
వైసీపీ ప్రభుత్వంపై టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అనంతపురం జిల్లా దళిత యువతి స్నేహలత హత్యపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా టీడీపీ అధినేత మాట్లాడుతూ ప్రభుత్వంపై మండిపడ్డారు. ‘సభ్యసమాజం సిగ్గుతో తలదించుకోవాల్సిన ఘటన ఎస్సీ యువతి స్నేహలతది. పోలీసుల నిర్లక్ష్యంతోనే ఈ ఘటన జరిగిందని తల్లి వాపోతోంది. గన్ వచ్చే లోపల జగన్ వస్తాడన్న మాటలు ఎక్కడా? ఆడపిల్లల పాలిట మేనమామగా ఉంటానన్న వ్యక్తి వారిపట్ల కంశుడిలా తయారయ్యారు. జగన్ జీవితమే ఒక ఫేక్. చట్టమే రాని దిశ చట్టానికి పోలీసు స్టేషన్లు పెట్టి వాహనాలు పంపిణీ చేశారు. అదే దిశ పోలీస్ స్టేషన్ కు స్నేహలత తల్లి ఫోన్ చేస్తే స్పందన లేదు. 19నెలల్లో జరిగిన హత్యాచారాలు, ఆడిబిడ్డలపై వేధింపులు గతంలో ఎప్పుడూ జరగలేదు. అనంతపురం జిల్లాలోనే వరుసగా మూడు సంఘటనలు జరిగాయి’ అని గుర్తుచేశారు.