Asia stock Markets : అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ చేపట్టిన వాణిజ్య యుద్ధం ప్రపంచ ఆర్థిక వ్యవస్థను కుదిపేస్తోంది. ఆయన 90 దేశాలపై విధించిన భారీ ప్రతీకార పన్నులు పెట్టుబడిదారులను భయాందోళనకు గురిచేశాయి. దీంతో సోమవారం(Monday) ప్రపంచవ్యాప్తంగా ప్రధాన స్టాక్ సూచీలు భారీ నష్టాలను చవిచూశాయి. ఈ పరిస్థితిని 1987లోని బ్లాక్ మండేతో పోల్చుతూ నిపుణులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.
Also Read : ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్.. ఇరాన్ కరెన్సీ సంక్షోభం.. చరిత్రలో అత్యల్ప స్థాయికి రియాల్
నష్టాల్లో ఆసియా మార్కెట్లు..
ట్రంప్ విధానాల ప్రభావం ఆసియా మార్కెట్లపై(Asia stock Markets) తీవ్రంగా పడింది. జపాన్, దక్షిణ కొరియా, చైనా, హాంకాంగ్, తైవాన్, భారత్‌లోని ప్రధాన సూచీలు 3 నుంచి 10 శాతం వరకు నష్టపోయాయి. జపాన్ నిక్కీ సూచీ ఒక దశలో 8 శాతం పతనమై, ప్రస్తుతం 6 శాతం నష్టంతో ట్రేడవుతోంది. తైవాన్ సూచీ 9.61 శాతం, చైనా షాంఘై సూచీ 6.5 శాతం, దక్షిణ కొరియా కోస్పి 4.14 శాతం నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఈ పరిణామాలు పెట్టుబడిదారుల్లో ఆందోళనను రేకెత్తిస్తున్నాయి.
1987లో బ్లాక్ మండే..
1987 అక్టోబర్ 19న ప్రపంచం బ్లాక్ మండేను చవిచూసింది. ఆ రోజు అమెరికాలో డోజోన్స్ ఇండస్ట్రియల్(Dozons Industrial) సూచీ 22.6 శాతం కుప్పకూలగా, ఎస్ అండ్ పీ 500 సూచీ 30 శాతం విలువ కోల్పోయింది. ఈ పతనం ఆస్ట్రేలియా, ఆసియా, ఐరోపా మార్కెట్లను నెల రోజుల పాటు కుదిపేసింది. అప్పటి కంప్యూటరైజ్డ్ ట్రేడింగ్, ట్రిపుల్ విచింగ్ వంటి అంశాలు ఈ సంక్షోభానికి కారణమయ్యాయి. అప్పటి నుంచి సర్క్యూట్ బ్రేకర్ల వంటి నివారణ చర్యలు అమల్లోకి వచ్చాయి.
జిమ్ క్రెమెర్ హెచ్చరిక..
అమెరికా మార్కెట్ వ్యాఖ్యాత జిమ్ క్రెమెర్(Gim Kremur)ఈ పరిస్థితిని 1987 బ్లాక్ మండేతో పోల్చారు. ట్రంప్ తక్షణ చర్చల ద్వారా పన్నులను తగ్గించకపోతే, సోమవారం మరో బ్లాక్ మండే తప్పదని హెచ్చరించారు. గత మూడు రోజులుగా నష్టాల్లో ఉన్న మార్కెట్లు మరింత క్షీణిస్తాయని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. నిబంధనలు పాటించే కంపెనీలకు ఉపశమనం కల్పించాలని సూచించారు.
ప్రస్తుత భయాలు..
ఏప్రిల్ 4, 2025న అమెరికా మార్కెట్లు కొవిడ్ తర్వాత అతిపెద్ద పతనాన్ని చవిచూశాయి. 5 ట్రిలియన్ డాలర్ల సంపద ఆవిరైంది. డోజోన్స్ ఫ్యూచర్స్ 3.7 శాతం, ఎస్ అండ్ పీ ఫ్యూచర్స్ 4.3 శాతం నష్టపోయాయి. ఈ నేపథ్యంలో ట్రంప్ వాణిజ్య విధానాలు మరో సంక్షోభానికి దారితీస్తాయా అనే ఆందోళన నెలకొంది.
Also Read : ట్రంప్ ఇమ్మిగ్రేషన్ పాలసీ: హెచ్1బీ వీసాదారుల్లో ఆందోళన, టెక్ దిగ్గజాల హెచ్చరిక