Zomato: ఉరుకులు పరుగులు జీవితంలో ఇంట్లో వంటచేసే ఓపిక తీరిక దొరకడం లేదు. దంపతులు ఇద్దరూ ఉద్యోగాలకు వెళ్తుండడం, ఉమ్మడి కుటుంబాలు తగ్గిపోవడం, పిల్లలు స్కూల్, కాలేజీలో ఉండడంతో వంట ఉదయం మాత్రమే టిఫిన్లు, భోజనాలు చేసుకుంటున్నారు. రాత్రికి బయటి నుంచి ఆర్డర్ చేసుకుంటున్నారు. ఇక ఏ చిన్న ఫంక్షన్ అయినా, పార్టీ అయినా ఫుడ్ ఆర్డర్ చేయడం కామన్ అయింది. దీంతో ఫుడ్ డెలివరీ సంస్థలకు డిమాండ్ పెరిగింది. అర్ధరాత్రి కూడా ఆర్డర్ పెడితే ఇంటికే ఫుడ్ వస్తుండడంతో చాలా మంది డెలివరీ సంస్థలను ఆశ్రయిస్తున్నారు. ఈ క్రమంలో జొమాటో, స్విగ్గీతోపాటు అనేక సంస్థలు డెలివరీ సేవలు అందిస్తున్నాయి. అయితే గడిచిన కొంతకాలంగా జొమాటో ఫుడ్ డెలివరీలో టాప్‌గా నిలుస్తోంది. మరో ఐదు రోజుల్లో ముగియనున్న 2024లో కూడా జొమాటో రికార్డు స్థాయిలో ఫుడ్ డెలివరి చేసి నంబర్‌వన్‌గా నిలిచింది. ఈమేరకు ఆ సంస్థే వార్షిక నివేదిక విడుదల చేసింది. ఇందులో అత్యధికంగా ఆర్డర్ చేసిన ఫుడ్ ఐటమ్స్, డైవింగ్ ట్రెండ్‌ను ప్రస్తావించింది.
బిర్యానీదే అగ్రస్థానం..
జొమాటో 2024లో డెలివరీ చేసిన ఫుడ్‌లో బిర్యానీదే అగ్రస్థానంలో నిలిచింది. ఈ ఏడాది ఇప్పటి వరకు 9 కోట్ల బిర్యానీలు ఆర్డర్లు వచ్చినట్లు కంపెనీ తెలిపింది. అంటే సెకనుకు మూడు బిర్యానీల చొప్పున డెలివరీ చేసినట్లు వార్షిక నివేదికలో తెలిపింది. మరో ఫుడ్ డెలివరీ ప్లాట్‌పామ్ స్విగ్గీలో కూడా బిర్యానీనే టాప్‌గా నిలిచింది. దీనిని బట్టి బిర్యానీకి ఉన్న క్రేజ్ అర్థం చేసుకోవచ్చు. బిర్యానీ తర్వాత ఎక్కువ డెలివరీ చేసిన ఫుడ్ ఐటమ్‌గా ఫిజ్జా నిలిచింది. మొత్తం 5.84 కోట్ల పిజ్జాలను దేశ్యాప్తంగా డెలివరీ చేసినట్లు జొమాటో తెలిపింది. జొమాటో వేదికగా 77 లక్షల కప్పుల టీ, 74 లక్షల కప్పుల కాఫీ కూడా డెలివరీ చేసినట్లు నివేదికలో పేర్కొంది.
ఒక్కడే రూ.లక్షల బిల్లు..
ఇక 2024లో జొమాటో డైనింగ్ సేవలనూ అందిస్తుంది. దీనికి సంబంధించిన డేటాను కూడా వెల్లడించింది. ఫాదర్స్‌డే రోజు అత్యధికంగా టేబుళ్లు బుక్ అయినట్లు తెలిపింది. ఈ ఏడాది మొత్తంగా 1.25 కోట్ల టేబుళ్లు బుక్ అయినట్లు పేర్కొంది. కుటుంబ సమేతంగా ఆనంద క్షణాలను గడిపేందుకు 84,866 మంది రిజర్వేషన్లు బుక్ చేసుకున్నట్లు తెలిపింది. ఇక మరో ఆసక్తికర అంశం ఏమిటంటే బెంగళూరుకు చెందిన ఓవ్యక్తి రెస్టారెంట్‌కు వెళ్లి ఏకంగా రూ.5,13 లక్షల బిల్లు చెల్లించినట్లు జొమాటో తెలిపింది. డైనింగ్ సేవల్లో సింగిల్ బిల్లు ఈ స్థాయిలో చెల్లించడం ఇదే తొలిసారి అని సంస్థ వార్షిక నివేదికలో వెల్లడించింది.