
ప్రస్తుతం దేశంలోని రైతులలో ఎక్కువమంది రైతులు ఆహార పంటల కంటే వాణిజ్య పంటల వైపే ఎక్కువగా ఆసక్తి చూపుతున్నారు. వాణిజ్య పంటల ద్వారా తక్కువ సమయంలో ఎక్కువ మొత్తం సంపాదించే అవకాశం ఉంటుంది కాబట్టి రైతులు ఈ పంటలపై ఆసక్తి చూపుతున్నారు. వ్యవసాయ మంత్రిత్వ శాఖ చెబుతున్న వివరాల ప్రకారం ఈ మధ్య కాలంలో ఉద్యాన పంటల ఉత్పత్తి బాగా పెరిగినట్టు తెలుస్తోంది.
ఉద్యాన పంటల ఉత్పత్తి ద్వారా రైతులు నేరుగా ప్రయోజనం పొందుతున్నారని వెల్లడైంది. ప్రస్తుతం దేశంలోని ఎక్కువమంది ఉద్యాన పంటల ద్వారా నేరుగా ప్రయోజనం పొందుతున్నారు. మన దేశంలో ప్రస్తుతం బ్రోకలీ సాగు ఎక్కువగా జరుగుతోంది. బ్రోకలీని సాగు చేయడం ద్వారా ఎక్కువ మొత్తంలో లాభాలను పొందే అవకాశం ఉంటుంది. పల్లెలతో పోలిస్తే పట్టణ ప్రాంతాల్లో బ్రోకలీకి డిమాండ్ అంతకంతకూ పెరుగుతోంది.
క్యాన్సర్, స్ట్రోక్, గుండె జబ్బుల ప్రమాదాన్ని తగ్గించడంలో బ్రోకలీ ఎంతగానో సహాయపడుతుంది. రక్తపోటును సాధారణ స్థితిలో ఉంచడంలో బ్రోకలీ ఉపయోగపడుతుంది. బ్రోకలి శరీరంలో కొలెస్ట్రాల్ స్థాయిలను కూడా తగ్గిస్తుంది. అధిక సేంద్రీయ కంటెంట్ కలిగిన ఇసుక నేలలు బ్రోకలీని పండించడానికి ఉత్తమమైన నేలలు అని చెప్పవచ్చు. నాట్లు వేసే సమయంలో మొక్క నుంచి మొక్కకు 30 సెంటిమీటర్ల వ్యత్యాసం ఉండాలి.
బ్రోకలీకి 10 నుంచి 12 రోజుల వ్యవధిలో నీరు పెట్టాల్సి ఉంటుంది. మొదటి రెండు నీటి తడుల తర్వాత కలుపు తీయాలి. పొలాన్ని శుభ్రంగా ఉంచడం ద్వారా ఎక్కువ మొత్తంలో దిగుబడి పొందే అవకాశం అయితే ఉంటుంది. గత సంవత్సరం బ్రోకలీ పొలంలో వేస్తే ఈ సంవత్సరం నాటకూడదని వ్యవసాయ శాస్త్రవేత్తలు చెబుతున్నారు. పాత పంట అవశేషాలు తెగుళ్లను కలిగి ఉండటంతో పాటు దిగుబడిని ప్రభావితం చేసే అవకాశాలు ఉంటాయి.