GST On Fuel: దేశంలో రోజురోజుకు పెరుగుతున్న పెట్రోల్, డీజిల్ ధరలు సామాన్యులను తెగ టెన్షన్ పెడుతున్నాయి. దేశంలోని చాలామంది పెరుగుతున్న ధరల వల్ల ఎలక్ట్రిక్ వాహనాలపై ఆసక్తి చూపిస్తున్నారు. అయితే రాబోయే రోజుల్లో పెట్రోల్, డీజిల్ జీఎస్టీ పరిధిలోకి వస్తే ధరలు తగ్గే అవకాశాలు ఉన్నాయని తెలుస్తోంది. పెట్రోల్, డీజిల్ ను 28 శాతం గరిష్ట స్లాబులో ఉంచినా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు వచ్చే ఆదాయం తగ్గడంతో పాటు ధరలు కూడా గణనీయంగా తగ్గుతాయి.
ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ నేతృత్వంలో ఉన్న కమిటీ శుక్రవారం రోజున జరిగే జీఎస్టీ కౌన్సిల్ 45వ సమావేశంలో జీఎస్టీ పరిధిలోకి పెట్రోలియం ఉత్పత్తులను తీసుకొనిరావాలనే ప్రతిపాదన పెట్టింది. పెట్రోల్, డీజిల్ ధరలు జీఎస్టీ పరిధిలోకి వస్తే లీటర్ పెట్రోల్ పై 14 నుంచి 16 రూపాయలు, లీటర్ డీజిల్ పై 12 నుంచి 14 రూపాయలు తగ్గే అవకాశాలు ఉన్నాయని సమాచారం. గతంలో ఎస్బీఐ పెట్రోల్, డీజిల్ జీఎస్టీ పరిధిలోకి వస్తే ఆ సమయంలో రూ. 91.17 ఉన్న పెట్రోల్ 75 రూపాయలకు, రూ. 81.94 ఉన్న డీజిల్ 68 రూపాయలకు తగ్గవచ్చని తెలిపింది.
ప్రస్తుతం ఢిల్లీలో లీటర్ పెట్రోల్ ధర 101.19 రూపాయలు ఉండగా డీజిల్ ధర 88.62 రూపాయలుగా ఉంది. పన్ను కారణంగా దేశంలో పెట్రోల్, డీజిల్ ధరలు అంతకంతకూ పెరుగుతున్నాయి. కేంద్ర ప్రభుత్వానికి పెట్రోల్, డీజిల్ ప్రధాన ఆదాయ వనరుగా ఉంది. గడిచిన 6 సంవత్సరాల్లో ఎక్సైజ్ సుంకం సంపాదన ఏకంగా మూడు రెట్లు పెరగడం గమనార్హం. పెట్రోల్, డీజిల్ జీఎస్టీ పరిధిలోకి వస్తే మాత్రం భారీగా ఆదాయం తగ్గుతుంది.
పెట్రోల్, డీజిల్ జీఎస్టీ పరిధిలోకి వస్తే మహారాష్ట్ర రాష్ట్రం ఎక్కువగా నష్టపోయే అవకాశం ఉంది. కొన్ని రాష్ట్రాలకు మాత్రం ఆదాయం పెరుగుతుంది. పెట్రోల్, డీజిల్ లను జీఎస్టీ పరిధిలోకి తెస్తే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఆదాయం ఏకంగా లక్ష కోట్ల రూపాయల వరకు తగ్గే అవకాశాలు అయితే ఉంటాయని సమాచారం.