Anil Agarwal: డబ్బు చుట్టూ ప్రపంచం పరిభ్రమిస్తోంది. రాజకీయ పార్టీల నుంచి మొదలు పెడితే సామాన్య జనం వరకు అందరి జీవితాలను డబ్బు ప్రభావితం చేస్తూ ఉంటుంది. అందువల్లే డబ్బు సంపాదన కోసం అందరూ ప్రయత్నిస్తుంటారు. డబ్బున్న వాళ్లు మరింత డబ్బు సంపాదించడానికి తాపత్రయ పడుతుంటారు. డబ్బు లేనివాళ్లు డబ్బు కోసం కష్టపడుతుంటారు.
డబ్బు సంపాదించే క్రమంలో మనుషుల మధ్య మానవ సంబంధాలు కనుమరుగైపోతుంటాయి. డబ్బు వ్యామోహంలో సాటి మనుషులను పట్టించుకోరనే అపవాదులు కూడా ఉన్నాయి. ముఖ్యంగా బాగా డబ్బు సంపాదించిన కార్పొరేట్ వ్యక్తులు మనుషులను పట్టించుకోరని మనం ఏదో ఒక సందర్భంలో చదివే ఉంటాం. కానీ, కార్పొరేట్ వ్యక్తులకు ఏదో ఒక సందర్భంలో మనుషుల గురించి అనుభవంలోకి వస్తుంది. ఇంత డబ్బు సంపాదించి వృధానే కదా అనే భావన వారిలో కలుగుతుంది. ఇప్పుడు ఇలాంటి అనుభవమే వేదంతా సంస్థ అధిపతి అనిల్ అగర్వాల్ కు ఎదురైంది.
గనుల రంగంలో వేల కోట్లు సంపాదించాడు అనిల్ అగర్వాల్. భారతదేశం నుంచి మొదలుపెడితే ప్రపంచంలో అనేక దేశాలలో ఈయన కంపెనీ కార్యకలాపాలు సాగిస్తోంది. అనిల్ అగర్వాల్ కు కుమారుడు అగ్నివేష్ అగర్వాల్ ఉన్నారు. ఈయన గుండెపోటుతో చనిపోయారు. దీంతో అనిల్ అగర్వాల్ ఒక్కసారిగా దిగ్భ్రాంతికి గురయ్యారు. తన జీవితంలో చీకట్లు కమ్ముకున్నాయని ఆయన భావోద్వేగంతో వ్యాఖ్యానించారు. ఎక్స్ లో తన కుమారుడి తో ఉన్న అనుబంధాన్ని నెమరు వేసుకున్నారు. ఈ నేపథ్యంలో తన సంపాదనలో 75 శాతాన్ని సమాజానికి ఇస్తున్నట్టు ప్రకటించారు.
“నా కుమారుడు అగ్నివేష్ కన్నుమూశారు. అతడి వయసు 49 సంవత్సరాలే. అమెరికాలో జరిగిన స్కీయింగ్ ప్రమాదంలో అగ్నివేష్ గాయపడ్డాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతుండగా ఒక్కసారిగా గుండెపోటుకు గురయ్యాడు. దీంతో అతడు మమ్మల్ని వదిలిపెట్టి వెళ్ళిపోయాడు. జీవితంలో ఎంత ఎత్తుకు ఎదిగినప్పటికీ ఒదిగి ఉండేవాడు. స్నేహితుడిలా నా చుట్టూ ఉండేవాడు. మా సంపాదనలో 75% సమాజానికి తిరిగి ఇస్తామని అగ్ని వేష్ కు మాట ఇచ్చామని.. దానిని నిలబెట్టుకుంటామని” అనిల్ అగర్వాల్ ప్రకటించారు. అనిల్ అగర్వాల్ కు కుమారుడు అగ్నితో పాటు కుమార్తె ప్రియ కూడా ఉన్నారు. ప్రియ వేదాంత లిమిటెడ్ బోర్డులో సభ్యురాలిగా ఉన్నారు. హిందుస్థాన్ జింక్ లిమిటెడ్ కు చైర్పర్సన్ గా కొనసాగుతున్నారు. వేదాంత సంస్థ తలవండి సోబో పవర్ లిమిటెడ్ కంపెనీకి అగ్నివేష్ చైర్మన్గా ఉన్నారు. అనిల్ అగర్వాల్ నికర సంపద ప్రస్తుతం 330 కోట్ల డాలర్లుగా ఉంది.