ఆంధ్రలో బిజెపి పరిస్థితి ముందు గొయ్యి వెనక నుయ్యి లాగా తయారయ్యింది. అదే తెలంగాణాలో పరిస్థితి కొంత మెరుగ్గా వుంది. ఉత్తర తెలంగాణాలో మూడు ఎంపి లు గెలిచి సికింద్రాబాద్ తో సహా నాలుగు ఎంపి స్థానాలతో బిజెపి రాష్ట్రాల జాబితాలో చేరింది. అదే ఆంధ్రలో ఎక్కడవేసిన గొంగళి అక్కడలాగానే వుంది పరిస్థితి. అవకాశాలు లేవా అంటే ఉన్నాయనే సమాధానమే వస్తుంది. జగన్ అధికారం లోకి వచ్చిన తర్వాత తెలుగుదేశం కుదేలవటం తో బిజెపి ప్రత్యామ్నాయ పార్టీగా ఎదిగే అవకాశం వచ్చింది. అందుకు తగ్గట్టుగానే పవన్ కళ్యాణ్ జనసేనతో జతగట్టి వ్యూహాత్మకంగా వ్యవహరించింది. అంతవరకు బాగానే వున్నా అక్కడనుంచి ఒక్క అడుగు ముందుకు పడలేదు.
దీనికి పూర్తిగా బిజెపి రాష్ట్ర కమిటీ నే బాధ్యత వహించాల్సి వుంది. ముఖ్యంగా అధ్యక్షుడిగా వున్న కన్నా లక్ష్మీనారాయణ నే నైతిక బాధ్యత వహించాల్సి వుంది. బిజెపి రాష్ట్ర కమిటీ రెండుగా చీలిపోయింది. కొత్తగా వచ్చిన పూర్వ తెలుగుదేశం నాయకులు ఒక గ్రూపుగా పనిచేస్తున్నారు. చంద్రబాబు కి అనుకూలంగా పావులు కదుపుతూ బిజెపి లో చంద్రబాబు గ్రూపుగా ముద్రపడ్డారు. పాత బిజెపి లో ఎక్కువమందికి పూర్వ అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు, పూర్వ మంత్రి కామినేని శ్రీనివాస్ మినహాయించి చంద్రబాబు పై ఎటువంటి సానుభూతి లేదు. అధ్యక్షుడిగా వున్న కన్నా లక్ష్మీనారాయణ పాత బిజెపి వర్గంతో కన్నా కొత్త బిజెపి వర్గంతోనే ఎక్కువ సఖ్యతగా మసులుతున్నాడని చెబుతున్నారు. ముఖ్యంగా రాజధాని విషయం లో పూర్తిగా తెలుగుదేశం వైఖరినే పదేపదే వల్లించటం అది వివాదాస్పదం కావటం పాత బిజెపి వర్గానికి మింగుడుపడటం లేదు. ఇటీవలి కాలంలో బిజెపి కేంద్ర నాయకత్వానికి కూడా కన్నా వైఖరి తలనొప్పిగా మారిందని తెలుస్తుంది.
ఇటీవలి రాజ్యసభ ఎన్నికల్లో వై ఎస్ ఆర్ పి సభ్యులు నలుగురు ఎన్నికవటం తో కేంద్ర ప్రభుత్వానికి రాజ్యసభ లో ఆరుగురు సభ్యులున్న ఈ పార్టీతో సత్సంబంధాలు నెరపటం అవసరం. ఆ సమయం లో రాష్ట్ర అధ్యక్షుడు కొత్త తలనొప్పులు తెచ్చిపెట్టటం కేంద్ర నాయకులకు నచ్చటం లేదు. అదీగాక బిజెపికి జెపి నడ్డా నూతన అధ్యక్షుడిగా ఎన్నికయిన తర్వాత అన్ని రాష్ట్రాలకు నూతన అధ్యక్షుల్ని నియమించుకోవాల్సి వుంది. ఇప్పటికే చాలా రాష్ట్రాల్లో ఈ కార్యక్రమం పూర్తి చేసారు. పొరుగు తెలుగు రాష్ట్రం తెలంగాణకి కూడా నూతన అధ్యక్షుడ్ని నియమించటం జరిగింది. నిన్ననే గుజరాత్ కి, లడఖ్ కి కూడా కొత్త అధ్యక్షులను నియమించారు. బిజెపి అత్యున్నత స్థాయి పార్లమెంటరీ బోర్డ్ ని పునర్నియమించాల్సి వుంది. ఇప్పటికే ఇది ఆలస్యమయిందని అనుకుంటున్నారు. పోయిన బోర్డులో వున్న అరుణ్ జైట్లీ, సుష్మా స్వరాజ్, అనంతకుమార్ చనిపోవటంతో ఖాళీలు ఏర్పడ్డాయి. ఈవారం లో ఈ బోర్డు నియామకం జరుగుతుందని చెబుతున్నారు. ఈ లోపలే మిగతా రాష్ట్ర అధ్యక్షుల పై కూడా నిర్ణయం వెలువడుతుందని వార్తలు వస్తున్నాయి. అంటే ఈ వారంలోనే ఈ నియామకం ఉండొచ్చు.
ఇప్పటికే కొత్త రాష్ట్ర అధ్యక్షుడి ఎవరు అవ్వొచ్చు అనేదానిపై రక రకాల ఊహాగానాలు బయటకు వచ్చాయి. కానీ బిజెపి ఆలోచనలను అంచనా వేయటం అంత తేలిక కాదు. నిన్న నియమించిన గుజరాత్ అధ్యక్షుడు పేరు అందర్నీ ఆశ్చర్యం లో ముంచింది. సి ఆర్ పాటిల్ అసలు గుజరాతీనే కాదు. ఆయన మరాఠీ . అయితే ఆయన ఇప్పటికే గుజరాత్ నుంచి ఎంపి గా ఎన్నికయ్యాడు. అయినా గుజరాతేతరుడ్ని గుజరాత్ కి రాష్ట్ర అధ్యక్షుడిగా నియమించటం పెద్ద సాహసమే. మోడీ నే స్వయంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది. అలాగే ముఖ్యమంత్రుల ఎన్నిక కూడా విన్నూత్నంగానే వున్నాయి. అప్పట్లో మహారాష్ట్రకు ఓ బ్రాహ్మణున్ని ఎంపిక చేయటం, హర్యానాకు జాటేతరుడ్ని , ఝార్ఖండ్ కి ఆదివాసేతరుడ్ని నియమించి సంచలనం సృష్టించారు. అంటే కులము, ప్రాంతం కూడా అధిగమించి నియామకాలు చేసిన ఘనత బిజెపి నాయకత్వానికి వుంది. మరి ఇప్పుడు ఎటువంటి సంచలన నిర్ణయం వెలువడుతుందోనని అందరూ ఉత్కంటగా ఎదురుచూస్తున్నారు. ఈ నియామకం అయిన తర్వాతనయినా బిజెపి రాష్ట్రం లో సరైన కార్యాచరణ తో ముందుకెల్తుందని ఆశిద్దాం. చివరగా ఒక్కమాట : ఈ నూతన అధ్యక్షుడి నియామకం తో పాటు పవన్ కళ్యాణ్ కూడా సినిమాలు పూర్తి చేసుకొని బిజెపి తో కలిసికట్టుగా ప్రజల ముందుకు వెళ్ళాల్సి వుంది.
An Independent Editor, Trend Stetting Analyst.
Read MoreWeb Title: Ap new bjp president this week
Get Latest Telugu News, Andhra Pradesh News , Entertainment News, Election News, Business News, Tech , Career and Religion News only on oktelugu.com