Air Cooled Vs Liquid Cooled Engine Bikes: కొత్తగా బైక్ కోనే వారు ధర, డిజైన్, మైలేజ్ వంటి వాటిని మాత్రమే చూస్తారు. వీటి ఇంజిన్ గురించి కొందరు మాత్రమే పరిశీలిస్తారు. అయితే ఇంజిన్ గురించి తెలుసుకునే సమయంలో ఎయిర్ కూల్డ్ (Air-Cooled) ఇంజిన్, లిక్విడ్ కూల్డ్ ఇంజిన్ (Liquid-Cooled) అనే విషయాలను తెలుసుకోవాలి. మార్కెట్లో ఉన్న బైకుల్లో ‘లిక్విడ్ కూల్డ్’ తో పాటు ‘ఎయిర్ కూల్డ్’ ఇంజిన్లు ఉన్నాయి. అయితే వీటి మధ్య ఉన్న తేడాలేంటి? ఏది కొంటే బెటర్?
ఎయిర్ కూల్డ్ ఇంజిన్:
ఎయిర్ కూల్డ్ ఇంజిన్లు చాలా కాలంగా వాడుకలో ఉన్నాయి. వీటి పనితీరు చాలా సరళంగా ఉంటుంది. బైక్ నడుస్తున్నప్పుడు బయట గాలి ఇంజిన్ పైన ఉండే ‘ఫిన్స్’ గుండా ప్రవహించి, ఇంజిన్ వేడిని తగ్గిస్తుంది. ఇవి తక్కువ బరువును కలిగి ఉంటాయి. అలాగే వీటి మెయింటెనెన్స్ ఖర్చు కూడా తక్కువ. అయితే, ట్రాఫిక్‌లో బైక్ ఆగి ఉన్నప్పుడు గాలి ప్రసరణ ఉండదు కాబట్టి ఇంజిన్ త్వరగా వేడెక్కే అవకాశం ఉంది. కాబట్టి ఇవి సాధారణ సిటీ ప్రయాణాలకు, తక్కువ సామర్థ్యం గల బైక్‌లకు బాగా సరిపోతాయి.
లిక్విడ్ కూల్డ్ ఇంజిన్:
లిక్విడ్ కూల్డ్ ఇంజిన్లు ఆధునిక సాంకేతికతతో పనిచేస్తాయి. ఇందులో ఇంజిన్ చుట్టూ కూలెంట్ (Coolant) అనే ద్రవం ప్రవహించే పైపులు ఉంటాయి. ఈ కూలెంట్ ఇంజిన్‌లోని వేడిని గ్రహించి, రేడియేటర్ ద్వారా బయటకు పంపుతుంది. ట్రాఫిక్‌లో ఉన్నప్పుడు కూడా ఫ్యాన్ సాయంతో ఇంజిన్ ఉష్ణోగ్రతను ఇది స్థిరంగా ఉంచుతుంది. ఎక్కువ సేపు ప్రయాణించినా లేదా వేగంగా నడిపినా ఇంజిన్ సామర్థ్యం తగ్గదు. అందుకే స్పోర్ట్స్ బైక్‌లు, హై-పెర్ఫార్మెన్స్ ఇంజిన్లలో వీటిని ఉపయోగిస్తారు.
ఏది బెస్ట్?
పనితీరు పరంగా చూస్తే.. లిక్విడ్ కూల్డ్ ఇంజిన్లు ఎయిర్ కూల్డ్ కంటే మెరుగైనవి. ఎయిర్ కూల్డ్ ఇంజిన్లు వేసవిలో లేదా ట్రాఫిక్ జామ్లలో వేడెక్కినప్పుడు ఇంజిన్ పవర్ తగ్గిపోతుంది. కానీ లిక్విడ్ కూలింగ్ సిస్టమ్ ఇంజిన్‌ను ఎప్పుడూ సరైన ఉష్ణోగ్రత వద్ద ఉంచి, అత్యుత్తమ పవర్ అవుట్‌పుట్‌ను అందిస్తుంది. అయితే, లిక్విడ్ కూల్డ్ బైక్‌లలో కూలెంట్ లెవల్స్ చెక్ చేసుకోవడం, రేడియేటర్ నిర్వహణ వంటి అదనపు బాధ్యతలు ఉంటాయి.దీనివల్ల మెయింటెనెన్స్ ఖర్చు కొంత ఎక్కువగా ఉంటుంది. సిటీలో తక్కువ దూరం ప్రయాణించే వారైతే ,తక్కువ నిర్వహణ ఖర్చు కోరుకుంటే ఎయిర్ కూల్డ్ బైక్ సరిపోతుంది.
