ఆకుల కోత జరుగుతుందని లింగారెడ్డి చెబుతున్నారు. అరటి పళ్లతో ఎంత ఆదాయం పొందగలమో అదే స్థాయిలో ఆదాయాన్ని లింగారెడ్డి ఆకుల ద్వారా సంపాదిస్తున్నారు.
సరైన సమయంలో పిలకలు కత్తిరించినా లేదా ఎరువులను వేయడం ద్వారా ఆకులు బాగా ఎదిగే అవకాశం ఉంటుంది. పెళ్లిళ్ల సీజన్ లో అరటి ఆకులకు విపరీతమైన డిమాండ్ ఉంటుంది. తొలి ఏడాది మాత్రమే పెట్టుబడులు ఉంటాయని సంవత్సరానికి ఎకరాకు లక్షన్నర రూపాయలు నికర ఆదాయం పొందుతున్నానని లింగారెడ్డి వెల్లడిస్తున్నారు.